మానుకోటలో ఇంతమంది పోలీసులు ఏం చేస్తున్నారు ?
x
Police parade in Manukota of Mahabubabad Dt

మానుకోటలో ఇంతమంది పోలీసులు ఏం చేస్తున్నారు ?

ఒక్కసారిగా గురువారం ఉదయం నుండి వందలాదిమంది పోలీసులు కవాతు(ప్యరేడ్) చేస్తుండటంతో జనాల్లో భయంతో టెన్షన్ పెరిగిపోతోంది.


మహబూబాబాద్ జిల్లా మానుకోటలో వందలమంది పోలీసులు కవాతు చేస్తున్నారు. ఒక్కసారిగా గురువారం ఉదయం నుండి వందలాదిమంది పోలీసులు కవాతు(ప్యరేడ్) చేస్తుండటంతో జనాల్లో భయంతో టెన్షన్ పెరిగిపోతోంది. అసలు మానుకోట(Manukota) రోడ్లపైన ఇన్నివందలమంది పోలీసులు కవాతు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందో ఎవరికీ అర్ధంకావటంలేదు. అలాగే జిల్లా కేంద్రం మహబూబాబాద్(Mahabubabad) లో 163 సెక్షన్(144) విధించారు. జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ ఆధ్వర్యంలో వందలాదిమంది పోలీసులు రోడ్లపైన కవాతు చేస్తున్నారు.

సెక్షన్ 144 విధించారు కాబట్టి జనాలెవరు ఎక్కువమంది గుమిగూడవద్దని, అసలు రోడ్లపైకే రావద్దని పోలీసులు మైకుల్లో పదేపదే చెబుతున్నారు. యుద్ధాలు జరిగే ప్రాంతాల్లో జనాలకు మనోధైర్యం కల్పించేందుకు సైన్యం ఈ విధంగా కవాతు చేస్తుంది. కాని ఇక్కడ యుద్ధం లాంటిది ఏమీ జరగటంలేదు. అయినా ఇన్నివందలమంది పోలీసులు రోడ్లపైకి ఒక్కసారిగా ఎందుకు వచ్చారో ఎవరికీ అర్ధంకావటంలేదు. లగచర్లలో గిరిజనులపైన పోలీసులు చేసిన ధౌర్జన్యాలు, జరిపిన అరాచకాలకు నిరసనగా బీఆర్ఎస్(BRS) ఆందోళన చేయాలని డిసైడ్ చేసింది. ముందుగా పోలీసులకు విషయం చెబితే సరే అని చెప్పి తర్వాత అనుమతిని రద్దుచేశారు.

ప్రశాంతంగా ఆందోళనచేయటానికి కూడా తమకు పోలీసులు అవకాశం ఇవ్వనందుకు నిరసనగా బుధవారం రాత్రి బీఆర్ఎస్ నేతలు, క్యాడర్ పెద్దఎత్తున ఆందోళన చేశారు. రాత్రే ఆ విషయం అయిపోయింది. మరి తెల్లారేసరికి మానుకోటలో వందలమంది పోలీసులు రోడ్లపైన ఎందుకు ప్రత్యక్షమయ్యారో అర్ధంకావటంలేదు. ఇదే విషయమై బీఆర్ఎస్ నేతలు రేవంత్ రెడ్డి(Revanth reddy)ని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్(KCR) అనే మొక్కను తెలంగాణాలో పెరగనివ్వనని వరంగల్(Warangal) లో ప్రతిజ్ఞచేసిన రేవంత్ ప్రశాంతంగా ఆందోళన చేయటానికి కూడా అనుమతి ఇవ్వటానికి భయపడుతున్నాడని ఎద్దేవా చేస్తున్నారు. ఆందోళనకు అనుమతి ఇవ్వటానికే భయపడిన రేవంత్ ఇక కేసీఆర్, కేటీఆర్ ను ఏమి చేగయలడని నిలదీస్తున్నారు.

బీఆర్ఎస్ నేతలు అన్నారని కాదుకాని రేవంత్ ప్రభుత్వం మరీ విచిత్రంగా వ్యవహరిస్తోంది. లగచర్లలో కలెక్టర్ మీద దాడి జరిగితే 20వ తేదీవరకు గ్రామంలోకే కాదు చివరకు కొడంగల్ నియోజకవర్గంలోకి కూడా ప్రతిపక్షాలను, ప్రజాసంఘాలను అనుమతించలేదు. ఇపుడేమో మానుకోటలో వందలాదిమంది పోలీసులతో కవాతు చేయిస్తోంది. పోలీసుల దెబ్బకు జనాలు ఇళ్ళల్లో నుండి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. అవసరాలన్నింటినీ మానుకుని జనాలు ఇళ్ళల్లోనే కూర్చున్నారు. రోడ్లమీదకు వస్తే ఏమి జరుగుతుందో అన్న భయం వెంటాడుతోంది. అన్నీ మూసుకుని ఇళ్ళల్లో ఎన్నిరోజులు కూర్చోవాలో జనాలకు తెలీటంలేదు. అయినా పోలీసులను ముందుపెట్టుకుని రేవంత్ ఏమి సాధిద్దామని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.

Read More
Next Story