ముస్లిం పెళ్లి ఆడంబరాలపై ఉలేమాల ఉద్యమం, ఏం చేస్తున్నారంటే...
x
తెహ్రీక్ మస్నూన్ నిఖా సంస్థ సమావేశంలో పాల్గొన్న ముస్లిం మతపెద్దలు

ముస్లిం పెళ్లి ఆడంబరాలపై ఉలేమాల ఉద్యమం, ఏం చేస్తున్నారంటే...

ముస్లిం వివాహ వేడుకల్లో ఖర్చులు తగ్గించేందుకు హైదరాబాద్ ముస్లిం మత పెద్దలు ఉద్యమం చేపట్టారు.అతిథులకు టీ ఇచ్చి మసీదుల్లోనే పెళ్లిళ్లు చేయాలని తీర్మానించారు.


హైదరాబాద్ నగరంలో కొందరు ముస్లింలు వివాహ వేడుకలు అత్యంత ఆడంబరంగా చేస్తున్నారు. నిశ్ఛితార్థం నుంచి పెళ్లి, సామాగ్రి కొనుగోలు, వరకట్నం,వలీమా విందు వరకు లక్షలాది రూపాయల ఖర్చు అవుతోంది. దీంతో ఆర్థిక భారం వల్ల పేద యువతుల వివాహాలు కావడం లేదు. ఇది ముస్లిం సమాజంలో పెద్ద సమస్యగా మారింది.

‘‘వృథా ఖర్చు చేసే వారు సైతాన్ సోదరులు’’అని దివ్య ఖురాన్ చెబుతోంది. ‘‘అత్యంత తక్కువ ఖర్చుతో చేసిన పెళ్లి శుభవంతం అవుతుంది’’అని ముస్లింల కీలక గ్రంథం ‘హదీస్’ చెబుతోంది.ఖురాన్, హదీస్‌ల స్ఫూర్తితో హైదరాబాద్ నగరంలోని ముస్లిం మత పెద్దలు పెళ్లి ఖర్చులు తగ్గించేందుకు వినూత్న ఉద్యమం చేపట్టారు.
- హైదరాబాద్ నగరంలోని జమాఅతే ఇస్లామీ హింద్, ముస్లిం పర్సనల్ లా బోర్డు, మూవ్ మెంట్ ఆఫ్ పీస్ అండ్ జస్టిస్, ముస్లిం పండితులు, ముస్లిం సంఘాల మత పెద్దలు సమావేశమై వివాహాలను సులభతరం చేసేందుకు వీలుగా ‘తెహ్రీక్ మస్నూన్ నిఖా’ పేరిట ఓ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేసి ఉద్యమం చేపట్టారు.
- ముస్లింలలో మంగ్నీ(నిశ్చితార్థం), నిఖా (వివాహం), వరకట్నం, జహేజ్( పెళ్లి బట్టలు, సామాగ్రి కొనుగోలు),పెళ్లి రివాజుల పేరిట వధువు కుటుంబపై ఆర్థిక భారం పడుతోంది. దీంతో పేదలు తమ కుమార్తెలకు వివాహాలు చేయాలంటే తలకు మించిన భారంగా మారింది. అందుకే ఎలాంటి ఖర్చులు లేకుండా పెళ్లిని సాధారణ వేడుకగా చేయాలని ముస్లిం మత పెద్దలు ప్రచారం చేపట్టారు.

పెరిగిన పెళ్లి ఖర్చులు
ముస్లింలలో పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి. పెళ్లి అంటే ఖరీదైపోయింది.దేశంలో ముస్లింలు చదువులపై కంటే కూడా పెళ్లి కోసమే ఎక్కువ ఖర్చుపెడుతున్నారు. 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో జరిగిన ముస్లిం వివాహాలకు 4.72 ట్రిలియన్ డాలర్ల ఖర్చు అయినట్లు ఓ అంచనా. అది కాస్త 2023-2024 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 5.52 ట్రిలియన్ డాలర్లకు పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయని పాత బస్తీకి చెందిన ఇస్లామిక్ కాలమిస్ట్ ముహమ్మద్ ముజాహిద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.


ఆడబిడ్డల తల్లిదండ్రుల ఆందోళన
ఇంట్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయి ఉందంటే చాలు పెళ్లి ఖర్చుల గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.అమ్మాయి పెళ్లితో ఎంతోమంది తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వరుడి తల్లిదండ్రులు పెట్టే డిమాండ్స్ తీర్చేందుకు అమ్మాయి తల్లిదండ్రులు లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.

పెళ్లి తంతుతో అనర్థాలెన్నో...
ముస్లిమ్ సామాజిక వర్గంలో పెళ్లి తంతు ఎన్నో అనర్థాలకు కారణమవుతోంది.వివాహ వేడుకలకు వధువు కుటుంబంపైనే ఎక్కువ ఆర్థిక భారం పడుతోంది.దీంతో ఆడబిడ్డల తల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోతున్నారు.పెళ్లి శుభలేఖ దగ్గర నుంచి వివాహ మండపాల అలంకరణ వరకు, పెళ్లిబట్టల నుంచి నగల కొనుగోలు వరకు, టిఫిన్ల దగ్గర నుంచి విందు భోజనాల వరకు అన్నింటా ప్రత్యేకంగా ఉండాలనే స్టేటస్ కు పోయి అమ్మాయిల తల్లిదండ్రులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని ‘తెహ్రీక్ మస్నూన్ నిఖా’ కన్వీనర్, జమాఅతే ఇస్లామీ హింద్ కార్యదర్శి డాక్టర్ ఉస్మాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

నిరాడంబరంగా వివాహాలు చేయాలని ముస్లిం మత పెద్దల తీర్మానం
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అర్థరాత్రి దాటిన తర్వాత జరిపే బారాత్ ల హంగామా గురించి చెప్పనక్కర లేదు.హైదరాబాద్ సిటీలో ముస్లిమ్ వివాహ వేడుకల్లో సంస్కరణలు చేపట్టేందుకు ముస్లిం ఉలేమాలు ముందడుగు వేశారు.ముహమ్మద్ ప్రవక్త చెప్పిన సంప్రదాయక పద్ధతిలో వివాహాలను జరిపిస్తే ఖర్చు తగ్గించుకోవచ్చని ఉలేమాలు చెబుతున్నారు. వివాహాలను ఫంక్షన్ హాళ్లలో కాకుండా మసీదుల్లో నిరాడంబరంగా చేయాలని ముస్లిం మతపెద్దలు ప్రచారం చేపట్టారు. నిఖా (పెళ్లి) వేడుకకు వచ్చిన అతిథులకు కేవలం టీ, బిస్కెట్ ఇచ్చి చేయాలని మత పెద్దలు తీర్మానం చేశారు. తెహ్రీక్ మస్నూన్ నిఖా తీర్మానం చేయడమే కాకుండా తామంతా దీనికి కట్టుబడి ఉంటామని ప్రతిన బూనారు.


వ‌ృథా ఖర్చుకు అడ్డుకట్ట వేస్తాం
తెహ్రీక్ మస్నూన్ నిఖా సంస్థ సభ్యులు, ముస్లిం మతపెద్దలు పాతబస్తీ చార్మినార్ సమీపంలోని గుల్జార్ ఫంక్షన్ హాల్లో సమావేశమయ్యారు. పెళ్లి, వలీమా వేడుకల పేరుతో జరుగుతున్న వృథా ఖర్చుకు అడ్డుకట్ట వేయాలని ఉలేమాలు పలు తీర్మానాలు చేశారు. ‘అత్యంత తక్కువ ఖర్చుతో కూడిన వివాహమే శుభవంతమైనది’ అన్న ముహమ్మద్ ప్రవక్త ప్రవచమే ప్రేరణగా పిల్లల పెళ్లిళ్లు నిరాడంబరంగా జరిపించాలని జమాఅతె ఇస్లామీహింద్ తెలంగాణ ఉపాధ్యక్షులు హాఫిజ్ రషాదుద్దీన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అనవసర వేడుకలు వద్దు
పెళ్లిని సులభతరం చేసి, వివాహ వేడుకల్లో అనవసరమైన మంగ్నీ(నిశ్చితార్థం వేడుక), మెహందీ, హల్దీ, బారాత్ లాంటి దురాచారాలను నివారించాలని తెహ్రీక్ మస్నూన్ నిఖా సభ్యుల సమావేశం తీర్మానించింది. వివాహాన్ని మసీదులో చేసి, అమ్మాయి తల్లిదండ్రులకు విందు ఖర్చు లేకుండా చేయాలని తీర్మానించారు.పెళ్లిలో విందు లేకుండా కేవలం తేనీటితో జరిగే పెళ్లిళ్లను ప్రోత్సహించాలని, అబ్బాయి తరపు వారు ఇచ్చే వలీమా విందును నిరాడంబరంగా జరిపించాలని ఉలేమాలు పిలుపునిచ్చారు.

అత్యంత సాదాసీదాగా వివాహాలు
అత్యంత సాదాసీదాగా తక్కువ ఖర్చుతో వివాహాలు చేయాలని నిర్ణయించారు. దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు.పెళ్లి వేడుకల్లో బ్యాండు బాజాలు, బాణాసంచా కాల్పులు, వీడియోగ్రఫీ, ఖరీదైన వేదికలు లేకుండా తక్కువ ఖర్చుతో పెళ్లిళ్లు జరిపించాలని ఉలేమాలు తీర్మానించారు. ఈ సమావేశంలో ముస్లిమ్ పర్సనల్ లా బోర్డు అధ్యక్షులు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహ్మానీ, ఇస్లామిక్ పండితులు మౌలానా జాఫర్ పాషా సానీ, హాఫిజ్ రషాదుద్దీన్,మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు.


Read More
Next Story