అసలేంటీ ఈ గొడవ.. వారు ఎందుకు ప్రజా భవన్ లో భీష్మించారు
x
ప్రజాభవన్ లో ఆందోళన చేస్తున 2008 డీఎస్సీ అభ్యర్థులు

అసలేంటీ ఈ గొడవ.. వారు ఎందుకు ప్రజా భవన్ లో భీష్మించారు

మాకు ఉద్యోగాలు ఇవ్వండి. హైకోర్టు తీర్పు వచ్చి రెండేళ్లు కావస్తున్నా, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. 14 సంవత్సరాలు నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నాం.. అంటూ 2008..


మాకు న్యాయం చేయాలి.. మా ఉద్యోగాలు మాకు కావాలి.. ఇప్పటికి 14 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం.. హైకోర్టు కూడా మాకు ఉద్యోగాలు ఇవ్వాలని తీర్పు చెప్పింది. ఇంకెన్ని రోజులు ఎదురు చూడాలంటూ 2008 బీఎడ్ అభ్యర్థులు సోమవారం ప్రజాభవన్ లో ఆందోళనకు దిగారు. మాకు స్పష్టమైన ప్రకటన వచ్చే వరకూ ఇక్కడే ఉంటామని భీష్మించుకుని కూర్చున్నారు. అసలేంటీ ఈ గొడవ.. ఏం జరిగింది. కోర్టుకు ఎందుకు వెళ్లారు..

ఇదీ విషయం
2008 లో అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీని ప్రకటించింది. మొత్తం 52, 655 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 30,558 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి. జిల్లా ఎంపిక కమిటీలు పరీక్షను నిర్వహించిన తరువాత ప్రభుత్వం జారీ చేసిన ఎస్జీటీ పోస్టుల్లో 30 శాతం అంటే 10,200 పోస్టులను డీఎడ్ అభ్యర్థులకు ప్రభుత్వం కేటాయించింది. దీనిపై డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
తమ కంటే తక్కువ విద్యార్హత కలిగిన వారికి పది వేల పోస్టులు కేటాయించడంతో అభ్యర్థులు మొదట అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ ను ఆశ్రయించారు. అక్కడ వారికి చుక్కెదురైంది తరువాత వీరు హైకోర్టుకు తమ అభ్యర్థనను నివేదించారు. దీనిపై విచారించిన హైకోర్టు ద్వి సభ్య ధర్మాసనం డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, ఖాళీగా ఉన్న 3,500 పోస్టుల్లో బీఎడ్ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని సెప్టెంబర్ 22, 2022లోనే కోర్టు తీర్పు చెప్పింది. అయితే ఇప్పటి వరకూ వారికి ఉద్యోగాలు రాలేదు.
అభ్యర్థుల ఆందోళన
తమకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఉద్యోగాలను ఇవ్వకపోవడంతో బీఎడ్ అభ్యర్థులు ఆందోళనల బాట పట్టారు. జనవరి7, 2023 లో యాదాద్రి వద్ద మానవహారం నిర్వహించిన అభ్యర్థులు, తరువాత మోకాళ్లపై యాదగిరి గుట్టు ఎక్కి తమ నిరసన తెలిపారు. కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారని వారు గుర్తు చేశారు. తరువాత హైదరాబాద్ లో అప్పటి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కార్యాలయం ముందు కూడా ఆందోళన చేశారు. అయినప్పటికీ ఫలితం లేదని వారు అంటున్నారు.
ఏపీలో ఉద్యోగాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం
2019 లో ఆంధ్ర ప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలనిచ్చింది. అప్పుడు నష్టపోయిన 2,193 మంది బీఎడ్ లను మినిమమ్ స్కేల్ తో ఉద్యోగంలోకి తీసుకున్నారు. అలాగే 486 మంది పీఈటీలను సైతం ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. దీంతో తెలంగాణలోని నిరుద్యోగులు తమను కూడా ఉద్యోగంలోకి తీసుకోవాలని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
గత నెలలోనే సీఎం రేవంత్ ఇంటి దగ్గర ఆందోళన
గత నెల ఫిబ్రవరి 19 న 2008 డీఎస్సీ అభ్యర్థులు సీఎం రేవంత్ నివాసం దగ్గర ఆందోళన చేపట్టారు. తమకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.. 2013లోనే సుప్రీంకోర్టు బీఎడ్ అభ్యర్థులకు అనుగుణంగా తీర్పునిచ్చిందని, తరువాత హైకోర్టు కూడా ఇదే విషయాన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు.
దీంతో సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజు అభ్యర్థుల నుంచి పూర్తి వివరాలు తీసుకున్నారు. 2010లోనే డీఎస్సీ అభ్యర్థులు ఆమరణ దీక్ష చేస్తే.. రేవంత్ రెడ్డి తమకు అప్పట్లోనే మద్ధతు ప్రకటించారనే విషయాన్ని వారు గుర్తుచేశారు. అయితే రోజులు గడుస్తున్న కొద్ది ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఈ రోజు ప్రజాభవన్ లో 2008 డీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు.
తెలంగాణ వచ్చాక అయిన తమకు న్యాయం జరుగుతుందో అని ఆశగా ఎదురు చూశామని, తమను బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసిందని వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని, తమకు ఉద్యోగాలు ఇచ్చామనే ప్రకటన వచ్చాకే ప్రజా భవన్ నుంచి బయటకు వెళ్తామని లేదంతా ఇక్కడే కూర్చుంటామని ప్రకటించారు.


Read More
Next Story