
Revanth Reddy | కాంగ్రెస్ పాలనలో పైరవీలకు తావు లేదా..?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అత్యంత పారదర్శకమైన, ప్రజాస్వామికమైన పాలన అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఏర్పడినప్పటి నుంచి అత్యంత పారదర్శకమైన, ప్రజాస్వామికమైన పాలన అందుతుందని సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా పాలన అందిస్తున్నామని, పోలీసుల పదోన్నతుల విషయంలో కూడా పైరవీలకు స్థానం ఇవ్వలేదని ఆయన తెలిపారు. ఎటువంటి పైరవీలు లేకుండా పోలీసుల పదోన్నతులు, బదిలీలు జరిపామని, అన్ని విషయాల్లో ఇటువంటి పాలనే అందిస్తున్నామని తెలిపారు. భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగానికి 75 ఏళ్లు పూర్తయిందని అన్నారు. అందులోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ పలు విషయాలు పంచుకున్నారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్‌లను నియంత్రించడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కానీ తమ ప్రభుత్వం అలా కాదని, వీటిపై ఉక్కుపాదం మోపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారాయన. అతి త్వరలోనే పెరుగుతున్న సైబర్ నేరాలు, డ్రగ్స్ వినియోగంపై కొరడా ఝులిపిస్తామని వెల్లడించారు.
‘‘తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోంది. బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం. అంబేడ్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించాం. ఒకనాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి. కానీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయి. పోలీస్ శాఖలో దాదాపు 15 వేల నియామక పత్రాలు అందించాం. పీజీలు, పీహెచ్డీలు చదువుకున్నవారు కూడా పోలీస్ శాఖలో చేరుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు’’ అని వివరించారు.
‘‘సైబర్ క్రైమ్‌ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉంది. డ్రగ్స్ సరఫరా చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలి. బీటెక్, ఎంటెక్ చదివిన వారికి సైబర్ క్రైమ్ లో డాటా అనాలసిస్ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి. రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది. సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ లోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రగ్స్ , గంజాయి లాంటివి కనిపించొద్దు. స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. పోలీసులు యాజమాన్యాలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆలోచనలను వారికి వివరించండి. డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలి. ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం. ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు. ట్రాన్స్ జెండర్స్ పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు’’ అని చెప్పారు.
‘‘అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది. ఐపీఎస్ అధిజారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2కోట్లు అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే.. ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం. హోమ్ గార్డుల రోజువారీ బత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ weekly parade allowance ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం. హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ప్రమాదవశాత్తు మరణించినా రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేస్తాం. శాంతిభద్రతలను కాపడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి. అయినా పరిష్కారం కాకపోతే ఉపముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లండి. ఆపై ఇంకేమైనా సమస్యలుంటే నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా’’ అని భరోసా కల్పించారు.