Union Budget 2025 | కేంద్ర బడ్జెట్ లో  తెలంగాణ కు మొండిచేయి
x
పార్లమెంటులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం (ఫొటో : లోక్ సభ టీవీ సౌజన్యంతో)

Union Budget 2025 | కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు మొండిచేయి

కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారు.రాష్ఠ్ర పెండింగు ప్రాజెక్టులకు బడ్జెట్ లో నిధులు విదల్చలేదు.


కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు మొండి చేయి చూపించారు. దేశవ్యాప్తంగా అమలు చేసే సాధారణ పథకాలకు తప్ప తెలంగాణ రాష్ట్రానికి వివిధ పెండింగు ప్రాజెక్టుల కోసం కేంద్రం బడ్జెట్ లో నిధులు విదల్చలేదు.


బీహార్ రాష్ట్రానికే భారీ కేటాయింపులు
బీహార్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో ప్రాధాన్యమిచ్చారు. కేంద్ర నిధుల కేటాయింపుల్లో తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. బీహార్ రాష్ట్రంతోపాటు ఉత్తరాది రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి దక్షిణాదికి చెందిన తెలంగాణ కు రిక్తహస్తం చూపించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ లో నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. బీహార్ లోని పట్నా ఐఐటీ విస్తరణకు, మఖానా బోర్డు ఏర్పాటుకు, మిథిలాంచర్ వెస్టర్న్ కోసి కెనాల్, గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం, బడ్జెట్ లో నిధులు కేటాయించారు.

హైదరాబాద్ ఏఐ సిటీకి నిధులేవి?
ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి కేంద్రం రూ.500 కోట్లతో మూడు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించినా, హైదరాబాద్ నగరంలో ఏర్పాటు కానున్న ఏఐ సిటీకి నిధులు విదల్చలేదు.

గురజాడ ప్రస్థావనతో పొంగిపోయిన తెలుగు కేంద్రమంత్రులు
తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోయినా కేవలం గురజాడ ప్రస్థావనతో తెలుగు ప్రజలను సంతృప్తి పర్చాలని చూసినట్లుంది. కానీ తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు గురజాడ అప్పారావు ప్రస్థావన కేంద్ర బడ్జెట్ లో రావడంతో వారు పొంగి పోయారు. ఇద్దరు కేంద్ర మంత్రులు పోటీ పడి గురజాడ ప్రస్థావనపై ట్వీట్లు చేశారు.
‘‘ దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్!’’అన్న గురజాడ గారి మాటల ప్రేరణ తో వికసిత భారత నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. ‘‘ దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్” అని తెలుగు కవి గురజాడ గారు చెప్పిన మాటలను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ
అర్థం చేసుకున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ లో పోస్టు చేశారు. ప్రజలను దృష్టిలో పెట్టుకొని, వారి ప్రయోజనాలను ఆకాంక్షిస్తూ వికసిత్ భారత్ వైపు వేగంగా కేంద్రం అడుగులు వేస్తోందని బండి సంజయ్ పేర్కొన్నారు.

బడ్జెట్ లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులను మరిచారు : విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో తెలంగాణలోని పెండింగు ప్రాజెక్టులను మర్చిపోయారని తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. కేంద్ర బడ్జెట్ తూర్పు రాష్ట్రాలకు వెళ్లిందని దక్షిణాది రాష్ట్రాల వైపు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చూడలేదన్నారు. జనాభాలో 50 శాతం మంది నిరుపేదలని , వారిని అభివృద్ధిలోకి తీసుకువెళ్లాలంటే విద్యాభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని ఆయన కోరారు. విద్యా, ఉపాధి అవకాశాలతోనే పేదరికాన్ని రూపు మాపవచ్చన్నారు. కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థలను మూసేసి సంక్షోభం సృష్టిస్తుందన్నారు. పబ్లిక్ సెక్టార్ స్థానంలో ఉపాధి కల్పన కోసం చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి కేంద్ర బడ్జెట్ లో ప్రాధాన్యం ఇవ్వలేదని పీఎల్ విశ్వేశ్వరావు వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఉన్నత విద్యాభివృద్ధి కోసం 15 శాతం నిధులు కేటాయించాలని తాము ప్రతిపాదించామని, కానీ కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయించలేదని విశ్వేశ్వరావు ఆరోపించారు.

కేంద్ర బడ్జెట్ మహిళాభివృద్ధిని మరిచింది : డాక్టర్ లుబ్నా సార్వత్
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో మహిళల అభివృద్ధిని మరిచారని పర్యావరణ యాక్టివిస్ట్, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు డాక్టర్ లుబ్నా సార్వత్ చెప్పారు. మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా, వారి సంక్షేమానికి నిధులు కేటాయించలేదని ఆమె చెప్పారు. అభివృద్ధి పేరిట దేశంలో పర్యావరణానికి తీరని హాని చేస్తున్నారని డాక్టర్ లుబ్నా ఆరోపించారు. అడవుల నరికివేత, చెరువులు, నదీ స్థలాల ఆక్రమణలు,వాయు కాలుష్యం వల్ల పర్యావరణానికి తీరని విఘాతం కలుగుతుందన్నారు. పర్యావరణం దెబ్బతినడంతో వ్యాధులు ప్రబలి ప్రజలు రోగాల బారిన పడుతున్నారని డాక్టర్ లుబ్నా చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఆశించిన విధంగా నిధులు కేటాయించలేదని ఆమె చెప్పారు.



Read More
Next Story