
అటవీ గ్రామాల ప్రజలను వణికిస్తున్న పులి
Tigers | వామ్మో పులి, భయాందోళనల్లో అటవీగ్రామాల ప్రజలు
తెలంగాణలోని అటవీ గ్రామాల్లో చలితోపాటు పులుల సంచారం పెరగడంతో ప్రజలు వణికిపోతున్నారు.మహారాష్ట్ర నుంచి పులులు ఉమ్మడి ఆదిలాబాద్ అటవీగ్రామాల్లోకి ప్రవేశించాయి.
ఈ చలికాలంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గడంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. మరో వైపు మహారాష్ట్ర నుంచి వచ్చిన పులుల సంచారం పెరగడంతో అటవీ గ్రామాల ప్రజలు భయకంపితులయ్యారు. పులుల సంచారంపై చర్యలు తీసుకొని, వాటిని అడవుల్లోకి తరిమివేయాల్సిన అటవీశాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
- ఇప్పటికే నవంబర్ 29వతేదీన కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం ఈసగావ్ గ్రామంలో పత్తి పంట కోసే పనిలో నిమగ్నమై ఉన్న మోర్లె లక్ష్మి (21)ని పులి దాడి చేసి చంపింది. నవంబర్ 30వతేదీన సిర్పూర్ (టి) మండలం దుబ్బగూడెం గ్రామంలో రైతు రౌతు సురేష్‌పై పులి దాడి చేసింది.
- మరోవైపు అటవీ గ్రామాల్లో పశువులపై పులుల దాడులు ఇటీవల పెచ్చుపెరిగాయి. పులుల బారి నుంచి ప్రజలను కాపాడాల్సిన అటవీశాఖ అధికారులు పులులు అటవీగ్రామాలకు వచ్చినా వాటికి హాని తలపెట్టవద్దని కోరుతున్నారు. పులి దాడిలో యువతి మరణిస్తే నష్టపరిహారం ఇచ్చి అధికారులు చేతులు దులుపుకుంటున్నారు.
పులులకు అంతరాయం కల్పించొద్దు : అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్
మహారాష్ట్ర నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లోకి పులులు వచ్చాయని ఇందన్ పల్లి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పులులు సంచరించే ఆవాసాల్లోకి అటవీగ్రామాల ప్రజలు వెళ్లవద్దని, పులులకు ఆటంకం కలిగించవద్దని ఆయన కోరారు.పులులు ప్రజలపై దాడులు చేయవని శ్రీనివాస్ చెప్పారు. పోడు పేరిట పులుల ఆవాసాల్లోకి ప్రజలు వెళ్లి వాటికి అంతరాయం కలిగిస్తే అవి ప్రజలపై దాడులు చేసే అవకాశం ఉందన్నారు. జానీ అనే పులి మహారాష్ట్ర నుంచి వచ్చిందని దాని దారిలో ప్రజలు అంతరాయం కలిగించి నందువల్లే అది పెట్రేగిపోయి దాడి చేసిందని శ్రీనివాస్ వివరించారు.
కొత్తగూడెం అడవుల్లో పులుల సంచారం
కొత్తగూడెం అడవుల్లో పులుల సంచారం ఇటీవల పెరిగింది. గత మూడు రోజులుగా గుండాల, ఆళ్లపల్లి మండలాల్లో పులి సంచరిస్తుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి.ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో సంచరిస్తున్న పులి కొత్తగూడెం జిల్లాలోకి ప్రవేశించినట్లు సమాచారం. జంతువుల పగ్ గుర్తులు కనిపించిన అటవీ గ్రామాల్లోని నివాసితులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు.ప్రస్తుతం ఇల్లెందు, పినపాక మండలాల్లోని అడవుల్లో పులి సంచరిస్తోందని అటవీశాఖ అధికారులు తెలిపారు.
ములుగు ఏజెన్సీని హడలెత్తిస్తున్న పెద్దపులి
ములుగు అటవీగ్రామాల్లో పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. పలుి పాదముద్రలు సేకరించి ప్రజలను అప్రమత్తం చేశారు.పులి సంచారంతో ములుగు జిల్లా రైతులు, కూలీలు బెంబేలెత్తిపోతున్నారు. పంబాపురం అటవీప్రాంతంలో పెద్దపులి గాండ్రింపులు కలకలం రేపాయి. భద్రాద్రి జిల్లా కిన్నెరసాని అభయారణ్యం నుంచి తిరిగి ములుగు జిల్లా అడవుల్లోకి పెద్దపులి వచ్చిందని అటవీశాఖ అధికారి ఒకరు చెప్పారు.
అడవిలోకి వెళ్లవద్దు
తాడ్వాయి మండలం పంబాపురం అటవీప్రాంతంలో ఓ గిరిజనుడు పులిని చూశాడు. అతను అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. పాదముద్రల ఆధారంగా పులి తిరిగి వచ్చినట్లుగా అధికారులు నిర్థారించుకున్నారు. జనావాసాలకు పులి వచ్చే అవకాశం ఉండటంతో స్థానికులను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. అటవీ సమీపంలోని పంటపొలాలకు, పశువులు మేపడానికి, అటవీ ఉత్పత్తుల కోసం అడవుల్లోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిక జారీ చేశారు.
పులిసంచారంపై గ్రామాల్లో దండోరా
ములుగు జిల్లాలో గత రెండు రోజులుగా పెద్దపులి సంచారంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. వెంకటాపురం మండలం బోదాపురం, ఆలుబాక శివార్లలో రైతులు పెద్దపులి ఆనవాళ్లను గుర్తించారు. తర్వాత గోదావరి దాటి ఇవతలి వైపు మంగపేట మండలంలోకి పులి ప్రవేశించినట్టు సమాచారం. దీంతో గ్రామాల్లో పులి సంచారంపై మైకుల ద్వారా అధికారులు దండోరా వేయించారు. మంగపేట మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పులుల సంచారం నేపథ్యంలో తాము అటవీ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశామని అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
పులి గాడ్రింపులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అలుబాక బోధాపురం సమీపంలో పెద్దపులి కలకలం సృష్టించింది.మిర్చి తోటలకు వెళ్లే దారిలోని గోదావరి పాయలో కొందరు స్థానికులు పెద్దపులి అడుగులను గుర్తించారు.అవి పెద్దపులి అడుగులేనని ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు.గోదావరి తీర ప్రాంతంలో పుచ్చతోటల వద్ద పడుకున్న సమయంలో పెద్ద పులి అరుపులు వినిపించినట్లు స్థానిక రైతులు చెప్పారు. పెద్దపులి జాడ దొరికే వరకు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ ఎలాంటి ఆనవాళ్లు కనిపించిన వెంటనే సమాచారం అందించాలని అటవీ శాఖ అధికారులు సూచించారు.చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్‌లో చిరుతపులి దాడిలో మహిళకు గాయాలు
ఆదిలాబాద్ జిల్లా బజారహత్నూర్ మండలం దేద్ర గ్రామంలో బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళపై చిరుతపులి దాడి చేయడంతో ఆమెకు గాయాలయ్యాయి.గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న చిరుతపులి అడవి అంచుల్లోని పశువుల కొట్టం సమీపంలోకి వచ్చి ఆమెపైకి దాడి చేయడంతో భీమాబాయి గాయపడింది. ప్రజలు చిరుతను చూసి అరవడంతో అది పారిపోగా భీమాబాయి ప్రాణాలతో బయటపడింది. స్థానికులు వచ్చి ఆమెను రక్షించి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.
Next Story