మేము ఎప్పటి నుంచో సీబీఐ విచారణ అంటున్నాం-బండి
x

మేము ఎప్పటి నుంచో సీబీఐ విచారణ అంటున్నాం-బండి

కాంగ్రెస్ ప్రభుత్వం తమ దారిలోకి వచ్చిందని వ్యాఖ్యానించిన కేంద్రమంత్రి బండి సంజయ్


కాళేశ్వరం అవినీతిపై తాము మొదటి నుంచి సీబీఐ విచారణ కోరుతున్నామని కేంద్రమంత్రి బండి సంజయ్ గుర్తుచేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్‌ను కాపాడే ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ చర్యలు తీసుకోవడంలో జాప్యం చేసిందని ఆరోపించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐతో విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకోవడం పై ఆయన హర్షం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ పార్టీ బీజేపీ మొదటి నుంచి అనుసరిస్తున్న వైఖరే సరైందని మరోసారి స్పష్టమైందని బండి సంజయ్ అన్నారు. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలకు భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పూర్తి బాధ్యత వహించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. "ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం నిజానికి తలవంచి, ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు అంగీకరించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే సీబీఐకి లేఖ పంపాలి" అని బండి సంజయ్ అన్నారు.
గతంలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) టోల్ టెండర్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం సిట్‌ను ప్రకటించిందని, కానీ నేటికీ అది కార్యరూపం దాల్చలేదన్న బండి సంజయ్,రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ఒక డైలీ సీరియల్‌లా కొనసాగుతోందని విమర్శించారు.
Read More
Next Story