
‘ఆ మోడల్.. ఈ మోడల్ కాదు.. తెలంగాణ మోడల్ రావాలి’
గ్రూప్-1 అభ్యర్థులకు నియామక పత్రాలు అందించిన సీఎం రేవంత్.
కాలం కలిసొచ్చి గెలిస్తే తాము కారణజన్ములమని గత పాలకులు అనుకున్నారని బీఆర్ఎస్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రజలు వారిని నమ్మి అధికారం కట్టబెడితే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన ‘కొలువుల పండగ’ కార్యక్రమంలో గ్రూప్-1కు ఎంపికయిన 562 మంది అభ్యర్థులకు సీఎం రేవంత్.. నియామక పత్రాలు అందించారు. చరిత్ర, పౌరుషం ఉన్న గడ్డ తెలంగాణ అని ఆయన అన్నారు. వారు రాష్ట్ర పునఃనిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరారు. “తెలంగాణ భవిష్యత్ నిర్మాణ బాధ్యత మీ చేతుల్లో ఉంది. ఒక బాధ్యతతో వ్యవహరించండి. మనమంతా కలిసి తెలంగాణను దేశానికి ఒక మోడల్‌గా నిలబెడదాం” అని దిశానిర్దేశం చేశారు.
"గ్రూప్-1 కు ఎంపికైన అభ్యర్థుల భుజాలపై తెలంగాణ భవిష్యత్తు పునర్నిర్మాణ బాధ్యత ఉంది. ఇదొక గొప్ప అవకాశం. బాధ్యతతో వ్యవహరించి నియామకాలు చేపట్టాం. ప్రభుత్వం ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు వెళుతోంది. స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలన్న లక్ష్య సాధనలో మీ వంతు పాత్ర పోషించాలి. గుజరాత్ మాడల్ అనో, ఇంకేదో అనో కాదు. మన పోటీ దేశంతోనే కాదు. ప్రపంచంతో పోటీ పడే విధంగా తెలంగాణను తీర్చిదిద్దాలి. అందుకు కంకణబద్దులై పనిచేయండి’’ అని కోరారు.
‘‘ఉద్యోగంలో చేరిన కొత్తలో గరం, గరంగా ఉండి, తర్వాత నరం, నరంగా మారి క్రమేణా బేషరంగా మారుతారన్న నానుడి తప్పు అని నిరూపించే బాధ్యత మీపై ఉంది. ఒక నిరుపేద, నిస్సహాయుడు మీవద్దకు వచ్చినప్పుడు వారికి సేవ చేసే విషయంలో మీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. మీరంతా నిన్నటి వరకు నిరుద్యోగ యువకులు. ఈ రోజు నుంచి ఆఫీసర్లు. అఫీసర్లకు ఎంతో బలం ఉంది. మీ భవిష్యత్తుకు అది గ్రీన్ చానెల్’’ అని తెలిపారు.
‘‘మీ భవిష్యత్తును తీర్చిదిద్దాలని రూపాయి, రూపాయి కూడబెట్టి మీకోసం సర్వం త్యాగం చేసిన మీ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. ఉద్యోగులెవరైనా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే వారి జీతాల్లో 10 శాతం కోత పెట్టి తల్లిదండ్రుల ఖాతాల్లో వేసే చట్టం తెస్తాం. గ్రూప్ -1 ఉద్యోగం సాధించడానికి 3 లక్షలకుపైగా అభ్యర్థులు పోటీ పడితే అందులో 562 మంది ఎంపికయ్యారు. మీలో ఉన్న నైపుణం, చైతన్యం, పట్టుదల కారణంగా మీరు తెలంగాణ అభివృద్ధికి భాగస్వామ్యులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 లో గ్రూప్ 1 నిర్వహిస్తే ఆ తర్వాత గత ప్రభుత్వం గ్రూప్ -1 నిర్వహించాలన్న ఆలోచన చేయలేదు’’ అని వివరించారు.
‘‘ఏ ఆకాంక్ష కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకున్నామో, గడిచిన పదేండ్లలో ఆ ఆకాంక్ష నెరవేరలేదు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణ త్యాగం వల్ల సాధించిన తెలంగాణ ఒక కుటుంబ ప్రయోజనం కోసం కాదు. పెద్ద పెద్ద ఉద్యోగాలను నియమించే పబ్లిక్ సర్వీస్ కమిషన్ చిన్న చిన్న హోదాల్లో ఉన్న వారిని నియమించడమే కాకుండా ఆ రోజు ప్రశ్నాపత్రాలు పల్లీబఠాణీలుగా జిరాక్స్ సెంటర్లలో లభించే విధంగా పోటీ పరీక్షలను అపహాస్యం చేశారు. ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను యూపీఎస్సీ కన్నా ఉన్నతంగా ఉంచాలని కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. అది నచ్చని కొంతమంది కడుపుమంటతో చేయని ప్రయత్నాలు లేవు. ఉద్యోగాలను అమ్ముకున్నారని అపవాదు వేశారు. నేను, మంత్రివర్గ సహచరులం మంచి చేయాలన్న ఒక సంకల్పంతో పనిచేశాం’’ అని పేర్కొన్నారు.
‘‘ఆరోపణలు చేసినప్పటికీ ఓపికతో దిగమింగుకున్నాం. డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా అంత ఆందోళన చెందలేదు. కానీ గ్రూప్-1 కోసం ఆందోళన చెందా. ఒక మంచి సంకల్పంతో పని చేసినప్పుడు లక్ష్యం ముందుండాలి తప్ప మరొకటి కాదు” అని ఉద్ఘాటించారు.