అసలు అన్యాయం బీఆర్ఎస్ పాలనలోనే జరిగింది: ఉత్తమ్
x

అసలు అన్యాయం బీఆర్ఎస్ పాలనలోనే జరిగింది: ఉత్తమ్

తెలంతాణకు రావాల్సిన ప్రతి చుక్క నీటి కోసం పోరాడుతుంది తమ ప్రభుత్వమేనన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.


తెలంగాణ నదీ జలాల సమస్యకు అసలు కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమేనంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ తీవ్ర అన్యాయం చేసిందని, నదీ జలాల విషయంలో గొప్పగా చేశామని వాళ్లు చెప్పుకోవడం తప్ప చేసిందేమీ లేదని చురకలంటించారు. కృష్ణ నదీ జలాల్లో తెలంగాణకు రావాల్సిన ఒక్క చుక్కను కూడా వదిలే ప్రసక్తే లేదని, ఆ దిశగానే తాము ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన వివరించారు. రాష్ట్ర అసెంబ్లీలో శనివారం.. రాష్ట్ర నదీ జలాల అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇందులో ఆయన పలు కీలక అంశాలను తెలిపారు.

కృష్ణా బేసిన్‌లోని ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు ప్రాంతంలో బీఆర్‌ఎస్ హయాంలో తట్టేడు మట్టికూడా ఎత్తి పోయలేదని తీవ్రంగా విమర్శించారు. పాలమూరు–రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభమైన తరువాతే కాళేశ్వరం ప్రాజెక్టు మొదలైందని గుర్తు చేశారు. అయినా ఇప్పటికీ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాలేదని అన్నారు. ఇది గత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. వచ్చే మూడేళ్లలో కృష్ణా బేసిన్ పరిధిలోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారు తొంభై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా పాలమూరు ప్రాజెక్టుకు కేవలం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరానికి అన్ని అనుమతులు తెచ్చుకున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరుకు మాత్రం ఇప్పటికీ పూర్తి అనుమతులు తీసుకురాలేదని విమర్శించారు. ఇది కావాలనే చేసిన నిర్లక్ష్యమని ఆరోపించారు. ఈ కీలక అంశంపై చర్చ జరుగుతున్న సమయంలో బీఆర్‌ఎస్ సభ్యులు సభకు హాజరు కాకపోవడం ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితిని సూచిస్తోందని అన్నారు.

కృష్ణా నదీ నీటి వాటాల విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు ఐదు వందల పన్నెండు టీఎంసీలుగా నీటి కేటాయింపులపై అప్పట్లోనే సంతకాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణకు కేవలం ముప్పై నాలుగు శాతం నీళ్లు సరిపోతాయని కేసీఆర్ హరీష్ రావులు అంగీకరించడం రాష్ట్రానికి తీరని నష్టం చేసిందని విమర్శించారు.

పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఇరిగేషన్ పేరుతో ఒక లక్ష ఎనభై వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసినప్పటికీ ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు మూడేళ్లలో పూర్తవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం ముప్పై ఐదు శాతం పనులే జరిగాయని తెలిపారు. మట్టి పనులు కాంక్రీట్ పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. కుర్చీ వేసుకుని కూర్చుని ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పిన కేసీఆర్ మాటలు అబద్ధమయ్యాయని ఎద్దేవా చేశారు.

కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు త్వరలో వెలువడే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. తాను స్వయంగా ట్రిబ్యునల్ ముందు వాదనలకు హాజరవుతూ తెలంగాణ హక్కుల కోసం పోరాడుతున్నానని చెప్పారు. కృష్ణా పరివాహక ప్రాంతంలో సుమారు డెబ్బై మూడు శాతం భూభాగం తెలంగాణలోనే ఉన్నందున రాష్ట్రానికి న్యాయమైన వాటా రావాల్సిందేనని స్పష్టం చేశారు. మొత్తం ఎనిమిది వందల పద్నాలుగు టీఎంసీల కృష్ణా నీళ్లలో తెలంగాణకు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై రెండు శాతం వాటా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని వెల్లడించారు.

ఈ చర్చలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ నదీ జలాల విషయంలో తెలంగాణ హక్కులను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఈ అంశంపై విస్తృత చర్చ కోసం అసెంబ్లీలో లఘు చర్చ ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంత కీలకమైన అంశంపై బీఆర్‌ఎస్ సభ్యులు సభకు హాజరు కాకపోవడం సరైన పద్ధతి కాదని వ్యాఖ్యానిస్తూ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్ పైనే ఉందని డిమాండ్ చేశారు.

Read More
Next Story