
Urea dearth | రైతులను నిండాముంచుతున్న ‘యూరియా’ కొరత
అవసరమైన మేరకు యూరియా ఎరువులు దొరకక రైతులు నానా అవస్తలు పడుతున్నారు
తెలంగాణలో ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యలో కీలకమైనది యూరియా లభ్యత. అవసరమైన మేరకు యూరియా ఎరువులు దొరకక రైతులు నానా అవస్తలు పడుతున్నారు. విచిత్రం ఏమిటంటే రైతుల అవసరాల మేరకు యూరియాను కేంద్రప్రభుత్వం సరఫరాచేయటంలేదని తెలంగాణ(Telangana Government) ప్రభుత్వం తీవ్రంగా మండిపడుతోంది. ఇదేసమయంలో రాష్ట్రంలో అవసరాలకు మించే కేంద్రప్రభుత్వం యూరియా(Urea Problem)ను సరఫరా చేసిందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు(BJP President Ramachandra Rao) ప్రత్యారోపణలు గుప్పిస్తున్నారు. ఇద్దరిలో ఎవరు చెప్పేది నిజమో తెలీటంలేదుకాని యూరియా మార్కెట్లో అవసరమైనంత దొరకని కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నది మాత్రం వాస్తవం.
ఇదిలాగుంటే యూరియా అవసరమైన మేరకు దొరక్కపోగా అవసరంలేని ఎరువులను రైతులు కొనాల్సొస్తోంది. ఎందుకు కొనుగోలు చేయాల్సొస్తోందంటే యూరియా కావాలంటే పలానా ఎరువులను కొనాల్సిందే అని ప్రైవేటు డీలర్లు కండీషన్లు పెడుతున్నారు. దాంతో ఏమిచేయాలో దిక్కుతోచని రైతులు వేరేదారిలేక యూరియా కోసమని అవసరం లేని ఎరువులను కొనుగోలు చేయాల్సొస్తోంది. ఏప్రిల్-జూలై మధ్యలో సుమారు రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం. అయితే కేంద్రం పంపించింది కేవలం 4 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అని వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడుతున్నారు. దీనికి రామచంద్రరావు బదులిస్తు తెలంగాణకు మొత్తంమీద 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను పంపించింది అని పదేపదే చెబుతున్నారు. అవసరమైనంత యూరియాను కేంద్రం పంపిస్తున్నా మంత్రి తుమ్మల అవస్తవాలు చెబుతున్నారంటు రామచంద్రరావు ఎదురు ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే తుమ్మల చెబుతున్నదేమో ఈ సంవత్సరం ఏప్రిల్-జూలై మధ్య అవసరాలు, సరఫరా విషయాన్ని. బీజేపీ అధ్యక్షుడు చెబుతున్నదేమో పోయిన సంవత్సరం లెక్కలు. యూరియాను రైతులు ఎక్కువగా పత్తి, వరి, వేరుశెనగ పంటల్లో వాడుతుంటారు. రాష్ట్రవ్యాప్తంగా ఇపుడు పంటల సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పత్తి, ఇతర ఆరుతడి పంటలకు కలుపుతీసే సమయంలో ఎరువులు వేయాల్సుంటుంది. అందుకనే యూరియాను ఎక్కువగా కొంటారు. ఇక వరి రైతులు అయితే నాట్లువేసే సమయంలోనే యూరియాను ఉపయోగిస్తారు. అంటే రైతులకు రెండురకాలుగాను యూరియా వినియోగం చాలా ఎక్కువగా ఉంటుందని అర్ధమవుతోంది.
కొరత కారణంగానే సింగిల్ విండో, ఆగ్రోస్ లో రైతుకు కేవలం రెండు బస్తాల యూరియాను మాత్రమే ప్రభుత్వం రేషన్ పద్దతిలో అందిస్తోంది. మహబూబ్ నగర్, గద్వాల, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూలుతో పాటు నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని చాలాచోట్ల ఇదే పద్దతిని ప్రభుత్వం అమలుచేస్తోంది. యూరియాను ప్రైవేటు డీలర్ల ద్వారా కూడా ప్రభుత్వం సరఫరా చేయిస్తోంది. ప్రభుత్వం ఇస్తున్న 2 బస్తాల యూరియా రైతులకు ఏమూలకు సరిపోవటంలేదు. అందుకనే యూరియా సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం పదేపదే కేంద్రప్రభుత్వానికి లేఖలు రాస్తోంది. అయినా ఎలాంటి ఉపయోగం కనబడటంలేదు. కొరతను అవకాశంగా తీసుకుంటున్న ప్రైవేటు డీలర్లు రైతులను దోచుకునేస్తున్నారు. ఎలాగంటే తమ దగ్గర ఉన్న ఇతర ఎరువులను కొంటేనే తాము యూరియా బస్తా అమ్ముతామని రైతులకు కండీషన్ పెడుతున్నారు.
ప్రైవేటు డీలర్ల దోపిడీపై రైతులు ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నా పెద్దగా ఉపయోగం కనబడటంలేదు. ఒక్కో యూరియా 40 కిలోల బస్తా ధర 267 రూపాయలుంది. సింగిల్ విండోలు, ఆగ్రోస్ లో రైతుల కు ఇదే ధరకు అమ్ముతున్నా ప్రైవేటు డీలర్లు మాత్రం సుమారు 70 రూపాయల అధిక ధరలకు అంటకడుతున్నారు. అంతేకాకుండా తమదగ్గర ఉన్న ఇతర ఎరువులను కొంటేనే యూరియా బస్తాను అమ్ముతామని కండీషన్ పెడుతున్నారు. దాంతో యూరియా కావాలంటే అధిక ధరకు కొనుగోలుచేయటమే కాకుండా అవసరంలేని మరో ఎరువును కూడా రైతులు కొనాల్సొస్తోంది. ఈ విధంగా రెండు రకాలుగా రైతులు ముణిగిపోతున్నారు.
దోచుకుంటున్నారు : కసిరెడ్డి
తమ అవసరాలను గుర్తించిన ప్రైవేటు డీలర్లు రైతులను దోచుకుంటున్నట్లు ఖమ్మం రైతు కసిరెడ్డి మల్లారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు అవసరం లేకపోయినా ఇతర ఎరువులను ప్రైవేటు డీలర్లు కొనిపిస్తున్నట్లు కసిరెడ్డి ఆరోపించారు. యూరియా కొరతకు కారణం ఎవరో తెలీదుకాని తాము మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు మల్లారెడ్డి వాపోయారు.