లిక్కర్ స్కాం.. ‘కేసీఆర్‌కు కూతురు కన్నా కేజ్రీవాలే ఎక్కువా?’
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. కేసీఆర్‌పై ప్రశ్నలు గుప్పించారు. కవిత అరెస్ట్ విషయంలో కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారని అడిగారు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కొన్ని రోజులుగా దేశమంతా హాట్‌టాపిక్‌గా మారింది. రోజుల వ్యవధిలోనే ఒక రాష్ట్ర సీఎం, మరో రాష్ట్ర మాజీ సీఎం కూతురు ఈ కేసులో అరెస్ట్ కావడంతో ఈ మద్యం కుంభకోణం దేశంలో సంచలనంగా మారింది. తాజాగా ఈ లిక్కర్ స్కాంకు సంబంధించిన అంశాలపై కేసీఆర్‌తో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. తప్పు చేసిన వారిని అరెస్ట్ చేయక మరేం చేస్తారో కేసీఆర్ చెప్పాలంటూ ప్రశ్నలు సంధించారు. తప్పు చేస్తే ఎవరినైనా కేంద్ర దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తాయని, చట్టం దృష్టిలో అందరూ సమానులేనంటూ హితవు పలికారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణకు రావాలంటూ ఈడీ పలుమార్లు సమన్లు జారీ చేసినా తమను కాదన్నట్టు బదులివ్వకుండా కూర్చున్నారని, అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్లు వాళ్ల పద్దతులను అనుసరించారని విమర్శలు గుప్పించారు. మద్యం కుంభకోణం విషయంలో బీజేపీ ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు.