బొగ్గు గనుల్లో ఓట్ల సందడి  సింగరేణిలో బారులు తీరిన ఓటర్లు...
x
సింగరేణిలో బారులు తీరిన గని కార్మికులు

బొగ్గు గనుల్లో ఓట్ల సందడి సింగరేణిలో బారులు తీరిన ఓటర్లు...

ఆసక్తికర ఎన్నికలకు తెర లేచింది. సాయంత్రం 7 గంటల తర్వాత ఈ ఉత్కంఠకు తెర పడుతుంది


కోల్‌ బెల్ట్‌లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు మొదలయ్యాయి. ఉదయం షిఫ్ట్‌లోని కార్మికులు ఓట్లు వేసేందుకు బారులు తీరి ఉన్నారు. సంస్థ విస్తరించిన 11 ఏరియాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగనుంది. మొత్తం 9 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. బ్యాలెట్‌ పద్దతిలో సీక్రెట్‌ ఓటింగ్‌ జరుగుతోంది. 13 గుర్తింపు యూనియన్లు పోటీలో ఉన్నా ప్రధానంగా పోటీ అంతా కాంగ్రెస్‌ అనుబంధ ఐఎన్‌టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీ మధ్యనే ఉంది. సుమారు 40 వేల మంది కార్మికులు ఎన్నికల్లో ఓటు వేయనున్నారు. ఈ ఎన్నికల్లో గెలిచే సంఘం రెండేళ్ల పాటు కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తుంది. గుర్తింపు పొందిన కార్మిక సంఘం నాయకులతోనే సింగరేణి యాజమాన్యం చర్చలు జరుపుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ రెండుసార్లు, బీఆర్‌ఎస్‌ పార్టీ అనుబంద టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) రెండు సార్లు, కాంగ్రెస్‌ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్‌టీయూసీ రెండు సార్లు గెలిచింది..

1998 నుంచి ఎన్నికలకు శ్రీకారం...


తరచూ సమ్మెల నివారణ లక్ష్యంగా 1998 నుంచి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో.. నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్‌వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్‌తో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్‌వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్‌అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్‌జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.

2012 నుంచి ప్రతిష్టాత్మకంగా..

సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించిన 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి.

Read More
Next Story