బీఆర్ఎస్‌కు మరో షాక్.. కీలక నేత జంప్
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి.. బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి సీతక్క పార్టీలోకి స్వాగతం పలికారు.
లోక్‌సభ ఎన్నికలకు తెలగాణ సన్నద్ధం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్‌కు షాక్ పైన షాక్ తగులుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా కారుకు టాటా చెప్పేస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్ కారు దిగి హస్తం గూటికి చేరారు. తాజాగా గురువారం ముథోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిపోయారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయనను మంత్రి సీతక్క పార్టీ కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్‌కు భారీ ఎదురు దెబ్బే
లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి గడ్డుకాలం వచ్చిందని, ఇది పార్టీ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే కీలక నేతలను పోగొట్టుకున్న బీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో నిలబెట్టడానికి అభ్యర్థులు కరువవుతున్నారని, ఇప్పటికే 10కి పైగా నియోజకవర్గాల్లో ఎవరిని నిలబెట్టాలో అర్థం కాక బీఆర్ఎస్ పార్టీ అధిష్ఠానం తలలు పట్టుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. రానున్న ఎన్నికలపై కీలక నేతల రాజీనామాల ప్రభావం తీవ్రంగా ఉండనుందని, ఇది లోక్‌సభ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌కు ప్రతికూల పరిస్థితే అని చెప్పాలని వారు అంటున్నారు.
విఠల్ రెడ్డి నేపథ్యం
గడ్డిగారి విఠల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరపున రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 1982 నుంచి 87 వరకు దేగాం గ్రామ సర్పంచ్‌గా పనిచేశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలబడి టీడీపీ అభ్యర్థి సముద్రాల వేణుగోపాలాచారి చేతిలో 163 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ తరపున పోటీ చేసి ముథోల్ ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికయ్యారు. కొన్నాళ్లకే 6 ఆగస్టు 2014న కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్‌లో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి ముథోల్ ఎమ్మెల్యేగా బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన గురువారం బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరారు.
Next Story