ఎస్ఎల్‌బీసీ తవ్వకాలకు అత్యాధునిక పద్దతి
x

ఎస్ఎల్‌బీసీ తవ్వకాలకు అత్యాధునిక పద్దతి

అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక సమీక్ష సమావేశం.


ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ తవ్వకాల కోసం అత్యాధునిక పద్దతులను వినియోగించనున్నట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. SLBC ప్రాజెక్ట్‌ను తమ ప్రభత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని ఆయన అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పునఃప్రారంభించి వేగంగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. సచివాలయంలో ఎస్‌ఎల్‌బీసీ పనుల పురోగతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ఇంజనీర్ ఇన్ చీఫ్ అంజద్ హుస్సేన్, లెఫ్టినెంట్ జనరల్ హర్పాల్ సింగ్, కల్నల్ పరిఖ్షిత్ మెహ్రా, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బోజ్జా ఇతర అధికారులు పాల్గొన్నారు.

టీబీఎం తొలగించిన నేపథ్యంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టన్నెల్ తవ్వకాలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. సొరంగం తవ్వకాల్లో ఆటంకాలు తలెత్తకుండా ఆధునిక పద్ధతులు వినియోగిస్తామని తెలిపారు. మిగిలిన 9.8 కిలోమీటర్ల సొరంగ మార్గానికి సంబంధించి ఎలక్ట్రో మాగ్నెటిక్ సర్వే పూర్తయిందని అధికారులు వివరించారు. భూగర్భ పరిస్థితులను నిరంతరం అంచనా వేసేందుకు ప్రత్యేక సపోర్ట్ సిస్టం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని ఉత్తమ్ తెలిపారు. సొరంగం రెండు వైపులా తవ్వకాలకు అవసరమైన నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బందికి 25 శాతం అదనపు వేతనం అందిస్తామని ప్రకటించారు. పనుల పురోగతిపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహిస్తామని చెప్పారు.

భారత రాష్ట్ర సమితి పదేళ్ల పాలనలో నిర్లక్ష్యం కారణంగానే ఎస్‌ఎల్‌బీసీ పనులు ఆలస్యమయ్యాయని మంత్రి ఆరోపించారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేసి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యమన్నారు. తాగునీటి సమస్యతో పాటు ఫ్లోరోసిస్‌ను శాశ్వతంగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంగా ఎస్‌ఎల్‌బీసీ నిలవబోతోందని మంత్రి తెలిపారు. ప్రజలకు న్యాయం చేయడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.

Read More
Next Story