బెంగళూరు హోటళ్లలో  సాంబారు, రసం కరువు
x
Idly. Vada (photos from Twitter)

బెంగళూరు హోటళ్లలో సాంబారు, రసం కరువు

సాంబారులేకుండా ఇడ్లీని హోటల్లో ఎప్పుడైనా తిన్నారా ? రసంలేకుండా వడను ఎప్పుడైనా హోటళ్ళలో మీకు ఇచ్చారా ?


సాంబారులేకుండా ఇడ్లీని హోటల్లో ఎప్పుడైనా తిన్నారా ? రసంలేకుండా వడను ఎప్పుడైనా హోటళ్ళు, రెస్టారెంట్లలో మీకు ఇచ్చారా ? సాంబారు లేని ఇడ్లీని, రసంలేని వడను హోటళ్ళు సప్లైచేస్తాయని, తినాల్సొస్తుందని మీరు ఎప్పుడైనా ఊహించారా ? ఇడ్లీ లేదా వడ ఆర్డరిచ్చారంటే ఇడ్లీతో పాటు సాంబారును, రసంలో ముంచిన వడను వాళ్ళే ఇచ్చేస్తారు. ఇడ్లీ వితౌట్ సాంబారు, రసంలేని వడ కాంబినేషన్ను ఎవరు ఊహించుకోలేరు. అయితే ఇలాంటి అనుభవాలు ఇపుడు బెంగుళూరు సిటిలోని జనాలకు ఎదురవుతున్నాయి. సాంబారు, రసం చేయటాన్ని చాలా హోటళ్ళు, రెస్టారెంట్లు నిలిపేశాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే నీటి సమస్యే అని ప్రత్యకంగా చెప్పాల్సిన అవసరంలేదు. కొద్దిరోజులుగా బెంగుళూరు సిటిలో నీటి సమస్య బాగా ఎక్కువగా ఉంది. గతంలో ఎప్పుడూ ఎదుర్కోనంత నీటి సమస్యను పింక్ సిటి ఇపుడు ఎదుర్కుంటోంది.

అందుకనే సమస్యకు తక్షణ విరుగుడుగా నీటి వాడకం ఎక్కువగా అవసరమైన సాదకాలు అంటే సాంబారు, రసం లాంటివాటిని హోటళ్ళు, రెస్టారెంట్లు చేయటం మానేశాయి. అలాగే ఎవరైనా హోటళ్ళు, రెస్టారెంట్లకు వచ్చి కూర్చోగానే వెయిటర్లు ముందుగా గ్లాసుల్లో మంచినీళ్ళని తీసుకొచ్చి పెట్టడం అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత పరిస్ధితి కారణంగా గ్లాసుల్లో నీటిని ఇవ్వటంలేదట. ఖాళీ గ్లాసులను పెట్టి జగ్గుతో మంచినీటిని అందిస్తున్నారట. లేదంటే కస్టమర్ల కోరిక ప్రకారం వాటర్ బాటిళ్ళను అందిస్తున్నారట. ఇదేకాకుండా చాలా హోటళ్ళు, రెస్టారెంట్లలో గ్లాసుల సైజును కూడా తగ్గించేసినట్లు బృహత్ బెంగుళూరు హోటల్స్ అసోసియేషన్(బీబీహెచ్ఏ) అధ్యక్షుడు పీసీ రావు చెప్పారు. అలాగే డిస్పోజబుల్ ప్లేట్లు, గ్లాసులను ఎక్కువగా వాడుతున్నట్లు చెప్పారు. ఎందుకంటే నీటికొరతను దృష్టిలో పెట్టుకుని ప్లేట్లు, గ్లాసులను కడిగే అవసరంలేకుండా వాడినవి వాడినట్లుగా బయట పారేస్తున్నారు.

కర్నాటక రెస్టారెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుకర్ షెట్టి మాట్లాడుతు బోర్లున్న హోటళ్ళలో సమస్య కొంత తక్కువగా ఉందిని కాని చాలా వాటిల్లో సమస్య చాలా ఎక్కువగా ఉన్నట్లు చెప్పారు. హెచ్ఎస్ఆర్ లేఅవుట్, వైట్ ఫీల్డ్స్, దేవనహల్లి లాంటి ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య చాలా ఎక్కువగా ఉందన్నారు. మంచినీటిని సరఫరా చేసేబదులు బాటిల్డ్ వాటర్ను హోటళ్ళు ప్రమోట్ చేస్తున్నట్లు షెట్టి చెప్పారు. హోటళ్ళ ముందు, హోటళ్ళ కాంపౌండ్ లోని గార్డెన్ కు నీళ్ళు పట్టడాన్ని కూడా చాలా హోటళ్ళు నిలిపేశాయాన్నారు. వేసవికాలం దాటితే సమస్య తీరిపోతుందని షెట్టి ఆశాజనకంగా ఉన్నారు.

కొన్ని హోటళ్ళు కస్టమర్ల బట్టలను ఉతకటం కూడా మానేశాయి. నీటి ఎద్దడి సమస్యను హోటళ్ళల్లో దిగే కస్టమర్లకు ముందే చెబుతున్నాయి. అనవసరంగా నీటిని వాడి వృధాచేయద్దని ప్రతి గదిలోను హోటళ్ళ యాజమాన్యాలు బోర్డులు కూడా పెడుతున్నట్లు పీసీ రావు చెప్పారు. ఒక అంచనా ప్రకారం నగరంలో 14 వేల బోర్లుంటే వీటిల్లో 7 వేల బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లుగా ప్రభుత్వం ఇపుడు సడెన్ గా మేల్కోని నగరంలోని చెరువులను కాపేడే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాతావరణ అధ్యయన నిపుణుడు బలిజేపల్లి సుబ్బారావు మాట్లాడుతు నగరంలోని 22 పెద్ద చెరువులు కబ్జాకు గురైనట్లు చెప్పారు. చెరువులు, కుంటలను ఆక్రమించేసి అపార్ట్ మెంట్లు కట్టేయటం, లే అవుట్లు వేసి ఇళ్ళుకట్టేయటయటానికి పాలకులే బాధ్యత వహించాలన్నారు. నగరం మొత్తాన్ని కాంక్రీట్ జంగిల్ గా మార్చేయటం వల్లే భూగర్భజలాలు బాగా లోతుల్లోకి వెళ్ళిపోవటంతో నీటి ఎద్దడి తప్పటంలేదన్నారు.

ఐటి సెక్టార్లో పనిచేస్తున్న అలవర్తి హర్షవర్ధనరెడ్డి, గౌరీ దంపతులు మాట్లాడుతు నీటి ఎద్దడి సమస్యను ఉన్నదానికన్నా చాలా ఎక్కువగా ప్రచారం అవుతున్నట్లు అభిప్రాయపడ్డారు. సిటి మొత్తంలో నీటి సమస్యలేదన్నారు. ఎక్కడైనా కొన్ని ఏరియాల్లో నీటిఎద్దడి ఉంటే ఉండచ్చని చెప్పారు. తమ మిత్రులుంటున్న లాల్ బాగ్, ఎలక్ట్రానిక్ సిటి, సదాశివనగర్, శాంతినగర్, కస్తూరినగర్ ప్రాంతాల్లో నీటి సమస్య ఉన్నట్లు తాము వినలేదన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల కారణంగానే ఒకళ్ళపై మరొకళ్ళు బురదచల్లుకోవటానికి కాంగ్రెస్, బీజేపీలు సమస్యను చాలా పెద్దదిగా ప్రచారం చేస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

Read More
Next Story