![ప్రభుత్వం వత్తిడిలో నివేదిక సమర్పిస్తే అసలుకే మోసం ప్రభుత్వం వత్తిడిలో నివేదిక సమర్పిస్తే అసలుకే మోసం](https://telangana.thefederal.com/h-upload/2025/02/07/511299-vakula-1.webp)
తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం
'ప్రభుత్వం వత్తిడిలో నివేదిక సమర్పిస్తే అసలుకే మోసం'
డెడికేటెడ్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తిని విడనాడకుండా స్థానిక సంస్థల్ల రిజర్వేషన్లను నిర్ణయించాలంటున్న వకుళాభరణం
తెలంగాణలోని స్థానిక సంస్థలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ప్రయత్నాలు మొదలుపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వత్తిళ్లకు లోనై ‘డెడికేటెడ్ కమిషన్’ ఆదరాబాదరాగా సమగ్ర అధ్యయనం చేయకుండా నివేదిక సమర్పిస్తే, అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉందని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం అభిప్రాయపడ్డారు.
ప్రభుత్వం ప్రకటించిన సామాజిక ఆర్థిక కుల సర్వే వివరాలలో, బీసీలతో పాటుగా ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంగా ,డెడికేటెడ్ కమిషన్ సమగ్ర విశ్లేషణలు, అధ్యయనాలతో నివేదిక రూపొందించాలని ఆయన సూచించారు.
ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే లెక్కల మీద ఆధారపడి ,స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ల శాతం నిర్ణయించడంలో , సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ప్రామాణిక పద్ధతులను పాటించని ఎడల, డెడికేటెడ్ కమిషన్ నివేదిక న్యాయస్థానాలలో వీగిపోయే (కొట్టివేయబడే) ప్రమాదం లేకపోలేదని వకుళాభరణం హెచ్చరిక చేశారుప.
శుక్రవారం నాడు హైదరాబాద్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక చేశారు.
కుల సర్వే (Caste Survey) లో తేల్చిన వివరాల ఆధారాలతో త్వరితగతిన స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తన నివేదికను సమర్పించాలని ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ పై వత్తిడి తెస్తున్నట్లు విశ్వసనీయమైన సమాచారం అందినదని ఆయన తెలిపారు.
గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలతో అక్కడ కమిషన్ నివేదిక సమర్పించినప్పుడు సుప్రీంకోర్టు కొట్టి వేసిన విషయాన్ని వకుళాభరణం గుర్తు చేశారు. అలాగే మధ్యప్రదేశ్, ఒడిస్సా, గుజరాత్ ,కర్ణాటక రాష్ట్రాలలో కూడా న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయి అని ఆయన వివరించారు.
సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం డాక్టర్ కె. కృష్ణమూర్తి ,వికాస్ కిషన్ రావు గవాలి కేసులలో ఇచ్చిన తీర్పులలో మార్గదర్శకాలను పరిశీలించినప్పుడు, ట్రిపుల్ టెస్టులలో భాగంగా డెడికేటెడ్ కమిషన్ ప్రతి గ్రామం యూనిట్ గా ప్రజలందరి వివరాలను సేకరించి ,సమగ్ర అధ్యయనం ,తులనాత్మక పరిశీలనలతో సామాజిక ,రాజకీయ వెనుకబాటుతనమును అత్యంత ప్రామాణికంగా నిర్ధారించాల్సి ఉంటుంది.
ప్రభుత్వాలు అందజేసే రిపోర్టులు ,సమాచారం గణాంకాలు ఉపయోగించుకున్నప్పటికీ ,డెడికేటెడ్ కమిషన్ తనదైన పద్ధతిలో స్వతంత్రంగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇందుకుగాను ప్రజల జీవన స్థితి గతుల అధ్యయనానికి రాష్ట్రమంతా పర్యటనలు చేయాలి .బహిరంగ విచారణా కార్యక్రమాలను చేపట్టాలి.
నివేదిక రూపకల్పనలో నిపుణత కలిగిన సంస్థల వ్యక్తుల సహకారం తీసుకోవాలి ఏ సామాజిక వర్గాలు తమ రాజకీయ ప్రాతినిధ్యాన్ని ఏ విధంగా పొందగలిగారు, ఏ విధంగా పొందలేదు అనే అంశాలపై ప్రామాణిక పద్ధతుల తో కమిషన్ అధ్యయనం నెరపి, సాధికారంగా తన సూచనలను ,అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది.
అలాకాకుండా కేవలం ప్రభుత్వం ఇచ్చే గణాంకాలు సమాచారం పై ఆధారపడి నివేదిక సమర్పించిన యెడల, ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల అమలులో ఏర్పడే హెచ్చు తగ్గుదలలో ప్రజల నుండి నిరసన వ్యక్తమయ్యే అవకాశం ఉందని వకుళాభరణం అన్నారు.
ఇప్పటికే తమ జనాభా తగ్గిందని బీసీల నిరసనతో, ఆందోళనలు ఉద్యమాలతో రాష్ట్రం అట్టుడికి పోతున్నది .ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెడచెవిన పెట్టి డేడికేషన్ కమిషన్ నుండి రాజకీయ దురుద్దేశములతో నివేదిక తీసుకున్న ఎడల ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.
అనవసరమైన భేషజాలకు పోకుండా ప్రభుత్వం కుల సర్వే నిర్వహించాలి. డెడికేటెడ్ కమిషన్ తన నివేదిక సమర్పించడానికి తగినంత సమయం ఇవ్వాలని కూడా డాక్టర్ వకుళాభరణం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Next Story