వరంగల్ కాంగ్రెస్‌లో మళ్ళీ రాజుకున్న వర్గ విభేదాలు..
x

వరంగల్ కాంగ్రెస్‌లో మళ్ళీ రాజుకున్న వర్గ విభేదాలు..

కొండా సురేఖపై ఫిర్యాదు చేసిన నాయిని రాజేందర్ రెడ్డి.


కరవమంటే కప్పకు కోపం.. విడమంటే పాముకు కోపం అన్నట్లు ఉంది వరంగల్‌లో కాంగ్రెస్ పరిస్థితి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వర్గాల మధ్య వివాదాలు రోజురోజుకు ముదురుతున్నాయి. కొన్నాళ్లుగా ప్రశాతంగా ఉండటంతో ఎట్టకేలకు వీరి వివాదానికి కాంగ్రెస్ ఫుల్‌స్టాప్ పెట్టిందేమో, ఇరు వర్గాలకు నచ్చజెప్పిందేమో అని అంతా అనుకున్నారు. ఇప్పుడు తాజాగా మంత్రిపై ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో వరంగల్ కాంగ్రెస్ వివాదం చల్లారలేదని స్పష్టం అయింది. ఇన్ని రోజులు కూడా నివురుగప్పిన నిప్పులా మాత్రమే ఉందని, ఇప్పుడు మరోసారి గుప్పుమంటోందని అర్థమైపోయింది. ఈ సారి కొండా సురేఖ వైఖరిపై నాయిని రాజేందర్.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు. తనకు ఎదురులేదు, తన మాటే శాసనం అన్న తరహాలో సురేఖ తీరు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే నాయిని మధ్య భద్రకాళీ ఆలయ పాలకమండలి కమిటీ వ్యవహారంలో చాలా కాలంగా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఆలయ నిర్వహణ కోసం రెండు గ్రూప్‌లో అన్ని విషయాల్లో పోటీ పడుతూనే ఉన్నాయి. స్థానికంగా రెండు గ్రూప్‌లు బలమైనే అవడంతో వీరి విభేదాలు కాంగ్రెస్‌కు అగ్నిపరీక్షల మారుతున్నాయి.

నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి: నాయిని

‘‘మేము ఏం చేసినా దానికి మంత్రి కొండా సురేఖ అడ్డుతగులుతున్నారు. తాను ఏం చేసినా ఎవరూ ఎవరూ అడ్డు చెప్పరూ. నడిచిపోతుందని ఆమె అనుకుంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం ఇవ్వకుండా భద్రకాళీ ఆలయ పాలక మండలి సభ్యులను ఆమె ఎలా నియమిస్తారు? దేవాదాయశాఖ మంత్రి అయితే మాత్రం ఏమైనా చేస్తారా? నా నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటి? మంత్రి కొండా సురేఖ ఇదే పద్దతిని అవలంబిస్తే చూస్తూ ఊరుకోను. స్థానికంగా నేను ఉన్నది దేనికి. నాకు సమాచారం ఇవ్వకుండా మంత్రే అంతా చేస్తానంటే ఎలా?’’ అని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు.

గతంలోనూ ఇదే పరిస్థితి..

అయితే తెలంగాణ కాంగ్రెస్‌కు వరంగల్ కాంగ్రెస్‌లోని విభేదాలు పెద్ద తలనొప్పిగా మారాయి. ఇరు వర్గాల్లో ఎవరికి ఏం చెప్పాలో అర్థంకాక టీపీసీసీ డైలమాలో పడిపోతోంది. ఇద్దరూ బలమైన నేతలే కావడంతో వీరి విషయంలో ఎవరివైపు నిర్ణయం తీసుకోవాలో టీపీసీసీకి అవగతం కావడం లేదు. అయితే ఇప్పటికే ఒకసారి నాయిని వర్గం టీపీసీసీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాము కావాలో.. కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోవాలని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ మల్లు రవికి నేరుగా చెప్పారు. కొండా ఫ్యామిలీ వర్సెస్ వరంగల్ నేతల వివాదంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో మీనమేషాలు లెక్కేస్తుంది. దీంతో ఇప్పుడు మరోసారి కొండా, నాయిని వర్గాల మధ్య విభేదాలు భగ్గుమనడంతో టీపీసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? అనేది కీలకంగా మారింది.

Read More
Next Story