
కల్తీ కల్లు ఘటనలో బాధితులు సేఫ్ : మంత్రి దామోదర
ఇవ్వాళ, రేపో డిశ్చార్జ్
హైద్రాబాద్ కల్తీ కల్లు ఘటనలో చికిత్స పొందుతున్న బాధితులందరూ సేఫ్ గానే ఉన్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దామోదరం రాజనర్సింహా చెప్పారు. చికిత్స పొందుతున్న చాలామంది పరిస్థితి విషమంగా ఉందని వస్తున్న వార్తలను మంత్రి ఖండించారు. ‘వాళ్లంతా డిశ్చార్జ్ కు సిద్దంగా ఉన్నారు. ఇవ్వాళో , రేపో వాళ్లు డిశ్చార్జ్ అవుతారు . ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మెరుగైన వైద్య చికిత్స అందిస్తున్నాం’అని మంత్రి రాజనరసింహా అన్నారు. చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి మంత్రి గురువారం నిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులతో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. కల్తీ కల్లు ఘటనలో ఇప్పటివరకు ఆరుగు రు చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే కల్తీ కల్లు ఘటనపై ప్రతిపక్షాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. దీన్ని సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కల్తీ కల్లు బాధ్యులను గుర్తించి వారిని అరెస్ట్ చేసింది.మరికొందరిపై కేసులు నమోదు చేసింది. 5 కల్లు కంపౌడ్ లను ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు. 700 లీటర్ల కల్తీ కల్లును ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.