
Congress | ‘బీజేపీ చెప్పుచేతల్లో ఎన్నికల సంఘం’
కులాలు, మతాల పేరిట దేశ భవిష్యత్తును బీజేపీ సంకటంలో పడేస్తుందన్న మహేష్ కుమార్ గౌడ్.
కేంద్ర ఎన్నికల సంఘం(Election Commission), బీజేపీ(BJP)పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ గీసిన గీతను దాటకుండా ఈసీ పనిచేస్తుందని, దీనిని తమ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) తేటతెల్లం చేశారని అన్నారు. ఈసీ అనేది బీజేపీ అనుబంధ సంస్థగా మారిందని, ప్రశ్నిస్తే దేహద్రోహులన్న ముద్ర వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారాయన. క్విట్ ఇండియా(Quit India) దినోత్సవం సందర్భంగా గాంధీ భవన్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగానే ఆనాడు ‘క్విట్ ఇండియా’ చేసినట్లే ఇప్పుడు కూడా ‘క్విట్ బీజేపీ’ ఉద్యమం చేస్తేనే భారతదేశానికి భవిష్యత్తు ఉంటుందని మహేష్ ఆరోపించారు. ‘చంపు లేదా చావు’ అన్న నినాదంతో ఆనాడు గాంధీ ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ప్రారంభించారని, కాంగ్రెస్ చరిత్రను తుడిచేయడానికి ఇప్పుడు బీజేపీ చూస్తోందని ఆరోపించారు. తమకు అనువుగా రాజ్యాంగాన్ని మార్చుకునే ప్రయత్నాల్లో బీజేపీ ఉందని, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. అందుకు అడ్డు తగులుతున్న ప్రతిపక్షాలపై కుట్రపూరిత దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.
‘‘ఎన్నికల కమిషన్ అనేది బీజేపీకి అనుంబంధ సంస్థగా మారింది. ప్రశ్నిస్తే దేశద్రోహులన్న ముద్ర వేస్తున్నారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ దేశ రక్షణ కోసం పనిచేస్తుంది. కులాలు, మతాల పేరిట దేశ భవిష్యత్తును బీజేపీ సంకటంలో పడేస్తుంది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ, ఆర్ఎస్ఎస్ నాయకుడు ఒక్కరూ లేరు’’ అని గుర్తు చేశారు. అనంతరం ఆయన కాంగ్రెస్ నేతలు చేపట్టిన ‘జనహిత’ పాదయాత్ర గురించి మాట్లాడారు. తమ పాదయాత్రకు ప్రజల నుంచి అద్భుత ఆదరణ లభించిందని చెప్పారు. ఆగస్టు చివరి వారంలో రెండో దశ పాదయాత్ర చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు కొన్ని అనివార్య కారణాల వల్ల ఖర్గే, రాహుల్ రాలేకపోయారిని తెలిపారు. దాంతో పాటుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కూడా మహేష్ కుమార్ స్పందించారు.
‘‘కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తోంది. కొండా మురళి వ్యవహారం కూడా త్వరలోనే పరిష్కారమవుతుంది. అనిరుద్ రెడ్డికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వివరణ కూడా తీసుకున్నాం. బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. బీసీల కోరిక న్యాయబద్దమైనది. ప్రతిపక్షాలు కావాలనే లేనిపోని విమర్శలు చేస్తున్నాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బీజేపీకి మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలపై 3.5శాతం ఈడీ కేసులు ఉన్నాయి. మిగిలిన 96.5 శాతం ఈడీ కేసులు విపక్షాలపైనే ఉన్నాయి. అవినీతి, అక్రమాలపై రాష్ట్రప్రభుత్వం పద్దతి ప్రకారం, చట్టాన్ని అనుసరిస్తూ ముందుకు పోతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి వ్యవహారాలపై సమగ్రంగా చర్చించి ముందుకు వెళ్తాం’’ అని వెల్లడించారు.