![KTR | యూజీసీ కొత్త నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ KTR | యూజీసీ కొత్త నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ](https://telangana.thefederal.com/h-upload/2025/02/06/510911-ugc.webp)
KTR | యూజీసీ కొత్త నిబంధనలు సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ
అసలేంటీ యూజీసీ కొత్త నిబంధనలు. అందులో ఏముందని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(UGC)లో కేంద్రం ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వైస్ ఛాన్సలర్లతో పాటు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, ప్రొఫెసర్ల నియామకాలు, పదోన్నతులపై ఈ మేరకు కొత్త నిబంధనల డ్రాఫ్ట్‌ను కేంద్రం విడుదల చేసింది. కొన్ని రోజులుగా యూజీపీ కొత్త నిబంధనలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ కొత్త నిబంధనలకు కొందరు మద్దతు పలుకుతుంటే మరికొందరు మాత్రం తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో అధికార ప్రతిపక్షాలు రెండూ కూడా ఈ విషయంలో ఒకే తాటిపై నడుస్తున్నాయి. తెలంగాణతో పాటు యూజీసీ కొత్త నిబంధనలను కర్ణాటక, కేరళ, తమిళనాడు సహా పలు రాష్ట్రాలు కూడా వ్యతిరేకిస్తున్నాయి.
యూజీసీ ముసాయిదా నిబంధనలు ఇవే..
- చివరిసారిగా 2018లో యూజీసీ నిబంధనలను విడుదల చేశారు. తాజాగా వీటిలో కొన్ని మార్పులు తీసుకొస్తూ కొత్త ముసాయిదాను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏంటంటే..
- అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ నియామకాలన్నీ అఖిల భారత స్థాయిలో ఇచ్చే ప్రకటన ఆధారంగా, మెరిట్ ప్రాతిపదికన జరుగుతాయి.
- నాలుగేళ్ల డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత పీహెచ్‌డీ సబ్జెక్టులో చేస్తే, పీహెచ్‌డీ చేసిన సబ్జెక్టులో నియామకాలకు పొందే అర్హత కలిగి ఉంటారు.
- నాలుగేళ్ల డిగ్రీ, పీజీ ఒక సబ్జెక్టులో చదవి, నెట్ లేదా సెట్(జాతీయ అర్హత పరీక్ష లేదా రాష్ట్ర అర్హత పరీక్ష)లో వేరొక సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధిస్తే ఆ సబ్జెక్టులోనే నియామకాలకు వీలుంటుంది.
వైస్ ఛాన్సలర్ల నియామకాలపై
- వైస్ ఛాన్సలర్గా ఎంపికయ్యే వ్యక్తికి ఉన్నత విద్యాసంస్థలు లేదా రీసర్చ్/అకడమిక్ అడ్మినిస్ట్రేటివ్ సంస్థల్లో సీనియర్ స్థాయి హోదా లేదా పరిశ్రమలు/పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/పబ్లిక్ పాలసీ ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యాపరంగా ఉన్నతమైన సేవలందించి, పదేళ్ల అనుభవం ఉండాలి.
- పత్రికల్లో లేదా బహిరంగ ప్రకటన ఇచ్చి దరఖాస్తులు స్వీకరించాలి. నామినేషన్ లేదా సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ ప్రక్రియ ద్వారా దరఖాస్తులు తీసుకోవచ్చు.
- సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీలో ముగ్గురు నిపుణులు ఉంటారు. ఈ కమిటీని గవర్నర్ నియమిస్తారు.
- విజిటర్ లేదా ఛాన్సలర్ ఎంపిక చేసిన నామినీ, సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీకి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు.(సహజంగానే రాష్ట్ర యూనివర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ వ్యవహరిస్తారు. కేంద్రీయ వర్సిటీలకు రాష్ట్రపతి విజిటర్గా ఉంటారు.)
- యూజీసీ చైర్మన్ తరఫున నామినీ ఉంటారు. మరో నామినీ యూనివర్సిటీ ఉన్నతస్థాయి కమిటీ (సిండికేట్ లేదా సెనేట్ లేదా కార్యనిర్వాహక మండలి లేదా మేనేజ్మెంట్ బోర్డు) నుంచి ఉంటారు.
- సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ సమావేశమై వైస్ ఛాన్సలర్ల కోసం వచ్చిన దరఖాస్తులపై పరిశీలన చేసి 3-5 పేర్లను విజిటర్ లేదా ఛాన్సలర్కు పంపించాలి.
- కమిటీ పంపిన పేర్ల నుంచి ఒకరిని వైస్ ఛాన్సలర్గా నియమించే అధికారం ఛాన్సలర్ లేదా విజిటర్కు ఉంటుంది.
- బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి వైస్ ఛాన్సలర్ ఐదేళ్లపాటు లేదా 70 ఏళ్లు వచ్చే వరకు పదవిలో ఉంటారు. వయో పరిమితి మించకుంటే రెండోసారి కూడా వైస్ ఛాన్సలర్గా ఎంపిక చేయొచ్చు.
యూజీసీ నిబంధనలను వ్యతిరేకిస్తున్నాం: రేవంత్
అయితే యూజీసీ కొత్త నిబంధనలను తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్ఫష్టతనిచ్చారు. ఈ నిబంధనలు రాష్ట్రాల హక్కులను హరించేలా ఉన్నాయని, వీటిని కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త నిబంధనల ద్వారా యూనివర్సిటీల్లో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రను తగ్గించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న హక్కులను కేంద్రప్రభుత్వం కాలరాస్తోంది. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్రం కుట్రలు చేస్తోంది. వీటిని ఎలాగైనా అడ్డుకోవాల్సిందే’’ ఇవి బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. తెలంగాణలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల(వీసీ) నియామకాన్ని యూజీసీ ద్వారా చేపట్టే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. యూజీసీ ద్వారా రాష్ట్రంలోని వర్సిటీలపై కేంద్రం పెత్తనం చేసే ప్రయత్నం ఏమాత్రం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది వర్సిటీల స్వయం ప్రతిపత్తిని హరించాలని కేంద్రం పన్నుతున్న కుట్రేనని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని వ్యాఖ్యానించారు. తాజాగా ఈ నిబంధనలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కేంద్రంమంత్రికి అభ్యంతరాలు చెప్పాం: కేటీఆర్
ఈ నిబంధనలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయన్నారు కేటీఆర్. ఈ నూతన మార్గదర్శకాలపై తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు నివేదించామని వెల్లడించారు. రాష్ట్ర వర్సిటీల్లో సెర్చ్ కమిటీల బాధ్యతను గవర్నర్‌కు అప్పగించే నిబంధనలను రూపొందించాలని కోరామని ఆయన చెప్పారు. ‘‘నూతన నిబంధనల వల్ల ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. గవర్నర్ ద్వారా వర్సిటీలను కేంద్రం ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తోంది. యూజీసీ నిబంధనలు అభ్యంతరాలపై 6పేజీల నివేదికను కేంద్రమంత్రికి అందించాం. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా నిర్ణయం తీసుకోవద్దని కోరాం’’ అని కేటీఆర్ వెల్లడించారు.