Union Budget | కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ ప్రాజెక్టులకు నిధులేవి ?
తెలంగాణలో పెండింగులో ఉన్న ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ లో ఒక్క పైసా కూడా విదల్చలేదని ఆర్థిక రంగ విశ్లేషకులు పాపారావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లు విమర్శించారు.
పార్లమెంటులో శనివారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీరని అన్యాయం చేశారని తెలంగాణ ఆర్థిక రంగ విశ్లేషకులు డి పాపారావు ఆరోపించారు. కేంద్ర బడ్జెట్ విడుదలైన నేపథ్యంలో పాపారావు ‘ఫెడరల్ తెలంగాణ’తో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్ నిధులు బీజేపీ పాలిత రాష్ట్రాలకు మళ్లిపోయాయని ఆయన ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్, ఢిల్లీ రాష్ట్రాలకు కేంద్ర బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించారని చెప్పారు.
పెండింగ్ ప్రాజెక్టులకు నిధులేవి ?
తెలంగాణ రాష్ట్రంలో ఏళ్ల తరబడిగా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల ఊసే కేంద్ర బడ్జెట్ లో లేదని డి పాపారావు ఆరోపించారు. పాలమూరు రంగారెడ్డి నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, కేంద్ర నిధులు విడుదల చేయాలని ప్రతిపాదించినా కేంద్రం బడ్జెట్ లో దీని ప్రస్థావనే లేదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు ఇచ్చిన కేంద్రం తెలంగాణ ప్రాజెక్టులను విస్మరించిందని చెప్పారు. తెలంగాణ లోని గిరిజన విశ్వవిద్యాలయానికి కావాల్సిన నిధులను బడ్జెట్ లో కేటాయించలేదని ఆయన చెప్పారు. తెలంగాణలో రైల్వే లైన్లకు నిధులు ఇవ్వలేదని , తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపిస్తుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర నీటి వాటా విషయంలో కేంద్రం తేల్చడం లేదని, పలు పథకాలకు నిధులు కావాలని అడిగినా కేటాయింపులు లేవని పాపారావు విమర్శించారు. బయ్యారంలో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలనే ప్రతిపాదనను కేంద్రం నాణ్యత గల ఐరన్ ఓర్ లేదనే సాకుతో వదిలేసిందన్నారు.
తెలంగాణను విస్మరించారు : మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ను మరోసారి విస్మరించారని మాజీ ఎంపీ బి.వినోద్ కుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం ),ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలను కేటయించాలని ఎప్పడినుంచో అడుగుతున్నా ..ఈ బడ్జెట్ లో కూడా కేటాయించలేదని వినోద్ కుమార్ చెప్పారు.‘‘ జిల్లాకో నవోదయ విద్యాలయం కేటయించాలన్న మా వినతిని పెడచెవిన బెట్టారు.అన్ని రాష్ట్రాల్లో సైనిక్ స్కూల్స్ ఉన్నాయి .తెలంగాణ ఈ బడ్జెట్ లో కూడా సైనిక్ స్కూల్ కు నోచుకోలేదు ’’అని వినోద్ కుమార్ చెప్పారు.
16 మంది ఎంపీలున్నా దక్కని నిధులు
తెలంగాణలో బీజేపీ నుంచి 8 మంది ,కాంగ్రెస్ నుంచి 8 మంది ఎంపీ లున్నా రాష్ట్రానికి దక్కింది ఏమీ లేదన్నారు. ప్రాంతీయ పార్టీల నుంచి ఎంపీ లు ఉంటేనే రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందనే వాస్తవాన్ని తెలంగాణ గ్రహించాలని కోరారు.బడ్జెట్ లో తెలంగాణ కు జరిగిన అన్యాయం పై కాంగ్రెస్ బిజెపి ఎంపీ లు లోక్ సభ లో గళమెత్తాలన్నారు. రాజ్యసభ లో మా సభ్యులు తెలంగాణ కు దక్కాల్సిన ప్రయోజనాలపై ఉద్యమిస్తామని వినోద్ కుమార్ చెప్పారు. ‘‘మధ్యతరగతి ప్రజలకు ఇన్ కం టాక్స్ లో ఊరట నివ్వడాన్ని ఆహ్వానిస్తున్నాం. వ్యవసాయానికి గతం తో పోలిస్తే కొంత తోడ్పాటు లభించింది. అయినా ఇది సరిపోదు’’అన్నారు. పదేళ్లుగా మోడీ పేద ,మధ్యతరగతి ప్రజలను నిర్లక్ష్యం చేశారని, దేశం లో నిరుద్యోగం పెరిగిందని, కొంత మంది దగ్గరే సంపద కేంద్రీకృతమైన ధోరణి పెరుగుతోందని వినోద్ కుమార్ వివరించారు.
కేంద్ర బడ్జెట్ పై బీఆర్ఎస్ మాజీ ఎంపీ బి. వినోద్ కుమార్ స్పందన.
— B Vinod Kumar (@vinodboianpalli) February 1, 2025
నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో తెలంగాణ ను మరోసారి విస్మరించారు.
రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం ),ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థలను కేటయించాలని… pic.twitter.com/8ubMCLB1CJ
Next Story