కేసీఆర్ లో పెరుగుతోన్న టెన్షన్
x

కేసీఆర్ లో పెరుగుతోన్న టెన్షన్

విద్యుత్ కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ హై కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం (ఈరోజు) వాదనలు జరగగా..


విద్యుత్ కొనుగోళ్ల విచారణపై జస్టిస్ నరసింహరెడ్డి కమిషన్ ను రద్దు చేయాలంటూ కేసీఆర్ హై కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై శుక్రవారం (ఈరోజు) వాదనలు జరగగా.. న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ఈరోజు సాయంత్రం వరకు కానీ.. జూలై 1న కానీ తీర్పును వెల్లడిస్తామని పేర్కొంది. దీంతో తీర్పుపై కేసీఆర్ వర్గంలో టెన్షన్ పెరిగిపోతోంది. తీర్పు తమకి అనుకూలంగా రాకపోతే తదుపరి కార్యాచరణపై వ్యూహాలు రచిస్తోంది. తీర్పు ప్రతికూలంగా ఉంటే సుప్రీం కోర్టులో సవాల్ చేయాలనే ఆలోచనలో ఉంది.

వాదనలు ఇలా...

జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ని రద్దు చేయాలంటూ కేసీఆర్ వేసిన పిటిషన్ పై తెలంగాణ హై కోర్టులో వాడీవేడి వాదనలు జరిగాయి. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరపున వాదనలు వినిపించారు. విద్యుత్ కొనుగోలుపై ఎక్వైరీ చేయాలని నేరుగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడారని కోర్టుకి తెలిపారు. ఎంక్వైరీ వేయమని వారే చెప్పినప్పుడు ఈ కమిషన్ ఏకపక్షం ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. జస్టిస్ నరసింహారెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడా కంక్లూజన్ కి వచ్చినట్లు మాట్లాడలేదని స్పష్టం చేశారు.

"ప్రెస్ మీట్ వీడియో లో బయాస్డ్ గా మాట్లాడలేదు. నిబంధనల ప్రకారమే రెండుసార్లు నోటీసులు ఇచ్చాము. విద్యుత్ కొనుగోలు వ్యవహారంపై పబ్లిక్ నోటీస్ సైతం జారీ చేశాం. ఇందులో విచారణ మొత్తం ఓపెన్ గా జరుగుతుంది. ఇప్పటివరకు 15 మంది నుంచి వివరాలు సేకరించాం. 15 మందిలో మాజీ సీఎండీ ప్రభాకర్ రావుతో పాటు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ప్రభాకర్ రావు తో పాటు జగదీశ్ రెడ్డి కమిషన్ ముందు హాజరయ్యారు. నిబంధనల ప్రకారమే ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ 8(b) కింద నోటీసులు జారీ చేశాం. కేసీఆర్ వద్ద ఉన్న ఎవిడెన్స్ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నాము. మేము ఇచ్చిన నోటీస్ పైన ప్రెస్ మీట్ లో ఎక్కడా ఏకపక్షంగా వ్యవహరించలేదు" అని అడ్వకేట్ జనరల్ కోర్టులో వాదనలు వినిపించారు.

అంతకంటే ముందు గురువారం(నిన్న) కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ ఆదిత్య సోంధి హైకోర్టులో వాదనలు వినిపించారు. జూన్ 30తో ఎంక్వెరీ కమిషన్ గడువు ముగుస్తుందని, ఈలోగా కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది కాబట్టి కమిషన్ విచారణపై స్టే ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. "పిటిషన్ కి నెంబర్ కేటాయింపు అంశంపైనే నేడు విచారణ జరుపుతున్నాం. పిటిషన్ కి నెంబర్ కేటాయించాక శుక్రవారం విచారణ చేపడతాం. అన్ని అంశాలను పరిశీలిస్తాం" అని తెలిపింది. దీంతో తొలుత పిటిషన్ కి నెంబర్ కేటాయించాలని ఆదిత్య సోంధి కోరారు. ఈ క్రమంలో నేడు ప్రభుత్వం తరపున వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. ఈరోజు కానీ లేదంటే జూలై 1న కానీ తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

కమిషన్ రద్దు చేయాలన్న కేసీఆర్...

కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విద్యుత్ కొనుగోలు అంశంపై దృష్టి పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అదులో భాగంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలలో జరిగిన అక్రమాలను వెలికితీయాలని సూచించింది. జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలో విచారణ కమిషన్ వేసింది.

విచారణలో భాగంగా జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్ ఈ నెల 11 న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు పంపింది. ఆయన పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)లో ప్రమేయంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ సూచించింది. స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది.

నోటీసులపై స్పందించిన కేసీఆర్ కమిషన్ కి 12 పేజీల లేఖ రాస్తూ... కమిషన్ ని తప్పుబడుతూ లేఖలో ధ్వజమెత్తారు. విచారణ చేతకాకపోతే తప్పుకోవాలంటూ హితవు పలికారు. అనంతరం కమిషన్ ని రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం ఈ పిటిషన్ పై వాదనలు ముగియగా.. తీర్పు కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Read More
Next Story