![ఎకో టూరిజంను ప్రోత్సహిస్తాం: రేవంత్ ఎకో టూరిజంను ప్రోత్సహిస్తాం: రేవంత్](https://telangana.thefederal.com/h-upload/2025/01/28/508866-revanth-reddy.webp)
ఎకో టూరిజంను ప్రోత్సహిస్తాం: రేవంత్
అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేనంతగా రాష్ట్రంలో ఎకో టూరిజంను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
అటవీ ప్రాంతాల సందర్శనకు మధ్యప్రదేశ్, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేనంతగా రాష్ట్రంలో ఎకో టూరిజంను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదే విధంగా మందిరాల సందర్శన కోసం తమిళనాడు, ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తామని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా పొద్దటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో సీఎంతో పాటు సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక విషయాలు పంచుకున్నారు. తెలంగాణలో ఎకో ఫ్రెండ్లీ టూరిజంను అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రకృతివనంగా తెలంగాణ
‘‘ఒక మంచి ఎకో టూరిజం పార్క్‌ను ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది. ప్రజా ప్రభుత్వం ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లింది. రాష్ట్రంలో టెంపుల్, హెల్త్, ఎకో టూరిజం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. టెంపుల్, ఎకో టూరిజమే రాష్ట్రానికి గుర్తింపుతో పాటు ఆదాయం పెరగడానికి ఉపయోగపడుతుంది. దేవాలయ దర్శనాలకు, అటవీ సంపదను చూసేందుకు ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు వెళుతున్నాం. రామప్ప, వేయిస్తంభాల గుడి లాంటి అద్భుతమైన ఆలయాలు తెలంగాణలో ఉన్నాయి. నల్లమల అడవులు, మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి. టెంపుల్, ఎకో టూరిజం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని తెలిపారు.
‘‘త్వరలో టూరిజం పాలసీని తీసుకురాబోతున్నాం. ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయబోతున్నాం. ఎక్స్పీరియం లాంటి ఎకో టూరిజం పార్కును ఇక్కడ అభివృద్ధి చేయడం అభినందనీయం. రాబోయే రోజుల్లో ఇది అద్భుతమైన పర్యాటక కేంద్రంగా మారనుంది. వికారాబాద్ అటవీ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. త్వరలో వికారాబాద్ ప్రాంతాన్ని ఎకో టూరిజంగా అభివృద్ధి చేయబోతున్నాం. రాష్ట్రం ఆలోచనకు అనుగుణంగా రామ్ దేవ్ గారు ఈ పార్క్ ను అభివృద్ధి చేయడం అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని భావిస్తోంది. వనజీవి రామయ్య లాంటి వారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతీ విద్యార్థి.. తల్లి పేరుతో ఒక మొక్కను నాటి సంరక్షించేలా కొన్ని విధానాలు తీసుకురాబోతున్నాం’’ అని వెల్లడించారు.
పార్క్ విశేషాలివే
ప్రపంస్థాయి ప్రమాణాలతో దాదాపు 150 ఎకరాల్లో ఈ పార్కును రూపొందించారు. ఇందులో 25వేల జాతుల మొక్కలు ఉన్నాయి. 85 దేశాల నుంచి దిగమతి చేసిన అరుదైన వృక్షాలు ఉన్నాయి. ఎక్స్ పీరియం మార్కులో రూ.1లక్ష నుంచి రూ.3.5 కోట్లు విలువ చేసే అరుదైన వృక్షాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పటికే ఇందులోని పలు వృక్షాలను సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు కొనుగోలు చేశారు. రాందేవ్‌రావ్ దాదాపు ఆరున్నరేళ్లు శ్రమించి ఈ పార్క్‌కు తీర్చిదిద్దారు. ఇందులో వివిధ ఆకృతుల్లో రాక్ గార్డెన్‌ను సిద్ధం చేశారు. 1500 మంది కూర్చునేలా యాంపీ థియేటర్‌ను ఏర్పాటు చేశారు. రూ.150కోట్లు విలువైన మొక్కలు, చెట్లు ఉన్న ఏకైక పర్యాటక ప్రాంతంగా ఈ పార్కు నిలిచింది.