టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు ఊహించని షాక్
ప్రభాకరరవును ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరగుతుండగానే తాజాగా ఆయనకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు(America Green Card) మంజూరు చేసినట్లు తెలిసింది.
తెలంగాణాలో సంచలనం సృష్టించిన టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు ఊహించని షాక్ తగిలిందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది ప్రభుత్వ వర్గాల నుండి. అమెరికాలో ప్రభాకరరావుకు గ్రీన్ కార్డు మంజూరైనట్లు సమాచారం. మార్చి నుండి టెలిఫోన్ ట్యాపింగ్(Telephone Tapping) పై ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఎంతమందిని పోలీసులు అరెస్టుచేసినా, విచారించినా కేసు లాజికల్ ఎండ్ కు రావాలంటే బీఆర్ఎస్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్(Intelligence Chief Prabhakar Rao) గా పనిచేసిన టీ. ప్రభాకరరావును విచారించనిదే సాధ్యంకాదు. ఎందుకంటే ఇప్పటివరకు ట్యాపింగ్ కేసులో అరెస్టయిన పోలీసు అధికారులందరు చెప్పిన ఏకైక పేరు ప్రభాకరరావుదే. అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేసిన ప్రభాకరరావు ఆదేశాల ప్రకారమే తాము టెలిఫోన్ ట్యాపింగ్ చేసినట్లు తమ అఫిడవిట్లలో పోలీసు అధికారులు చెప్పిన విషయం తెలిసిందే. కాబట్టి ప్రభాకరరావును విచారించనిదే కేసు ముందుకు సాగదు.
టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలని ఎవరు ఆదేశిస్తే ప్రభాకరరావు కిందస్ధాయి అధికారులతో ట్యాపింగ్ చేయించారన్న విషయంలో క్లారిటిరాదు. ఈ క్లారిటి రావాలంటే పోలీసులు(Telangana Police) కచ్చితంగా ప్రభాకరరావును విచారించాల్సిందే. బీఆర్ఎస్(BRS) హయంలో కొన్ని వేల ఫోన్లు ట్యాపింగ్ జరిగింది. ఏ ప్రభుత్వమైనా పాలనలో భాగంగా కొందరి ఫోన్లను ట్యాపింగ్ చేయించటం చాలా సహజం. ప్రభుత్వానికి ముప్పు వస్తుందని అనుమానించిన అసాంఘీక శక్తుల ఫోన్లను, ప్రజాభద్రతకు ముప్పుందని అనుమానించిన వాళ్ళ ఫోన్లను ప్రభుత్వం ట్యాపింగ్ చేయిస్తునే ఉంటుంది. ఇందులో తప్పుకూడా ఏమీలేదు. అయితే కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్ళు ప్రతిపక్ష నేతలు, వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, సెలబ్రిటీలు, జర్నలిస్టులు, యూనియన్ల నేతలతో పాటు చివరకు జడ్జీల్లో కొందరి కుటుంబసభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేయించిందనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసి ఎన్నికల్లో ముప్పుతిప్పలు పెట్టారు. ఈ విషయాలన్నింటినీ రిమాండులో ఉన్న పోలీసు అధికారులు విచారణలో చెప్పిదే.
అరెస్టయిన పోలీసు అధికారుల వాగ్మూలం ఆధారంగానే పోలీసులు ప్రభాకరరావుపైన కేసు నమోదు చేసి విచారించాలని నిర్ణయించారు. మార్చి 10వ తేదీన టెలిఫోన్ ట్యాపింగ్ పై కేసు నమోదు అయిన విషయం తెలియగానే 11వ తేదీన ప్రభాకరరావు అమెరికా(America)కు జంప్ అయిపోయారు. అప్పటినుండి ఆయన అమెరికాలోనే ఉండిపోయారు. అమెరికా నుండి ప్రభాకరరావును ఇండియా రప్పించేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావటంలేదు. ట్యాపింగ్ కేసులో ప్రభాకరరావుపై కేసు నమోదు అయిన విషయాన్ని పోలీసులు మెయిల్ ద్వారా తెలియజేశారు. విచారణకు రమ్మని కోరితే అనారోగ్యం కారణంగా రాలేనని చెప్పారు. మెయిల్ ద్వారానే తనకు ప్రశ్నలు పంపిస్తే తాను సమాధానాలు ఇస్తానని చెప్పారు. మెయిల్ ద్వారా విచారణ సాధ్యంకాదని పోలీసులు గట్టిగా చెప్పటంతో తనకు హైబీపీ ఉందని అందుకు వైద్యం చేయించుకుంటున్నట్లు బదులిచ్చారు.
కొంతకాలం బీపీకి వైద్యం చేయించుకుంటున్నట్లు చెప్పిన ప్రభాకరరావు తర్వాత తనకు క్యాన్సర్ ఉందని అందుకు చికిత్స చేయించుకుంటున్నట్లు చెప్పారు. చికిత్స అయ్యేంతవరకు తాను అమెరికా వదిలి వచ్చేదిలేదని తెగేసిచెప్పారు. దాంతో ప్రభాకరరావుకు ఇండియాకు వచ్చే ఉద్దేశ్యంలేదని అర్ధమైపోయింది. హైదరాబాదుకు వస్తే ఏమవుతుందో బాగా తెలుసు కాబట్టే అమెరికాను వదలకూడదని అనుకున్నారు. దాంతో ప్రభాకరరావుతో మాట్లాడి లాభంలేదని అర్ధమైపోయి వెంటనే ఆయనపై లుకౌట్ నోటీసు(Lookout Notice) జారీచేశారు. అయితే దీనివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇండియాలో ఏ విమానాశ్రయంలో ప్రభాకరరావు దిగినా పట్టుకుని హైదరాబాదు పోలీసులకు సమాచారమిచ్చి, అప్పగించటమే లుకౌట్ నోటీసు ఉద్దేశ్యం. అసలు ఇండియాకే రాని ప్రభాకరరావుపై లుకౌట్ నోటీసు జారీచేయటం వల్ల ఏమిటి ఉపయోగం ? మూడు నెలల కాలపరిమితి వీసాతో అమెరికాకు వెళ్ళిన ప్రభాకరరావు వీసాను మరో ఆరుమాసాలు పొడిగించుకున్నారు.
లుకౌట్ నోటీసు ద్వారా పెద్దగా లభంలేదని అర్ధమైన తర్వాత ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ (Interpol Red corner Notice)నోటీసు జారీచేయించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రెడ్ కార్నర్ నోటీసు జారీచేసే విషయమై సీబీఐ అమెరికాలోని ఇంటర్ పోల్ అధికారులతో మాట్లాడుతున్నది. ఇది ఎప్పుడు జరుగుతుందో ఎవరికీ తెలీటంలేదు. ఎందుకంటే అమెరికాలోని వ్యక్తిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీచేయాలంటే చాలా పెద్ద తతంగం ఉంది. ముందుగా అమెరికాలోని కోర్టులో కేసు దాఖలు చేసి రెడ్ కార్నర్ నోటీసు జారీకి ఇంటర్ పోల్ అధికారులు అనుమతి తీసుకోవాలి. ఇది బాగా టైం పడుతోంది కాబట్టి ఈలోగా కేంద్రప్రభుత్వం ప్రబాకరరావుకు పాస్ పోర్టును రద్దుచేసింది. అయితే దీనివల్ల కూడా పెద్దగా ఉపయోగం ఉండదని తెలిసిందే. ఎందుకంటే తన పాస్ పోర్టు పోయిందని అమెరికాలోనే పోలీసులకు ఫిర్యాదు చేసి మరో పాస్ పోర్టు కాపీ తీసుకునే అవకాశం ప్రభాకరరవుకు ఉందని సమాచారం.
ఒకవైపు ప్రభాకరరవును ఇండియాకు రప్పించేందుకు ప్రయత్నాలు జరగుతుండగానే తాజాగా ఆయనకు అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డు(America Green Card) మంజూరు చేసినట్లు తెలిసింది. ఒకసారి గ్రీన్ కార్డు మంజూరైతే ప్రభాకరరావు ఎంతకాలమైనా అమెరికాలోనే ఉండే వెసులుబాటుంది. ప్రభాకరరావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీకీ ఇంటర్ పోల్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు దీనివల్ల మరింత ఆలస్యమవుతాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే ప్రభాకరరావును ఇండియాకు రప్పించే అవకాశాలు ఇప్పట్లో లేవని అర్ధమైపోతోంది. ప్రభాకరరావు అమెరికా నుండి హైదరాబాద్ వచ్చేంతలోపు ఇక్కడ ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అందుకనే ప్రొసీజర్ మార్చి భారత విదేశాంగ(External affairs ministry, హోంశాఖ(Home Department)ల ద్వారా అమెరికా ప్రభుత్వంపై బాగా ఒత్తిడిపెట్టి ప్రభాకరరావును ఇండియాకు రప్పించే అవకాశాలను పోలీసు ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే దీనికి ఎంతవరకు అవకాశం ఉందో తెలీటంలేదు.