నీళ్ల బాటిళ్లలో ఆహార భద్రతా నిబంధనలకు ‘నీళ్లు’
x

నీళ్ల బాటిళ్లలో ఆహార భద్రతా నిబంధనలకు ‘నీళ్లు’

మంచినీళ్ల బాటిళ్లలో ఆహార భద్రతా నిబంధనలను నీళ్లు వదిలారని ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెల్లడైంది. నీటిలో నిర్దేశిత టీడీఎస్ స్థాయి కంటే తక్కువగా ఉంది.


మీరు మినరల్ వాటర్ బాటిల్ నీరు తాగుతున్నారా? అయితే కాస్త ఆగండి...ఫుడ్ సేఫ్టీ అధికారుల పరీక్షల్లో తేలిన వాస్తవాలను చూడండి. పలు బ్రాండ్ల మంచినీళ్ల బాటిళ్లు ఆహార భద్రతా నిబంధనలను పాటించలేదని పరీక్షల్లో వెల్లడైంది.

- తాగడానికి వీల్లేని మంచి నీళ్ల బాటిళ్ల విక్రేతలపై ఫుడ్ సేఫ్టీ చట్టంలోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్ణయించారు.

మంచినీళ్ల బాటిళ్ల సీజ్
ఆహార భద్రతా అధికారులు బుధవారం కాచిగూడలోని కె2 కింగ్ ఆక్వా, బెవరేజెస్ ప్రాంగణంలో ఆకస్మిక తనిఖీలు చేశారు, ఫుడ్ సేఫ్టీ విభాగం నిర్దేశించిన నిబంధనలను ఉల్లంఘించినందుకు వేలాది లీటర్ల మంచినీటి బాటిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్రిస్లెహ్రీ బ్రాండ్ వాటర్ బాటిళ్లు 5.400 లీటర్లు,బ్రిస్లెహ్రీ అరలీటరు బాటిళ్లు 6,108 లీటర్లు,కెల్వీ బ్రాండ్ 1,172 లీటర్లు,కెల్వీ అరలీటరు బాటిళ్లు 6480 లీటర్లు,నేచర్స్ ప్యూర్ అరలీటరు నీళ్ల బాటిళ్లు 108 లీటర్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు సీజ్ చేశారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల చర్యలు
నాణ్యత లేని, ఆహార భద్రతా నిబంధనలు పాటించని 19,268 లీటర్ల నీళ్ల బాటిళ్లను ఫుడ్ సేఫ్టీ అధికారులు స్వాధీనం చేసుకొని, వారిపై ఎఫ్ఎష్ఎస్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.మంచినీటి బాటిళ్లలో నిర్దేశించిన 75ఎంజీ తో పోలిస్తే టీడీఎస్ స్థాయి తక్కువగా ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.

ఫుడ్ పాయిజనింగ్ కేసులు
హైదరాబాద్ నగరంలో 74,807 హోటళ్లు, రెస్టారెంట్లు ఉన్నాయి.నగరంలో గత రెండు నెలల్లోనే 84 శాతం ఫుడ్ పాయిజన్ కేసులు వెలుగుచూశాయి. 62 శాతం హోటళ్లలో గడువు తీరిన ఆహార పదార్థాలను వడ్డిస్తున్నట్లు తేలింది. కల్తీ ఆహార పదార్ధాల విక్రయంలో హైదరాబాద్ నగరం అగ్రస్థానంలో ఉందని తేలింది. బిర్యానీకి హైదరాబాద్ నగరంలో పేరొందింది. అలాంటి బిర్యానీలో అనుమతి లేని ఫుడ్ కలర్స్ వాడుతున్నారని వెల్లడైంది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు కల్తీ ఆహారం విక్రయించిన హోటళ్లపై కఠిన చర్యలు చేపట్టారు.

రెస్టారెంటులో వెలుగుచూసిన పలు లోపాలు
సూర్యాపేటలో కావేరి ఫ్యామిలీ రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పలు లోపాలు వెలుగుచూశాయి. రెస్టారెంట్ వంట ప్రాంగణంలో సరైన పరిశుభ్రత లేదని, రిఫ్రిజిరేటర్లు శుభ్రంగా లేవని తనిఖీల్లో తేలింది.ఫుడ్ హ్యాండ్లర్లు హెయిర్ క్యాప్స్, గ్లోవ్స్ లేకుండా ఉన్నారు. బిర్యానీ వండటంలో సింథటిక్ ఫుడ్ కలర్ వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు.ఫుడ్ హ్యాండ్లర్ల మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, పెస్ట్ కంట్రోల్ రికార్డులు,నీటి విశ్లేషణ నివేదికలు రెస్టారెంటులో అందుబాటులో లేవు.వంటగదిలో గ్రిల్స్ లేకుండా ఓపెన్ డ్రెయిన్లు ఉన్నాయి. రెస్టారెంట్ వంటగది అపరిశుభ్రంగా ఉందని తేలింది.

Read More
Next Story