ఏ ధైర్యంతో పథకాలన్నీ ఎగ్గొడుతున్నారు?
x

ఏ ధైర్యంతో పథకాలన్నీ ఎగ్గొడుతున్నారు?

అధికార పార్టీ మదిలో ఏం ఉంది.. సంక్షేమం తగ్గించడానికి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు?


రైతుబంధు ను భరోసాగా మార్చి 15 వేల నుంచి 12 వేలకు తగ్గించారు. అది కూడా రైతులకు ఇంకా అందడం లేదు. తులం బంగారం ఊసే లేదు. ప్రస్తుతం బంగారం పెడుతున్న పరుగును చూస్తే.. దాన్ని అందుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యం కాదు. అంటే అది కూడా హుష్ కాకే.

మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు రాలేదు. నిరుద్యోగ భృతి పై మొదట్లోనే రాంరాం చెప్పేశారు. ఫించన్ రూ. నాలుగు వేలకు పెరగలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హమీ ఇచ్చిన చాలా వాటి జోలికి పోతుందన్న గ్యారెంటీ కనిపించడం లేదు.

అంతకుముందు అధికారంలో ఉన్న కేసీఆర్ చాలా వాటిని అమలు చేశారు. ముఖ్యంగా ప్రజలకు తన పేరు గుర్తు చేసుకునే విధంగానే కొన్ని పథకాలను అమలు చేశారు.
వాటిలో తను చెప్పినట్లుగా ఫించన్ పెంచడం, రైతుబంధు, మిషన్ భగీరథ నీళ్లు, రైతులకు గుంట భూమి ఉన్న ఇన్సురెన్స్ పథకం, ఒక్క గోదావరి నది పై నిర్మించిన మూడు బ్యారెజ్ ల విషయంలో తప్ప దాదాపుగా చాలా పథకాలను దిగ్విజయంగా అమలు చేశారు.
అయితే అన్ని పథకాలను విజయవంతంగా అమలు చేసిన తరువాత కూడా కేసీఆర్ ఓడిపోయారు. కాంగ్రెస్ కూడా ఎన్నికల ప్రచారంలో ఇంతకుమించి అన్నట్లు ‘ఆరు గ్యారెంటీ’ల పేరుతో దాదాపు 40 కి పైగా పథకాలను ప్రకటించింది. అయితే గద్దెనెక్కాక అందులో చాలా వాటిని అమలు చేయడం లేదు. అసలు రేవంత్ సర్కార్ ఏ ధైర్యంతో వాటిని ఎగ్గొడుతోంది. దాని భవిష్యత్ ప్రణాళిక ఏంటీ.. ఓ సారి పరిశీలిద్దాం.
జగన్ మోహన్ రెడ్డి ఓటమి నేర్పిన పాఠమా?
తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి సర్కార్ ను జగన్ మోహన్ రెడ్డి ఓటమి చాలా ప్రభావితం చేసి ఉండొచ్చని అనిపిస్తోంది. ఆంధ్రలో అధికారంలో ఉన్న వైసీసీ సర్కార్ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లు నవరత్నాల పేరిట చాలా పథకాలను అమలు చేసింది.
అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అనూహ్యాంగా ఓడిపోయారు. కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యారు. వైసీపీ సర్కార్ ఓటమికి ప్రధాన కారణం.. సంక్షేమానికి ఎక్కువగా అప్పులు తీసుకొస్తున్నారని, దాదాపు రూ. 14 లక్షల కోట్ల అప్పులు చేశారని టీడీపీ, దాని ఎల్లో మీడియా చేసిన ప్రచారం ఓ కారణం.
అందుకే అప్పులతో వచ్చే సంక్షేమం మాకు వద్దు అని ప్రజలు నిర్ణయం తీసుకుని ఉంటారని, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నందని చెప్పవచ్చు.
ప్రస్తుతం ఆంధ్రలో అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ కూడా తను సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయబోవడం లేదని ప్రకటించింది. అయితే వీటిపై ప్రజల నుంచి పెద్ద వ్యతిరేకత రావడం లేదు.
ప్రతిపక్ష వైసీపీ దీనిపై గగ్గోలు ప్రారంభించింది కానీ ప్రజల నుంచి అనుకున్నంత స్థాయిలో వ్యతిరేకత లేదు. ఈ విషయం పై అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రానికి సంబంధించిన ఓ రైతు ‘ ఫెడరల్’ తో మాట్లాడారు.
‘‘ మాకు చంద్రబాబు నైజం గురించి తెలుసు, ఇంతకుముందు అధికారంలోకి వచ్చి రైతు రుణమాఫీ ఎగవేశారు, అప్పుడు నానా అగచాట్లు పడ్డాము. అయితే రాష్ట్రం అప్పుల పాలు అవుతుందని భయంతో చంద్రబాబుకు ఓటు వేశా’’ అని చెప్పారు.
అన్ని కాకపోయినా కొన్నయిన అమలు చేయకపోతారా అనే ఆశతోనే తాము ఉన్నామన్నారు. అయితే తెలంగాణలో కూడా ప్రతిపక్ష బీఆర్ఎస్ దీనిపై క్రమంగా ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ ను నిలదీయడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తోంది. దీనిపై ప్రజల్లో ఇప్పుడిప్పుడే చర్చ ప్రారంభం అయింది.
ఎన్నికల ప్రచారంలో..
అయితే ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కేసీఆర్ అమలు చేసిన వాటికంటే ఎక్కువ మొత్తంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వాగ్థానాలు చేసింది. అధికారంలోకి వచ్చిన తొలి నెలలోనే రూ. నాలుగు వేల ఫించన్, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పెళ్లికి తులం బంగారం ఇస్తామనే హమీలు, ఉచిత బస్సు, నెలకు రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అనే అంశాలు పార్టీకి ఓట్లు తెచ్చి పెట్టాయి.
అయితే ఏడాది గడచిన తరువాత కూడా కేవలం రెండు పథకాలు మాత్రమే ఆ పార్టీ నికరంగా అమలు చేయగలిగింది. ఉచిత బస్సు దిగ్విజయంగా అమలు చేస్తున్న.. సరిపడా బస్సులు రావట్లేదని ఫిర్యాదు అందుతోంది. అలాగే కొన్ని పథకాలకు అనవసరపు ఆర్భాటాలు చేస్తున్నారని కూడా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
తీసుకున్న వాటికే మళ్లీ దరఖాస్తులు తీసుకోవడంపై ప్రశ్నలు మొదలవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం నుంచి వస్తున్న సమాధానాలు ప్రజలను సంతృప్తిపరిచే విధంగా లేవు.
ప్రస్తుతం అందరి చేతిలో స్మార్ట్ ఫోన్ లు ఉన్నాయి. ప్రభుత్వం ఏం చెప్తుంది.. ఎం మాట్లాడుతుందో.. చెప్పిన వాటిని ఎలా అమలు చేస్తున్నారని పరిశీలన చేస్తున్నారు. వీరికి తోడు పార్టీల సోషల్ మీడియా విభాగాలు పాత వీడియోలు తవ్వి తీసి ప్రజలకు అందుబాటులో ఉండేలా చేస్తున్నారు.
దాంతో ఎవరిపాలన ఎలా ఉందనే విషయంలో ప్రజలు బేరీజు వేసుకునే అవకాశం చిక్కింది. కాబట్టి ఎన్నికల సమాయానికి ప్రజలు నిలదీస్తే అనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఓ ప్లాన్ ఆలోచించినట్లు కనిపిస్తుంది.
అంతా మిత్తిలకే పోతోంది..
బీఆర్ఎస్ ఓ సందర్బంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీసింది. ‘‘ తాము అప్పులు చేశామని కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బద్నాం చేసింది. ఇప్పుడు ఆ పార్టీ వేల కోట్లు అప్పులు చేస్తోందని ప్రశ్నించింది.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ.. మీరు చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికే అంతా సరిపోతోంది’’ అన్నారు. మరోక సందర్భంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అప్పులు చేయకపోయి ఉంటే అద్భుతాలు చేసే వాడినని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ గేమ్ ప్లాన్ స్పష్టమవుతోంది.
ఎన్నికల ఏడాది మాత్రమే ప్రకటించిన అన్ని పథకాలను అమలు చేసి.. ఇన్నాళ్లుగా తాము బీఆర్ఎస్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టామని, అందుకే పథకాలు అమలులో ఆలస్యం అయిందనే ప్రచారం చేస్తుందని రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నా.. కే. రమేష్ అనే ఓ పార్టీ నాయకుడు అభిప్రాయపడ్డారు.
‘‘ సింపుల్ ఇన్ని పథకాలు ఎవరూ అమలు చేయలేరు. చివరి ఆరు నెలల ముందు చెప్పినవన్నీ అమలు చేసే ప్రయత్నం చేస్తారు. ఇలాగే వందల కొద్ది అప్లికేషన్లు తీసుకుంటారు. కొన్ని ఇస్తారు.. వాటినే ప్రచారం చేసుకుంటారు. ఖజానా మొత్తం ఖాళీ చేస్తారు.’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
అయితే ఉచితాలు వద్దనే ప్రచారం సైతం యువత బాగానే ప్రచారం చేస్తోంది. దీనికి అనేక ఉదాహారణలు తీసుకుని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఉచితాలు తీసుకుంటే ఆర్థిక వ్యవస్థలు ఎలా దివాలా తీస్తున్నాయో చాలా దేశాల ఉదాహారణాలు చెబుతున్నారు.
సంక్షేమ పథకాల మీద ఖర్చు చేయకుండా సంపద సృష్టి ఉపాధి కల్పన కల్పించామని ప్రజల ముందుకు వెళ్లినా కాంగ్రెస్ పార్టీకి తిరిగి ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉంటుంది. లేదంటే తిరిగి ప్రతిపక్ష పాత్రకే పరిమితం కావాల్సి ఉంటుంది. సంక్షేమం ఎంత చేసినా ఎంతోకొంత మిగిలే ఉంటుంది.
అది కాక భవిష్యత్ లో రాష్ట్రానికి ఆదాయం వచ్చే వనరులపై ఈ నిధులు ఖర్చు చేశామని లెక్కలు చూపిస్తే.. రాష్ట్రంలో ఉన్న యువ జనాభా మిగిలిన పని చూసుకుంటుందనే భరోసా సైతం దాని మదిలో మెదులుతూ ఉండవచ్చు.
Read More
Next Story