మూడేళ్లలోగా వరంగల్ విమానాశ్రయం నిర్మాణం పూర్తి : మంత్రి కోమటిరెడ్డి
x

మూడేళ్లలోగా వరంగల్ విమానాశ్రయం నిర్మాణం పూర్తి : మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలోని చారిత్రక నగరమైన వరంగల్ లో విమానాశ్రయం నిర్మాణ పనులు మూడేళ్లలోగా పూర్తి చేస్తామని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు.


వరంగల్ నగరంలోని మామునూర్ ఎయిర్ పోర్ట్ పై ఉన్నతాధికారులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బుధవారం సమీక్షించారు.అంబేద్కర్ సచివాలయంలోని మంత్రి ఛాంబర్ లో ఎవియేషన్ డైరెక్టర్ భారత్ రెడ్డి, ఆర్ అండ్ బీ స్పెషల్ ఛీఫ్ సెక్రెటరీ వికాస్ రాజ్, స్పెషల్ సెక్రటరీ దాసరి హరిచందన, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

- వరంగల్ నగరంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు చేయాలని అధికారులకు మంత్రి కోమటిరెడ్డి సూచించారు. త్వరితగతిన భూసేకరణ పూర్తిచేసి మూడేళ్లలోగా ఎయిర్ పోర్ట్ నిర్మాణం పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి ప్రకటించారు.

పనుల పురోగతిపై రివ్యూ
వరంగల్ విమానాశ్రయం నిర్మాణ పనులపై ప్రతీ పదిహేను రోజులకోసారి సమీక్షిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. గత ప్రభుత్వంలాగా హామీలతో కాలం వెళ్లబుచ్చితే అర్ధం లేదన్నారు.వరంగల్ నగరంలో విమానాశ్రయం నిర్మించి వదిలేయకుండా విమానాల రాకపోకలపై దృష్టిపెట్టాలని ఎయిర్ పోర్ట్ అథారిటీ ఉన్నతాధికారులకు మంత్రి సూచించారు.

ఉడాన్ స్కీంతో అనుసంధానం చేయండి
వరంగల్ ఎయిర్ పోర్ట్ ను ఉడాన్ స్కీంతో అనుసంధానం చేసి ఇతర పెద్ద పట్టణాలతో రాకపోకలకు అనువుగా మార్చాలని మంత్రి కోమటిరెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులను కోరారు.యునెస్కో సైట్ రామప్ప, భద్రకాళీ, వెయ్యిస్తంభాల దేవాలయం ఇతర కాకతీయ కట్టడాలతో పాటు టెక్స్ టైల్ పార్క్ అవసరాలు, భవిష్యత్ పరిశ్రమలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ను తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు. స్థానిక నాయకులు, అధికారులతో కలిసి స్వయంగా మామునూర్ వచ్చి ఎయిర్ పోర్ట్ స్థితిగతులను పరిశీలిస్తానని మంత్రి చెప్పారు.


Read More
Next Story