‘ఇండియా స్టార్టప్ క్యాపిటల్‌గా తెలంగాణ’
x

‘ఇండియా స్టార్టప్ క్యాపిటల్‌గా తెలంగాణ’

సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ పటంలో నిలిచిందన్న సీఎం రేవంత్.


ప్రపంచ స్టార్టప్ మాప్‌లో హైదరాబాద్‌ను ముందువరుసలో నిలబెట్టే సమయం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ–హబ్‌లో జరిగిన గూగుల్ స్టార్టప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ యువతలో ఉన్న ప్రతిభ, ఆవిష్కరణ శక్తి ప్రపంచాన్ని మార్చగలదు. ఇక నుంచి హైదరాబాద్ యూనికార్న్‌ల నగరంగా మారాలి” అని విజన్‌ను వెల్లడించారు.

స్టాన్‌ఫోర్డ్‌కి చెందిన ఇద్దరు యువకులు ఒక చిన్న గారేజీలో గూగుల్‌ను స్థాపించిన ఉదాహరణను గుర్తుచేసిన సీఎం, ప్రపంచ దిగ్గజాలుగా మారిన అనేక కంపెనీలు కూడా స్టార్టప్‌లుగానే పుట్టాయని తెలిపారు. అదే స్పూర్తితో తెలంగాణ యువత ముందుకు సాగాలని సూచించారు.

ఇటీవల నిర్వహించిన తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర అభివృద్ధి పథకాన్ని జాతీయ, అంతర్జాతీయ కార్పొరేట్ల ముందుంచామని అన్నారు. 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వెల్లడించారు.

సాఫ్ట్‌వేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో హైదరాబాద్ ఇప్పటికే ప్రపంచ పటంలో నిలిచిందని పేర్కొంటూ, ఇక ముందు ఇన్నోవేటివ్, ప్రోడక్ట్-బేస్డ్, ఐపీ ఆధారిత స్టార్ట్-అప్స్ పైనే ప్రధాన దృష్టి ఉంటుందని తెలిపారు.

రాష్ట్రం నుండి కనీసం 100 యూనికార్న్‌లు, వాటిలో 10 సూపర్ యూనికార్న్‌లు వచ్చే దశాబ్దంలో వెలువడాలన్నదే తెలంగాణ లక్ష్యమని చెప్పారు.

ఈ దిశలో స్టార్ట్‌అప్ ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం రూ. 1,000 కోట్ల స్టార్ట్‌అప్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. యువ పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సంపూర్ణంగా వినియోగించుకోవాలని సూచించారు.

గూగుల్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్‌అప్‌లకు అన్ని విధాలుగా సహకరించేందుకు సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Read More
Next Story