ఇండోనేషియా వీవర్స్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ లో కసరత్తు
x

ఇండోనేషియా వీవర్స్ కాన్ఫరెన్స్ కు హైదరాబాద్ లో కసరత్తు

ఇండోనేషియా బాలిలోని చేనేతకు, తెలంగాణ చేనేతకు ఉన్న పోగు బంధం ఏమిటి? దీని అన్వేషణ కోసం బాలిలో ప్రపంచ చేనేత దినోత్సవం. వివరాలు..


ఫిబ్రవరి 18, 2024 బాలి,ఇండోనేషియా లో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ పై అవగాహన సమావేశం శనివారం నాడు హైదరా బాద్ లో జరిగింది. జాతీయ చేనేత దినోత్సవ రూపకర్త, వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ నిర్వాహకులు యర్రమాద వెంకన్న నేత అధ్యక్షతన కోకాపేటలోని హేమంత్ సిరి స్టూడియో జరిగిన ఈ సమావేశానికి చేనేత రంగం అభివృద్ధికి కృషి చేస్తున్న పలువురు ప్రముఖులు హాజరయ్యారు.


ఈ సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ చేనేత దినోత్సవ నేపథ్యం, సాధించిన విజయం, ఆ ప్రేరణతో ప్రపంచ చేనేత దినోత్సవానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అందులో భాగంగా బాలిలో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ గురించి వివరించారు. మిషన్ వరల్డ్ హ్యాండ్లూమ్ డే కి మద్దతును తెలుపుతూ, ఈ కాన్సెప్ట్ ను విస్తృతపరిచి, బాలి కాన్ఫరెన్స్ విజయవంతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.


ఈ సమావేశంలో టెక్స్టైల్ నేషనల్ అడ్వైజర్ హెచ్.కె.చారి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశం ప్రవేశపెట్టే ప్రతిపాదనలపై కొంత వివరణ ఇచ్చారు. జియోగ్రాఫికల్ ఇండెక్స్ ( జిఐ) రిజిస్ట్రేషన్ సందర్భంగా ఐక్యరాజ్య సమితి లో ప్యానల్ సభ్యునిగా తాను స్విజర్లాండ్ లో జరిగిన సమావేశానికి హాజరయ్యానని, యు.ఎన్.ఓ లో ప్రతిపాదనలు ఎలా జరుగుతాయో, ఓటింగ్ సమయంలో సభ్య దేశాలు ఏ విధంగా ప్రవర్తిస్తాయో స్వయంగా తాను చూశానని, అందుకు అనుగుణంగా మన ప్రణాళిక ఉండాలని తన అనుభవాలను తెలిపారు.





కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తూ సిల్క్ మార్క్ కోసం విశేషంగా కృషిచేసిన యర్రా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇలాంటి సన్నాహక సమావేశాలు జరపాలని, అందుకు తాను సహకరిస్తానని తెలిపారు. ఆహింస సిల్క్ ఇన్వెంటర్, పేటెంట్ హోల్డర్ కుసుమ రాజయ్య మాట్లాడుతూ ఇటీవల తాను ఈజిప్ట్ మరియు వియత్నం దేశాలలో పర్యటించినప్పుడు బాలిలో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ గురించి అక్కడి వారికి వివరించానని, ఆయా దేశాల నుండేకాక ఇతర దేశాల నుండి తనకున్న పరిచయాలతో ఆహ్వానాలను పంపుతానని చెప్పారు.

ప్రముఖ రచయిత, చేనేత దినోత్సవ నేపథ్యంలో వచ్చిన స్వదేశీయం సంగీత నృత్యరూపక రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ మాట్లాడుతూ ప్రచారానికి తీసుకోవలసినటువంటి అంశాలను వివరించారు. హేమంత్ సిరి లేబుల్ వ్యవస్థాపకురాలు శిరీష మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాన్సెప్ట్ ని ముందుకు తీసుకెళ్లాలని, బాలి కాన్ఫరెన్స్ ని విజయవంతం చేయడానికి అందరం కలిసికట్టుగా కృషి చేయాలని, అందుకు తన పరిధిలో ప్రయత్నాలు చేస్తానని చెప్పారు.




లేబుల్ రామ వ్యవస్థాపకురాలు మవూరి రాజేశ్వరి మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో చేనేత దినోత్సవ కాన్సెప్ట్ చాలా అద్భుతమని, తనకు బంగ్లాదేశ్ లో చేనేత వారితో పరిచయాలు ఉన్నాయని, అక్కడి వారికి ఆహ్వానం పంపడంలో సహకరిస్తానని తెలిపారు. టెక్స్టైల్ డిజైనర్లు లావణ్య సిస్టాల మరియు రత్న మాట్లాడుతూ సమిష్టి కృషితో కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలిపారు.

వీవర్స్ ఆఫ్ ఇండియా డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు గంజి రాఘవేంద్ర మాట్లాడుతూ వరల్డ్ హ్యాండ్లూమ్ డే కాన్సెప్ట్ ప్రాచుర్యానికి తన వంతు పాత్ర పోషిస్తానని తెలిపారు. బాలి కాన్ఫరెన్స్ తప్పక విజయం సాధిస్తుందని ఆశాభావాన్ని జెల్ల నరేందర్ వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి


ఇండోనేషియాలోని బాలిలో ప్రపంచ చేనేత దినోత్సవం




Read More
Next Story