
తెలంగాణలోకి రావడానికి దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయా..?
తెలంగాణ నాశనం కోరుకుంటున్న వారి వినాశనం తప్పదన్న రాములమ్మ.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని దుష్టశక్తులు తెలంగాణలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. వాటిని తెలంగాణలోకి రాకుండా అడ్డుకుంటామనీ అన్నారు. బోనాల పండగ సందర్భంగా బోరబండ పోచమ్మకు విజయశాంతి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగానే ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ.. ఎవరో దయతో వచ్చిన రాష్ట్రం కాదని, ఎందరో ప్రాణత్యాగాలు చేసి, పోరాటాలు చేసి తెచ్చుకున్న రాష్ట్రమని గుర్తు చేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలోకి ప్రవేశించడానికి కొన్ని దుష్టశక్తులు శాయశక్తులా శ్రమిస్తున్నాయని అన్నారు. ‘‘తెలంగాణ అనేది అక్షయపాత్ర లాంటిది. తెలంగాణను దోచుకోవడానికి మళ్ళ2ీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ దర్మం వైపు నడవాలి. కాంగ్రెస్ అనేది ప్రజల పార్టీ. దుష్టశక్తులు మాట్లాడేవి పట్టించుకోవద్దు. తెలంగాణ.. ప్రజల గుండెల్లో ఉంది. ఎవరినీ రాష్ట్రంలోని రానివ్వొద్దు’’ అని విజయశాంతి పిలుపునిచ్చారు.
రాముల్లమ్మ చెప్తున్న దుష్టశక్తులు ఏంటి..?
రాములమ్మ అలియాస్ విజయశాంతి అంటున్న దుష్టశక్తులు ఎవరు? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ఆమె ఏపీ పార్టీలయిన టీడీపీ, జనసేనను ఉద్దేశించే అన్నారన్న చర్చ జోరుగా జరుగుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం టీడీపీ, జనసేన ప్రయత్నిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఇప్పటికే రాష్ట్రంలో సభ్యత్వ నమోదును చేసింది. ఇందులో కోటి మంది తమ పార్టీలో చేరినట్లు కూడా టీడీపీ వెళ్లడించింది. దీంతో తెలంగాణలో మళ్ళీ టీడీపీ పాగా వేసే ప్రయత్నాల్లో ఉందని స్పష్టమవుతోంది. ఇలాంటి సమయంలో రాములమ్మ చేసిన కామెంట్స్ ముమ్మాటికీ టీడీపీని ఉద్దేశించేనని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
అంతేకాకుండా ‘తెలంగాణను దోచుకోవడానికి మళ్ళీ కొందరు ప్రయత్నిస్తున్నారు’ అని విజయశాంతి అన్న మాటలను విశ్లేషకులు పునరుద్ఘాటిస్తున్నారు. మళ్ళీ దోచుకోవడానికి ప్రయత్నించడం అంటే.. గతంలో దోచుకున్నారన్న అర్థం వస్తుందని, అలా గతంలో ఇక్కడ అధికారంలో ఉండి.. ఇప్పుడు రాష్ట్రంలో లేనిది ఎవరైనా ఉన్నారంటే.. అది టీడీపీ ఒక్కటేనని, కాబట్టి విజయశాంతి ముమ్మాటికీ టీడీపీనే ఉద్దేశించి దుష్టశక్తులు అన్న పదప్రయోగం చేశారని విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.