ఇక్కడ బిఆర్ ఎస్ కు ఎంపీ అభ్యర్థులు కావలెను..
x

ఇక్కడ బిఆర్ ఎస్ కు ఎంపీ అభ్యర్థులు కావలెను..

బీఆర్ఎస్‌కు నల్లగొండ ఎంపీ అభ్యర్థులు కరువు నల్లగొండ, భువనగిరి సీట్లు ‘హస్త’గతం అయ్యేనా..?


హైదరాబాద్ : ఓడలు బండ్లు అవుతాయి.. బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదేనేమో. కొన్ని నెలల క్రితం వరకు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కు పెట్టని కోటగా చెప్పుకున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని రెండు లోక్‌సభ నియోజకవర్గాలకు ఆ పార్టీకి ఎంపీ అభ్యర్థులు కరువయ్యారు. బీఆర్ఎస్ నేతలు నల్లగొండ, భువనగిరి లోక్‌సభ నియోజక వర్గాలనుంచి పోటీ చేసేందుకే జంకుతున్నారు.

ఉమ్మడి జిల్లాలోని నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గానికి పార్టీ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని కాంగ్రెస్ మొదటి జాబితాలోనే ప్రకటించింది. భువనగిరి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పైళ్ల శేఖర్‌రెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకుని భువనగిరి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమయ్యింది. పైళ్ల రేపో మాపో కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని తెలుస్తోంది. దాదాపుగా ఆయన్నే కాంగ్రెస్ భువనగిరి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కన్పిస్తోంది. లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు తమకు అభ్యర్థిగా అవకాశం కలిపించాలని కొందరు నేతలు మీడియా సమావేశం పెట్టి బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విజ్ఞప్తి చేసారు . కానీ వారం పదిరోజుల్లోనే పరిస్థితి తలకిందులయ్యింది. నాడు టికెట్ ఇవ్వాలంటూ కోరిన నేతలంతా నేడు సైలెంట్ అవ్వడం విశేషం.

ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 శాసనసభ నియోజకవర్గాలకు గాను 11 స్థానాలను ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుచుకుంది. దీనితో జిల్లా రాజకీయాలపై కాంగ్రెస్ ఆధిపత్యం కొనసాగుతుంది. వాస్తవానికి 2018 శాసన సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక శాసన సభ స్థానాలను గెలిచినా తదుపరి 2019 సంవత్సరంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

బిఆర్ ఎస్ నేతల విముఖత దేనికి?

శానస సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తరువాత జిల్లా నాయకుల్లో నిరుత్సహం నెలకొంది. పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాలు కూడా సరిగ్గా నిర్వహించలేని స్థితికి వెళ్లారు. ఈ పరిస్థితులే కొందరు బీఆర్ఎస్ నాయకులు ఇతర పార్టీల్లోకి వలస వెళ్లేందుకు కారణమయ్యింది. లోక్‌సభ ఎన్నికలను పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఎన్నికలకు, అభ్యర్థులకు కావలసిన అన్ని అవసరాలు తానే చూసుకుంటుందనే అభిప్రాయంలో నాయకులు ఉండేవారు. కానీ పార్టీ న్యాయకత్వం అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకోవడంతో ఎన్నికల్లో పోటీ వ్యయం దృష్టిలో ఉంచుకొని వెనకడుగు వేస్తున్నారని చెప్పాలి. నల్గొండ , భువనగిరి ఎంపీ స్థానాలకు బీఆర్ఎస్‌కు అభ్యర్థులే కరువయ్యారని చెప్పొచ్చు.

మొదట నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి ఉత్సాహం చూపిన తెలంగాణ విధానసభ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ రెడ్డి కూడా వెనకడుగు వేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామరావు పిలిపించి మాట్లాడినా అమిత్ రెడ్డి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే ఉదేశ్యం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. అనంతరం నల్గొండ లోక్‌సభ స్థానానికి తేరా చిన్నపరెడ్డి పేరు వినిపించినా.. అతనుకూడా పోటీకి ఆసక్తి చూపలేదు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి కూడా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇప్పటి వరకు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేసిన అనుభవం లేని కంచర్ల రామకృష్ణా రెడ్డి పేరు నల్గొండ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తుంది. రామకృష్ణారెడ్డి నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి సొంత సోదరుడు. రామకృష్ణా రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి అయితే.. కాంగ్రెస్ నల్గొండ లోక్‌సభ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డికి గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పవచ్చు.

బిఆర్ ఎస్ కు అభ్యర్థులే కరువు

భువనగిరి లోక్‌సభ నియోజకవర్గానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా చెప్పుకోవడానిని పేర్లే కరువయ్యాయని చెప్పాలి. మొదట మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డిని భువనగిరి లోక్‌సభ అభ్యర్థిగా నిలపాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ శేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు రంగం సిద్ధం అయ్యిందని అతడి అనుచరులే ప్రచారం చేస్తునారు.

తన కొడుకుకు పార్టీ అవకాశం కల్పిస్తే ఈ లోక్‌సభ స్థానం నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటన చేసిన సుఖేందర్ రెడ్డి నేడు ఆ అంశంపై మాట్లాడటానికి సైతం ఆసక్తి చూపడం లేదు. తాను రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్నానని, రాజకీయాలు మాట్లాడొద్దని అయన దాటవేశారు.

అమిత్ రెడ్డి మాట్లాడుతూ తన అభ్యర్థిత్వాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారని, అందుకే ఎన్నికలలో పోటీ చేసే ఆలోచనను విరమించుకున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీష్ రెడ్డిని దృష్టిలో పెట్టుకొనే అమిత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు రాజకీయ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి.

కాంగ్రెస్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ.. ‘బీఆర్ఎస్ తాను చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకుంటుంది. ప్రజా వ్యతిరేఖతతో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికలో ఘోర పరాభవం మూటగట్టుకుంది. కాంగ్రెస్ తాను ఎన్నికల సందర్భంలో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తుంది. తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ హావా లోక్‌సభ ఎన్నికల్లోనూ తప్పక కొనసాగుతుంది" అని అభిప్రాయపడ్డారు.

Read More
Next Story