జెట్ స్పీడుతో  ఎంఎల్సీలుగా ప్రమాణస్వీకారం
x
MLCs KodandaRam and AliKhan with Revanth

జెట్ స్పీడుతో ఎంఎల్సీలుగా ప్రమాణస్వీకారం

ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ ఆలీఖాన్ తో శుక్రవారం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలోని తన ఛాంబర్లో ప్రమాణం చేయించారు.


రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇద్దరు నేతలు ఎంఎల్సీలుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ ఆలీఖాన్ తో శుక్రవారం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలిలోని తన ఛాంబర్లో ప్రమాణం చేయించారు. నిజానికి వీళ్ళు దాదాపు ఐదు నెలల క్రితమే ప్రమాణస్వీకారం చేయాల్సింది. అయితే అప్పట్లో మండలి ఛైర్మన్ గుత్తా సహకరించలేదు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలు దాసోజె శ్రవణ, కుర్రా సత్యానారాయణ కోర్టులో కేసు వేశారు. దాంతో హైకోర్టు కోదండరామ్, ఆలీఖాన్ ప్రమాణస్వీకారంపై స్టే విధించింది. అప్పటినుండి ఎంఎల్సీలుగా ప్రమాణం చేయటానికి వీళ్ళిద్దరు వెయిట్ చేస్తున్నారు.

వీళ్ళ వివాదానికి కొంత చరిత్రుంది. అదేమిటంటే బీఆర్ఎస్ హయాంలో కేసీయార్ మంత్రివర్గం దాసోజు, కుర్రాను ఎంఎల్సీలుగా ప్రతిపాదించి గవర్నర్ ఆమోదం కోసం ఫైలు పంపింది. అయితే గవర్నర్ కోటాలో నామినేట్ అయ్యేవాళ్ళు ఏదో రంగంలో నిష్ణాతులయ్యుండాలే కాని అచ్చంగా రాజకీయ నేతలను అంగీకరించేదిలేదని అప్పటి గవర్నర్ తమిళిసై అడ్డం తిరిగారు. అడ్డం తిరిగి గవర్నర్ ఫైలును రెజెక్టు చేశారా అంటే చేయలేదు. ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన దగ్గరే నెలలపాటు అట్టిపెట్టుకున్నారు. కొద్దినెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా అప్పుడు ఫైలును తిరస్కరించి ప్రభుత్వానికి పంపారు. ఎన్నికలు ముంచుకొచ్చేస్తున్న నేపధ్యంలో కేసీఆర్ కూడా ఈ ఫైలుపై నిర్ణయం తీసుకోలేదు.

తర్వాత ఎన్నికలు రావటం, బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే గవర్నర్ కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్ధానాలకు ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ ఆలీఖాన్ ను ఎంఎల్సీలుగా ప్రతిపాదించారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఫైలుకు వెంటనే తమిళిసై ఆమోదం తెలిపారు. దాంతో బీఆర్ఎస్ నేతలకు మండిపోయింది. తమనేమో అచ్చంగా రాజకీయనేతలన్న కారణంగా తిరస్కరించిన తమిళిసై మరి ఏ పద్దతిలో కోదండరామ్, ఆలీఖాన్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటు మండిపోయారు.

గవర్నర్ నిర్ణయంపై మండిపోవటమే కాకుండా ఇదే వాదనతో హైకోర్టులో కేసు కూడా వేశారు. వీళ్ళిద్దరి వాదన ఏమిటంటే కోదండరామ్, ఆలీఖాన్ స్ధానంలో తమను ఎంఎల్సీలుగా కోర్టు నిర్ణయించాలని. ఇది జరిగేపని కాకపోయినా దాసోజు, కుర్రా అదే కోరుకున్నారు. దీనికి తగ్గట్లే హైకోర్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంపై స్టే విధించింది. విచారణ తర్వాత దాసోజు, కుర్రా వాదనతో ఏకీభవించింది. దాంతో ప్రభుత్వం సుప్రింకోర్టులో అప్పీల్ చేసింది. హైకోర్టు తీర్పును పరిశీలించిన సుప్రింకోర్టు స్టేని కొట్టేసింది. ఎంఎల్సీల నియామకంలో ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులు జోక్యం చేసుకునేందుకు లేదని స్పష్టంగా చెప్పింది. ఎవరిని నియమించాలన్నది పూర్తిగా ప్రభుత్వ ఇష్టమేనంటు స్పష్టంగా గురువారం తీర్పిచ్చింది. తీర్పు ఆధారంగా కోదండరామ్, ఆలీఖాన్ శుక్రవారం ఉదయమే ప్రమాణస్వీకారం చేసేశారు.

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే ఆలస్యం చేస్తే మళ్ళీ దాసోజు, కుర్రా ఎక్కడ రివ్యూ పిటీషన్ వేస్తారో అన్న ఆతృతతో ఇద్దరు ఎంఎల్సీలుగా ప్రమాణస్వీకారం చేసేశారు. అలాగే ఒకపుడు వీళ్ళతో ప్రమాణస్వీకారం చేయించటంలో జాప్యం చేసిన మండలి ఛైర్మన్ గుత్తా కూడా అర్జంటుగా వీళ్ళతో ప్రమాణం చేయించేశారు. వీళ్ళతో శుక్రవారం ఉదయమే ప్రమాణం చేయించటంలో గుత్తాకి తన కారణాలు తనకున్నది. అదేమిటంటే అప్పట్లో బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లే గుత్తా నడుచుకున్నారు కాబట్టే ప్రమాణ స్వీకారం చేసేందుకు వచ్చిన కోదండరామ్, ఆలీఖాన్ కు అందుబాటులో లేరు. దాంతో అప్పట్లో ప్రమాణం వాయిదాపడటం, వెంటనే కారుపార్టీ నేతలు కోర్టులో కేసు వేయటం జరిగిపోయింది. ఇపుడు కేసీఆర్ కు గుత్తాకు బాగా గ్యాప్ పెరిగిపోయింది. ఇదే సమయంలో గుత్తా కాంగ్రెస్ ప్రభుత్వానికి బాగా దగ్గరయ్యారు. అందుకనే తీర్పు రావటం ఆలస్యం ప్రభుత్వ నిర్ణయం ప్రకారం శుక్రవారం ఉదయమే కోదండరామ్, ఆలీఖాన్ తో గుత్తా ప్రమాణస్వీకారం చేయించేశారు.

Read More
Next Story