అసెంబ్లీలో బూతులే బూతులు
x
Danam Nagendar in Assembly

అసెంబ్లీలో బూతులే బూతులు

తాజా అప్ డేట్ ఏమిటంటే నిండుసభలో బూతులు తిట్టేయటమే. అధికార సభ్యుడు దానం నాగేందర్ ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు తిట్టేశారు.


సమస్యలపై చర్చలకు, అర్ధవంతమైన వాదనలు, ప్రతివాదనలకు, హుందాతనానికి అసెంబ్లీలో కాలంచెల్లింది. ఇపుడు అసెంబ్లీలో నడుస్తున్నదంతా బలప్రదర్శనలు, ఆధిపత్య ధోరణులు, అధికారంలో ఎవరుంటే వాళ్ళు ప్రతిపక్షాలను బుల్డోజ్ చేసేయటం, నోళ్ళునొక్కేయటమే కనబడుతోంది. సభ్యులు అసలు అసెంబ్లీకి వచ్చేది ఒక్కళ్ళని మరొకళ్ళు రెచ్చగొట్టుకోవటం, గొడవలు చేయటం, ఒకళ్ళని మరొకళ్ళని తప్పుపట్టడం కోసం, తిట్టుకోవటం కోసమే అన్నట్లుగా సమావేశాలు జరుగుతున్నాయి. తాజా అప్ డేట్ ఏమిటంటే నిండుసభలో బూతులు తిట్టేయటమే. అధికార కాంగ్రెస్ సభ్యుడు దానం నాగేందర్ ప్రతిపక్షంలోని బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు తిట్టేశారు. ఈ ధోరణి 2014లోనే ఏపీ అసెంబ్లీలో మొదలైంది. అప్పట్లో వైసీపీ ఎంఎల్ఏ కొడాలినానిని ఉద్దేశించి అధికార టీడీపీ సభ్యుడు బోండా ఉమ సభ జరుగుతున్నపుడే నోటికొచ్చినట్లు తిట్టేశారు. బాగా తిట్టేసి అసెంబ్లీలోనే పాతేస్తానని బెదిరించటం అప్పట్లో సంచలనమైంది.

అదే బెదిరింపులు, హెచ్చరికలు ఇపుడు తెలంగాణా అసెంబ్లీలో కూడా రిపీటయ్యాయి. కాకపోతే బీఆర్ఎస్ సభ్యులను అసెంబ్లీలో పాతేస్తానని దానం బెదిరించలేదు. అయితే రోడ్లమీద తిరగనియ్యనంటు హెచ్చరించటం కలకలం రేపింది. ఇంతకీ విషయం ఏమిటంటే హైదరాబాద్ అభివృద్ధి మీద జరిగిన చర్చలో మాట్లాడేందుకు దానం నాగేందర్ లేచి నిలబడ్డారు. ఎప్పుడైతే దానం మాట్లాడటానికి లేచారో వెంటనే బీఆర్ఎస్ సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందగౌడ్ టీజింగ్ మొదలుపెట్టారు. దానం ఏ పార్టీ సభ్యుడిగా మాట్లాడుతున్నారో ముందు చెప్పాలంటు గోల మొదలుపెట్టారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన దానం తర్వాత కాంగ్రెస్ లోకి ఫిరాయించిన విషయం అందరికీ తెలిసిందే. దానం మొదట్లో వీళ్ళని పట్టించుకోకుండా మాట్లాడటం మొదలుపెట్టారు. దాంతో బీఆర్ఎస్ సభ్యులు తమ గోలను మరింతగా పెంచేశారు. అడుగడుగునా దానంకు పాడి, కేపీ అడ్డుపడటమే కాకుండ ఎగతాళి చేయటం ఎక్కువైపోయింది.

దాంతో మండిపోయిన దానం సభ్యులను ఉద్దేశించి నోటికొచ్చినట్లు బూతులు తిట్టేశారు. అరేయ్..అరేయ్.. అంటూ హెచ్చరిస్తునే బూతులు తిట్టేశారు. దానం నోటివెంట బూతులు వినబడగానే సభలోని సభ్యులంతా స్పీకర్ తో సహా షాక్ కు గురయ్యారు. (ఆ తిట్లను రాయటం సభ్యతకాదు కాబట్టి రాయటంలేదు.) దానం తిట్లు అందరికీ స్పష్టంగా వినిపించాయి. కారణం ఏమిటంటే బీఆర్ఎస్ సభ్యులను హెచ్చరించేటప్పుడు, తిట్టేటపుడు దానం మైక్ కట్ చేయటం మర్చిపోయారు. మైక్ కట్ చేయకపోవటంతో దానం తిట్లు ఎంచక్కా సభ మొత్తం వినిపించాయి. సభలోని సభ్యులే కాదు టీవీల్లో అసెంబ్లీ సమావేశాల లైవ్ రిలేని చూస్తున్న జనాలు కూడా దానం తిట్లను విని ఆశ్చర్యపోయారు.

దానం తిట్ల వర్షం నుండి ముందుగా తేరుకున్నది కాంగ్రెస్ సభ్యులే. వెనుక నుండి ఇద్దరు ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు పరుగెత్తుకుంటూ దానం దగ్గరకు వచ్చి మైక్ ఆన్లో ఉన్న విషయాన్ని చెప్పారు. చెప్పటమే కాకుండా వాళ్ళే మైక్ ను కట్ చేశారు. దానం బూతులతో ముందు షాక్ కు గురైన కారుపార్టీ ఎంఎల్ఏల్లో కొందరు తేరుకుని వెంటనే దానం మీదకు దూసుకొచ్చారు. తనమీదకు దూసుకువస్తున్న బీఆర్ఎస్ సభ్యులను గమనించిన దానం కూడా అంతే ధీటుగా వాళ్ళతో కలబడేందుకు సిద్ధమైపోయారు. బీఆర్ఎస్ సభ్యులకు ఎదురు వెళ్ళటానికి అడుగులేశారు. జరగబోయేది గ్రహించిన కాంగ్రెస్ ఎంఎల్ఏలు కొందరు దానంను గట్టిగా అడ్డుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎంఎల్ఏలకు అడ్డుపడ్డారు. బీఆర్ఎస్ ఎంఎల్ఏలు దానంవైపు రాకుండా కొందరు కాంగ్రెస్ ఎంఎల్ఏలు అడ్డుగా నిలబడ్డారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ సభ్యులవైపు వెళ్ళకుండా దానంను మరికొందరు కాంగ్రెస్ ఎంఎల్ఏలు నిలువరించారు.

సభలో జరుగుతున్నఘటనలతో స్పీకర్ అప్రమత్తమయ్యారు. వెంటనే సభ్యులందరికీ మైక్ కట్ చేశారు. మార్షల్స్ కూడా అప్రమత్తమయ్యారు. తర్వాత కొందరు ఎంఎల్ఏలు రెండువైపులా సర్దిచెప్పటంతో సభ కొంతసేపటి తర్వాత సద్దుమణిగింది. మొత్తానికి అసెంబ్లీ ఇపుడు బూతులకు వేదికైపోయింది. బీఆర్ఎస్ సభ్యులను దానం తిట్టిన తిట్లు ఇపుడు సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానళ్ళల్లో వైరల్ గా మారాయి. తర్వాత సభనుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ సభ్యులు మీడియాతో మాట్లాడుతు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ గౌరవాన్ని దిగజార్చేసిందంటు మండిపోయారు.

Read More
Next Story