
‘కాంగ్రెస్ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు’
తెలంగాణలో నిర్మించదలుచుకున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని కిషన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ ప్రయోజనాల గురించి కాంగ్రెస్ చేత చెప్పించుకోవాల్సిన దుస్థితి బీజేపీకి పట్టలేదని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిసన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప్రయోజనాల కోసం తమ ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచిస్తుందని, ఆ దిశగానే అనేక ప్రణాళికలను ఇప్పటికే సిద్ధం చేశామని ఆయన అన్నారు. కేంద్రం సిద్ధం చేసిన డీలిమిటేషన్ ప్రణాళికలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ లబ్ధిని దృష్టిలో పెట్టుకునే వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు స్థానాల్లో ఎటువంటి మార్పు రాదని, కానీ తెలంగాణ, తమిళనాడు సీఎంలు కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే విధంగా తమ ప్రభుత్వం ఏ రాష్ట్రంపైనా హిందీని బలవంతంగా రుద్దడం లేదని చెప్పారు కిషన్ రెడ్డి. కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, పొలిటికల్ మైలేజీ పెంచుకోవడం కోసం వారు ఈ అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వారిలో రేవంత్ కూడా ఒకరని, తన స్వార్థ రాజకీయాల కోసం కేంద్రంపై అనేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అధికారంలోకి రాకముందు రేవంత్ రెడ్డి లిఖిత పూర్వకంగా అనేక హామీలు ఇచ్చరని, వాటికి ఇప్పుడు అలీగతీ లేదని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ప్రాజెక్ట్‌లు ముందేసుకున్నారని అన్నారు. కోచ్ ఫ్యాక్టరీ బడ్జెట్ అనుకున్న దాన్ని అధిగమించిందని, అయినా వెనకడుగు వేయకుండా కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వేగంగా ముందుకు సాగిస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి.
తెలంగాణలో నిర్మించదలుచుకున్న రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం విషయంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో చర్చించామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరినట్లు వెల్లడించారు. అందుకు గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రంలో 10 జాతీయ రహదారులను పూర్తి చేశఆం. పార్లమెంటు సమావేశాల తర్వాత వీటిని ప్రారంభిస్తాం. వీటిని కేంద్రమంత్రి గడ్కరీ ప్రారంభిస్తారు. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగంపై గద్కరీతో చర్చిచాం. ఉత్తరభాగం భూసేకరణకు అయ్యే ఖర్చులో 50శాతాన్ని కేంద్రమే భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లైఓవర్ల కింద భూసేకరణ పూర్తి చేయాలి. ఆ తర్వాతే వాటికింద రోడ్డు వేయడం సాధమ్యమవుతుంది. ఆరు ప్రాంతాల్లో భూసేకరణ పూర్తికాలేదు’’ని చెప్పారు.