
‘కమీషన్ల కోసమే కాళేశ్వరం’
మీరు చేసిన అప్పులకు ప్రతి ఏటా వడ్డీలు కట్టడమే సరిపోతుందన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి.
కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌నే పూర్తిగా బాధ్యులని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కేసీఆర్ స్వయంగా డిజైన్ చేసి, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే నిర్మించిన కాళేశ్వరం అదే కాలంలో కూలిపోయిందని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని వ్యాఖ్యానిస్తూ, సిగ్గుతో తలదించుకుని ఆ అంశంపై మాట్లాడటం మానేయాలని ఎద్దేవా చేశారు.
ఖర్చుకు వినియోగానికి సంబంధమే లేదు
బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా వినియోగించిన నీరు కేవలం 70 నుంచి 80 టీఎంసీలే అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రూ.1.80 లక్షల కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిరుపయోగంగా మారడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఘనతేనని విమర్శించారు. డిజైన్, అమలు దశల్లో జరిగిన లోపాల వల్లే ప్రాజెక్టు కూలిపోయిందని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు అనే విధంగా పదేళ్ల పాటు నీటి కేటాయింపులకు అంగీకరించారని ఉత్తమ్ గుర్తు చేశారు. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసే నిర్ణయమని వ్యాఖ్యానించారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం
పాలమూరు–రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ వంటి ప్రాజెక్టులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తి చేస్తుంటే తాము ఎవరైనా అడ్డుకున్నామా? అని ఉత్తమ్ ప్రశ్నించారు. ప్రజా సంక్షేమం కంటే కమీషన్లకే ప్రాధాన్యత ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని ఆరోపించారు. ఫలితంగా రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు.
గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీల రూపంలో ప్రస్తుతం ఏటా సుమారు రూ.16 వేల కోట్లు చెల్లించాల్సి వస్తోందని ఉత్తమ్ వెల్లడించారు. ఈ ఆర్థిక భారం రాష్ట్ర అభివృద్ధిని తీవ్రంగా ప్రభావితం చేస్తోందని పేర్కొన్నారు.
పాలమూరు–రంగారెడ్డిపై అన్యాయం
పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు ఇప్పటికీ పూర్తిస్థాయిలో పర్యావరణ అనుమతులు రాలేదని ఉత్తమ్ తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు రూ.5 వేల కోట్ల బిల్లులను బీఆర్‌ఎస్ ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయకుండానే పాలమూరు ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు.

