కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్
x
Revanth and KCR

కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాటర్ వార్

అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వాటర్ వార్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి


తెలంగాణలో లేటెస్టుగా ‘వాటర్ వార్’ మొదలైంది. తాజాగా అధికార, ప్రతిపక్షాల మధ్య మొదలైన వాటర్ వార్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై మరొకటి ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రెండుపార్టీలూ తప్పులే చేస్తున్నాయి. బీఆర్ఎస్(BRS) పాలనలోనే నీటికేటాయింపులు, నీటివాడకానికి తెలంగాణకు అన్యాయం జరిగిందని రేవంత్, మంత్రులు ఆరోపిస్తుంటే, రేవంత్ చేతకానితనంవల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని మాజీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్ రావు(Harish Rao) ప్రతిరోజు ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు.

ఇంతకీ ఇపుడు విషయం ఏమిటంటే గడచిన మూడునెలలుగా కృష్ణానది జలాల(Krishna water)నుండి ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10వేల క్యూసెక్కుల నీటిని అక్రమంగా వాడేసుకుంటోందని హరీష్ ఆరోపిస్తున్నారు. వాటాకు మించి ఏపీ ప్రభుత్వం నీటిని వాడేసుకుంటున్నా రేవంత్(Revanth) చోద్యంచూస్తున్నారని మాజీమంత్రి ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబునాయుడు(Chandrababu Naidu)తో రేవంత్ కున్న వ్యక్తిగత సంబంధాలవల్లే ఏపీప్రభుత్వం పరిమితికిమించి నీటినివాడుకుంటున్నా రేవంత్ కావాలనే పట్టించుకోవటంలేదన్నది హరీష్ ఆరోపణ. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం కళ్ళుతెరిచి ఏపి జలదోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం జలదోపిడీని అడ్డుకునేంత సీన్ ఒంటరిగా రేవంత్ ప్రభుత్వానికి లేకపోతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్(కేఆర్ఎంబీ) ముందు ధర్నా చేయటానికి తాము వస్తామని హరీష్ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.

ఈ ఏడాది కృష్ణానదిలో 1010 టీఎంసీల నీళ్ళున్నట్లు చెప్పారు. తాత్కాలిక ఒప్పందం 66:34 నిష్పత్తి ప్రకారం ఏపీకి దక్కాల్సిన నీరు 666 టీఎంసీలు మాత్రమే అన్నారు. అయితే ఇప్పటికే 657 టీఎంసీల నీటిని వాడేసుకున్న ఏపీ ప్రభుత్వం ఇకముందు కూడా ఇదేపద్దతిలో నీటిని వాడుకునేందుకు రేవంత్ సహకరిస్తున్నట్లు ఆరోపించారు. వేసవి మొదలుకాకముందే ఇన్ని వందల టీఎంసీల నీటిని వాడేసుకున్న ఏపీ ప్రభుత్వం వేసవి మొదలైన తర్వాత మరింత నీటిని వాడుకోకుండా ఉంటుందా అని హరీష్ ప్రశ్నించారు. లెక్కప్రకారం తెలంగాణకు 343 టీఎంసీల నీరు అందాలన్నారు. అయితే ఇప్పటికి తెలంగాణ ప్రభుత్వం వాడుకున్నది కేవలం 220 టీఎంసీల నీరుమాత్రమే అని చెప్పారు. నీటి లభ్యత ఉన్నపుడు 343 టీఎంసీల నీటిని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాడుకోవటంలేదో చెప్పాలని డిమాండ్ చేశారు.

పరిమితికి మించి ఏపీ ప్రభుత్వం నీటిని వాడేసుకుంటున్న విషయం తెలిసీ, నీటిలభ్యత ఉన్నపుడే వాడుకోవాలని తెలిసి కూడా రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఉపేక్షిస్తోందో అర్ధంకావటంలేదన్నారు. తెలంగాణ సాగు, తాగు అవసరాలకు నీరు అవసరమైనపుడు కృష్ణానదిలో నీరులేకపోతే అప్పుడు కాంగ్రెస్ సర్కార్ ఏమిచేస్తుందని హరీష్ నిలదీశారు. నాగార్జున్ సాగర్ ఎడమకాల్వ కింద 6.38 లక్షల ఎకరాల్లో రైతులు పంటలు వేసుకున్న విషయాన్ని హరీష్ వివరించారు. అవసరమైనంత నీరిస్తే కాని పంటలు పండవన్నారు. ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జనాలు మంచినీటికోసం సాగర్ జలలపైనే ఆధారపడినట్లు చెప్పారు. రైతుల పంటలు పండాలన్నా, పై జిల్లాల్లోని ప్రజల తాగునీటికి ఇబ్బందులు రాకూడదంటే వెంటనే సాగర్ కుడికాల్వకు, ముచ్చుమర్రి నుండి తోడుతున్న నీటిని, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలించుకుంటున్న నీటిని తక్షణమే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకోవాలని హరీష్ డిమాండ్ చేశారు.

ఉత్తమ్ జవాబు ఏమిటి ?

హరీష్ రావు ఆరోపణలకు, ప్రశ్నలకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttamkumar Reddy) మీడియ సమావేశంలో ధీటైన సమాధానమిచ్చారు. మంత్రి ఏమన్నారంటే ఏపీ జలదోపిడీకి సహకరించిందే కేసీఆర్(KCR) ప్రభుత్వమన్నారు. తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) ముఖ్యమంత్రులుగా ఉన్నపుడే ఏపీ జలదోపిడీకి తెరలేపిందని మండిపడ్డారు. జగన్ తో కేసీఆర్ కున్న సంబంధాల కారణంగా అప్పట్లో సాగర్ జలాలను ఏపీ ప్రభుత్వ యధేచ్చగా తరలించుకుపోయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. జగన్ సీఎంగా ఉన్నంతకాలం ఏపీ ప్రభుత్వం ప్రతిరోజు 10 వేల క్యూసెక్కుల నీటిని తరలించుకున్న విషయాన్ని రికార్డులతో సహ ఉత్తమ్ వివరించారు. నిబంధనలను ఉల్లంఘించి జగన్ ప్రభుత్వం రోజుకు పదివేల క్యూసెక్కుల నీటిని తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏమిచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీష్ ఏపీ ప్రభుత్వం జలదోపిడీపై ఎందుకు నోరిప్పలేదని మండిపడ్డారు.

నీటివాడకం విషయంలో కేసీఆర్ హయాంలోనే తెలంగాణకు జరగకూడనంత అన్యాయం జరిగిందని ఉత్తమ్ ధ్వజమెత్తారు. కేసీఆర్ హయాంలోనే ఏపీప్రభుత్వం జలదోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకునుంటే ఇప్పుడు సమస్య వచ్చేదికాదన్నారు. ఉత్తమ్ వాదన ఎలాగుందంటే అప్పట్లో కేసీఆర్ తప్పుచేశారు కాబట్టి ఇపుడు తామూ అదే తప్పుచేస్తామని సమర్ధించుకుంటున్నట్లే ఉంది. జలదోపిడీని అరికట్టేందుకు, జలదోపిడీని శాస్త్రీయంగా తేల్చేందుకు సాగర్ ప్రాజెక్టులో టెలిమెట్రీ పరికరాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు అమర్చలేదో వివరించాలని హరీష్ ను ఉత్తమ్ డిమాండ్ చేశారు. టెలిమెట్రీ పరికరాలను అమర్చకుండా ఏపీ ప్రభుత్వం నీటిదోపిడీకి కేసీఆర్, హరీష్ యధేచ్చగా సహకరించి ఇపుడు తమప్రభుత్వంపై బురదచల్లితే ఉపయోగం ఏమిటని ఉత్తమ్ మండిపడ్డారు. కృష్ణాజలాల్లో వాట 299 టీఎంసీలు సరిపోతాయని రాతమూలకంగా కేఆర్ఎంబీకి రాసిచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే కదాని ఉత్తమ్ లాజిక్ లేవనత్తారు.

చంద్రబాబు ఏమంటున్నారు ?

ఏపీప్రభుత్వం జలదోపిడీచేస్తోందన్న హరీష్ ఆరోపణలపై చంద్రబాబునాయుడు స్పందించారు. చంద్రబాబు ఏమన్నారంటే సాగర్ జలాల్లో ఏపీకి రావాల్సిన వాటాను మాత్రమే ఉపయోగించుకుంటున్నట్లు చెప్పారు. ఏపీకి దక్కాల్సిన నీటివాటాను నూరుశాతం ఉపయోగించుకుంటామని బల్లగుద్దకుండానే చెప్పారు. కృష్ణా, గోదావరి జలాలను ఉపయోగించుకునేందుకు ఏపీకి పూర్తి హక్కులున్నాయన్నారు. ఎలాగంటే పైరెండు నదుల నీటిని ఉపయోగించుకునే రాష్ట్రాల్లో ఏపీనే టైలెండ్ స్టేట్ అని గుర్తుచేశారు. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ వాడుకోంగా మిగిలిన నీరు మాత్రమే ఏపీలోకి ప్రవేశించి చివరకు సముద్రంలో కలుస్తోందన్న విషయాన్ని చంద్రబాబు గుర్తుచేశారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని ఏపీ వాడుకుంటే తప్పేమిటని చంద్రబాబు ఎదురు ప్రశ్నించారు.

కేసీఆర్, రేవంత్ ఇద్దరూ తప్పుచేస్తున్నారా ?

కృష్ణా జలాల వాడకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద హరీష్ రావు, కేసీఆర్ హయాంలో జరిగిన విషయాలపై మంత్రి ఉత్తమ్ ఆరోపణలను గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. అదేమిటంటే అప్పట్లో కేసీఆర్ అయినా ఇప్పుడు రేవంత్ అయినా ఒకే తప్పు చేస్తున్నారని తెలుస్తోంది. కేసీఆర్ హయాంలో జగన్ అడ్వాంటేజ్ తీసుకుంటే, రేవంత్ హయాంలో చంద్రబాబు అవకాశం తీసుకుంటున్నారన్న విషయం పరస్పర ఆరోపణల్లో బయటపడుతోంది. కాకపోతే గమనించాల్సిన విషయం ఏమిటంటే తమహయాంలో తప్పులు జరిగినపుడు పట్టించుకోని హరీష్ రావు అదే తప్పు ఇపుడు జరుగుతుంటే మాత్రం రెచ్చిపోయి రేవంత్ ప్రభుత్వంపై బురదచల్లే ప్రయత్నంచేస్తున్నారు. తాను రేవంత్ ప్రభుత్వాన్ని తప్పుపడితే వెంటనే మంత్రులు తమహయంలో జరిగిన తప్పులను ఎత్తిచూపుతారని, ప్రస్తావిస్తారన్న కనీసపు సోయి కూడా హరీష్ లో లేకపోవటమే విచిత్రం.

చాలా విషయాలు సేమ్ టు సేమ్

ఇపుడు లేటెస్టుగా మొదలైన వాటర్ వారే కాదు చాలా విషయాల్లో కేసీఆర్ ప్రభుత్వంలో ఏమి జరిగిందో ఇపుడూ అదే జరుగుతోంది. ఉదాహరణలను చూస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టళ్ళల్లో భోజనాలు సరిగా లేకపోవటం. కాంగ్రెస్ ప్రభుత్వంలో సంక్షేమహాస్టళ్ళల్లో పురుగలు, కలుషిత భోజనాలు పెడుతున్నారని కేటీఆర్, హరీష్ నానా గోలచేశారు. విచిత్రం ఏమిటంటే కేసీఆర్ ప్రభుత్వంలో కూడా ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి. అసలు కేసీఆర్ పదేళ్ళ హయాంలోనే సంక్షేమహాస్టళ్ళ బాగోగులను పట్టించుకునుంటే ఇపుడీ పరిస్ధితలు తలెత్తేవి కావన్న ఆరోపణలకు కేటీఆర్, హరీష్ సమాధానాలు చెప్పటంలేదు. లగచర్ల రైతులపై కేసులు పెట్టి జైళ్ళకు పంపటం, సంగారెడ్డి జైలులో ఉన్న లగచర్ల రైతు హీర్యానాయక్ చేతులకు బేడీలు వేసి హైదరాబాదు ఆసుపత్రికి తీసుకురావటం పెద్ద ఇష్యూ అయ్యింది. రైతు చేతులకు బేడీలు వేసి తీసుకురావటంపై కేటీఆర్ పెద్దస్ధాయిలో గోలచేశారు. కేసీఆర్ హయాంలో ఆందోళనలు చేసిన ఖమ్మం-వరంగల్ రైతుల కాళ్ళకు, చేతులకు ఇనుపగొలుసులు బిగించి జైళ్ళల్లోకి తోసిన విషయం అందరికీ తెలిసిందే.

ఒకటికాదు రెండు కాదు చాల అంశాలు ఇపుడు ఏవైతే జరుగుతున్నాయో గతంలో కేసీఆర్ హయాంలో కూడా అవే జరిగాయి. అయితే ఘటనలు రేవంత్ హయాంలో మాత్రమే జరుగుతున్నాయన్నట్లుగా కేటీఆర్, హరీష్ కలరింగ్ ఇస్తు తమహయాంలో ఏమి జరిగిందన్న విషయాలను మరచిపోయారు. అయితే వీళ్ళు మరచిపోయినా, మరచిపోయినట్లు నటిస్తున్నా రేవంత్, మంత్రులు గుర్తుచేయకుండా ఉండరుకదా ? గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, అభ్యర్ధుల ఆందోనలు, పోలీసుల లాఠీఛార్జీలు, కొంతమంది అభ్యర్ధుల ఆత్మహత్యలు తమహయాంలో జరగలేదన్నట్లుగా కేటీఆర్, హరీష్ వ్యవహరిస్తుంటే వాటిని రేవంత్, మంత్రులు గుర్తుచేస్తు ఎదురుదాడులు చేస్తున్నారు. ఇపుడు లేటెస్టుగా మొదలై వాటర్ వార్ చివరకు ఎలా ముగుస్తుందో చూడాల్సిందే.

Read More
Next Story