సంచలనంగా మారిన దివ్యాంగురాలి ఆత్మహత్య
x

సంచలనంగా మారిన దివ్యాంగురాలి ఆత్మహత్య

మీర్ పేట పోలీసుల దర్యాప్తులో శ్రీకాంత్ అనే యువకుడి వేధింపులు వెలుగులోకి


కామాంధుడి వేధింపులు తాళ లేక ఓ దివ్యాంగురాలు సుసైడ్ చేసుకుంది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేటలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రకాశం జిల్లా అన్నంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దశాబ్దం క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి అల్మా‌సగూడలో నివాసముంటున్నాడు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు దివ్యాంగ కుమార్తెలున్నారు. ఇద్దరూ కూడా చెవిటి, మూగ. పెద్ద కుమార్తె ఇంటి వద్దే ఉంటుంది. అదే బస్తీలో ఉండే శ్రీకాంత్‌ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని అడ్డం పెట్టుకుని ప్రతీరోజూ ఇంటికి వచ్చేవాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉండేవాళ్లు కాదు. ఉదయం వెళ్లి రాత్రికి వచ్చేవాళ్లు. ఇద్దరూ దినసరి కూలీలే. ఇంటి సంపాదన అంతంత మాత్రమే కావడంతో పెద్ద కుమార్తె టైలరింగ్ నేర్చుకుని తల్లిదండ్రులకు ఆసరైంది. పక్షం రోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై శ్రీకాంత్‌ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ యువతిని చంపేస్తానని బెదిరించి వశపరచుకున్నాడు. దివ్యాంగురాలు కావడంతో పెద్దగా ప్రతిఘటించలేకపోయింది. దీన్ని ఆసరాగా చేసుకుని ఆ యువకుడు ప్రతీరోజు ఇంటికి వచ్చి అత్యాచారం చేసేవాడు. ఒక రోజు దివ్యాంగురాలు బ్లేడ్ తో ఆత్మ హత్యాయత్నం చేసింది. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్చి రక్షించారు.

మరుసటి రోజూ మళ్లీ వచ్చిన యువకుడిని దివ్యాంగురాలు ప్రతిఘటించలేకపోయింది. ప్రతీరోజు ఆమెపై శ్రీకాంత్‌ అత్యాచార యత్నం చేసేవాడు. తల్లిదండ్రులకు విషయం చెబితే చంపేస్తానని శ్రీకాంత్‌ బెదిరించడంతో దివ్యాంగురాలు మరో దివ్యాంగురాలైన చెల్లెలికి తెలిపింది. తనవల్ల తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందన్న భయంతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్‌ వేధింపులు భరించలేక తమ కుమార్తె అత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసులకు ఆలస్యంగా ఫిర్యాదు చేశారు. పరారీలో ఉన్న శ్రీకాంత్ కోసం గాలిస్తున్నారు.

Read More
Next Story