ముదురుతున్న కృష్ణ జలాల వివాదం.. ‘ఏపీతో యుద్ధానికీ సిద్ధం’
x
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ముదురుతున్న కృష్ణ జలాల వివాదం.. ‘ఏపీతో యుద్ధానికీ సిద్ధం’

కృష్ణా జలాల కేటాయింపు కోసం ఆంధ్రతో యుద్ధానికైనా సిద్ధమవుతామని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రం పరువు తీసిందన్నారు.



రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల వివాదం ముదురుతోంది. తమ వాటాను వదులుకునే ప్రసక్తే లేదని తెలంగాణ నేతలు తేల్చి చెప్తున్నారు. ఈ వివాదంపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కృష్ణ జలాల కేటాయింపు కోసం తాము ఎంత దూరమైనా వెళ్తామని జగిత్యాల ఆలయ ఆవరణలో బీఆర్ఎస్ నుంచి మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి, ఇద్దరు కౌన్సిలర్లను కాంగ్రెస్‌లోకి ఆహ్వానిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పదవి ఉన్నా లేకున్నా జగిత్యాల అభివృద్ధికే కృషి చేస్తానని వ్యాఖ్యానించారు.

ఆంధ్రతో యుద్ధానికైనా సిద్ధం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కృష్ణ జలాల సమస్యను పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం అలా కాదు. తెలంగాణ ప్రజల అభివృద్ది, సంక్షేమం కోసం ఏమైనా చేస్తాం. ఎంత దూరమైనా వెళ్తాం. అదే విధంగా తెలంగాణకు కృష్ణ జలాల కేటాయింపు విషయంలో వెనకడుగు వేయబోము. అవసరమైతే ఆంధ్రతో యుద్ధానికి కూడా సిద్ధమవుతాం. ఏమైనా కృష్ణ జలాల కేటాయింపును సాధించి తీరుతామని ఆయన తేల్చి చెప్పారు. అనంతరం బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు.

అభివృద్ధి అంతా మాటల్లోనే

బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన తెలంగాణ అభివృద్ధి అంతా కూడా ఆ పార్టీ నేతల మాటల్లోనే ఉందే తప్ప రాష్ట్రంలో ఏ మూల కూడా కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కానీ తమ ప్రభుత్వం మాటలతో కాకుండా అభివృద్ధిని చేతల్లో చూపుతుందన్నారు. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, అధికారంలో ఉండే మొత్తం ఐదేళ్లలో 6లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తామని భరోసా ఇచ్చారు. రూ.100 కోట్ల నిధులతో జగిత్యాల యావర్ రోడ్డు వెడల్పు పనులు చేస్తానని హామీ ఇచ్చారు.

కాళేశ్వరంతో తెలంగాణ పరువు పోయింది

బీఆర్ఎస్ నిర్మించిన కాళేశ్వరంలో ప్రాజెక్ట్‌తో దేశంలో తెలంగాణ పరువు గంగలో కలిపి సోయిందని దుయ్యబట్టారు. అదే విధంగా తప్పిదాలి బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్లు మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, ఆ దిశగా కుట్ర కూడా జరుగుతుందని ఆరోపించారు. ‘‘ఎన్నికల్లో గెలుపోటములు సర్వ సహజం. కానీ జగిత్యాలను రాష్ట్రంలో ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దే బాధ్యత నాది. జిల్లాలో జేఎన్‌టీయూ, వ్యవసాయ కళాశాల, ఎన్ఏసీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. కేసీఆర్‌ను నమ్మి పదేళ్లు అధికారం కట్టబెడితే ఆయన రాష్ట్ర ప్రజలను మోసం చేశారు. కృష్ణ జలాల కేటాయింపులో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ఆయన చూస్తూ కూర్చున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అలా జరగదు. కృష్ణ జలాల కేటాయింపు కోసం ఎవరితోనైనా పోరాడతాం’’అని బీఆర్ఎస్ టార్గెట్‌గా మండిపడ్డారు.


Read More
Next Story