
సర్పంచ్‌గా పోటీ చేయడానికి ఎవరు అర్హులు..?
ఐదు దశల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికలను మొత్తం ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం కమిషనర్ రాణీకుముదిని వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలని అనుకునే వారు చాలా మంది.. అర్హతలు తెలియక ఆగిపోతుంటారు. మరి ఇంతకీ సర్పంచ్‌గా పోటీ చేయాలంటే ఎటువంటి అర్హతలు ఉండాలి. ఎవరు ఈ పోటీకి అనర్హులో తెలుసుకుందాం.
వీరంతా అనర్హులే..
1. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, గ్రామ సేవకులు ఈ పోటీకి అనర్హులు.
2. ఏదైనా నేరానికి పాల్పడి శిక్ష పడిన వారూ పోటీలో పోటీ చేయడానికి వీల్లేదు.
3. చట్టం ద్వారా ఏర్పడిన ఏ సంస్థలో ఉద్యోగం చేస్తున్నా వారు కూడా అనర్హులే.
4. నేర శిక్ష అనుభవించి ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకోని వారు కూడా సర్పంచ్ పోటీకి అనర్హులే.
5. బదిరులు, మూగవారు, మతిస్థిమితం లేని వారు కూడా అనర్హులే.
6. దివాళాదారుగా న్యాయ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న వారూ అనర్హులు.
7. రుణ విమోచన పొందని దివాళాదారు కూడా పోటీకి అనర్హులు.
8. పౌరహక్కుల పరిరక్షణచట్టం- 1955 పరిధిలోకి వచ్చే కేసుల్లో శిక్ష పడినవారు.
9. గ్రామ పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా పనికి కాంట్రాక్టు చేసుకున్నా లేదా నిర్వహణకు ఒప్పందం చేసుకున్న వారు అనర్హులు.
10. ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారు కూడా దీనికి అనర్హులే.
11. ఏదైనా అవినీతికి కానీ విశ్వాస ఘాతుకానికి గానీ పాల్పడి ఉద్యోగం నుంచి తొలగించబడితే ఆ రోజు నుంచి ఐదేళ్లు పూర్తయ్యేంతవరకు సర్పంచ్ పోటీకి అనర్హులు.
12. గ్రామ పంచాయతీ కి వ్యక్తిగతంగా బకాయిపడిన వారు. బకాయిల చెల్లింపులకు నోటీసులు ఇచ్చినా చెల్లించిన వారు పోటీకి అనర్హులు.
అర్హులు వీరే..
1. సర్పంచ్ పోటీలో నిలబడాలని భావించే వ్యక్తం కచ్ఛితంగా గ్రామపంచాయతీ స్థానికులై ఉండాలి.
2. పోటీ చేయాలని అనుకునే వారు గ్రామపంచాయతీ ఓటింగ్ లిస్ట్‌లో ఉండాలి.
3. నామినేషన్ వేసే సమయానికి అభ్యర్థి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి.
4. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి అవకాశం ఉంది.
5. మహిళలకు రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయొచ్చు.