Revanth Reddy
x

‘పాలమూరుకు కేసీఆర్ ఏం చేశారు..?’

బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయలేదు?


కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో తెలంగాణ ప్రాంతానికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే పోరాడి ప్రత్యేక రాష్ట్రం సాధించామని, కానీ కేసీఆర్ సీఎం అయిన తర్వాత తెలంగాణ ప్రాజెక్ట్‌లకు ఇంకా ఎక్కువ నష్టం జరిగిందని రేవంత్ అభిప్రాయపడ్డారు. కేసీఆర్‌ను పాలమూరు ప్రజలు అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపిస్తే ఆయన వారికి ఏం చేశారు? అని రేవంత్ ప్రశ్నించారు. పాలమూరు ప్రాంతానికి ద్రోహం చేసిన నేత కేసీఆర్ అని విమర్శించారు. అత్యంత వెనకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఆయనను పాలమూరు ప్రజలు ఎంపీగా గెలిపించి పార్లమెంటుకు పంపారని, కానీ సీఎం అయిన తర్వాత ఆయన ఆ ప్రాంతానికి ఏం చేయకుండా మొండి చేయి చూపారని విమర్శలు గుప్పించారు రేవంత్.

‘‘బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పూర్తిచేయలేదు? కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్‌, జూరాల ప్రాజెక్టుల పరిస్థితి ఏమైంది? ఒక్క కాళేశ్వరం కోసం రూ.లక్ష కోట్లు ఖర్చు చేశారు. 2019లో కడితే.. 2023లో అది కూలింది. చిన్నగుడిసె వేసుకునేవాడు అయినా పదేళ్లు ఉండేట్టు నిర్మించుకుంటాడు. ఉమ్మడి జిల్లాలోని అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణకు ఎన్ని వందలకోట్లు ఖర్చు అయినా.. ఈ ఏడాది డిసెంబర్ 9లోపు నిర్వాసితులకు నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరిస్తాం. రానున్న రెండేళ్లలో ఆ ప్రాజెక్టులు పూర్తిచేయాలని నిర్ణయించాం’’అని రేవంత్‌రెడ్డి అన్నారు.

‘‘శ్రీశైలం ప్రాజెక్ట్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఎందుకు న్యాయం చేయలేదు? జీవో 98 ద్వారా ఇవ్వాల్సిన పరిహారం ఎందుకు ఇవ్వలేదు? వాల్మీకి, బోయలను ఎస్టీ జాబితాలో చేర్పిస్తామని చెప్పి కేసీఆర్ మాట తప్పారు. అలంపూర్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌ ప్రాంతాల్లో ఉన్న ఈ వర్గాలకు ఎందుకు న్యాయం చేయలేదు. కరీంనగర్‌ నుంచి పారిపోయి పాలమూరు వస్తే అండగా నిలబడ్డాం. పదేళ్ల పాలనలో ఈ ప్రాంతానికి సున్నం పెట్టింది మీరు కాదా? ఇప్పుడు దుఃఖం వస్తోందని కేసీఆర్‌ అంటున్నారు. మాదిగల పిల్లలకు వైద్య విద్య సీట్లు వస్తుంటే దుఃఖం వస్తోందా? పాలమూరు బిడ్డ 20 ఏళ్లు సీఎంగా ఉండాలని ఈ జిల్లా కంకణం కట్టుకున్నందుకు దుఃఖమొచ్చిందా? పాలమూరు వాసులు చేపలు పట్టుకోవాలి.. చెప్పులు కుట్టుకోవాలా? మీ పిల్లలు రాజ్యాలు ఏలాలా? పాలమూరు పచ్చగా మారుతుంటే ఎందుకంత విషం చిమ్ముతున్నావు? ఈ జిల్లా అంటే ఎందుకింత చిన్నచూపు? కేసీఆర్‌కి మద్దతిస్తున్న ఆ పార్టీ జిల్లా నేతలు శ్రీనివాస్‌గౌడ్‌, నిరంజన్‌రెడ్డికి సిగ్గుండాలి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘ప్రజాపాలన చూసి కెసీఆర్ కు దుఃఖం వస్తుందట. పాలమూరు గడ్డ నుంచి రేవంత్ రెడ్డి సీఎం అయిండని నీకు దుఃఖం వస్తుందా. బలహీన వర్గాల పిల్లలు చదువుకునేందుకు 25 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మిస్తున్నందుకు నీకు దుఃఖం వస్తుందా? పాలమూరు బిడ్డ 20 ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కంకణం కట్టుకుని పనిచేస్తున్నందుకా నీకు దుఃఖం. నలభై ఏళ్లుగా మాదిగ బిడ్డలు వర్గీకరణ కోసం పోరాడుతుంటే… మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకా నీకు దుఃఖం. నీ కొడుకు, నీ మనుమడిలాగే మాదిగ బిడ్డలు చదువుకుంటున్నందుకా నీకు కళ్లల్లో నీళ్లు వచ్చినయ్. పదేళ్లు సీఎం గాఉండి పాలమూరు ప్రాజక్టులను కెసిఆర్ పడావు పెట్టారు’’ అని విమర్శించారు.

‘‘పాలమూరు రంగారెడ్డి ని పదేళ్లలో ఎందుకు పూర్తి చేయలేదు. కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు ఎందుకుపూర్తి చేయలేదు. లక్ష కోట్లు పెట్టి ఆయన కట్టిన కాళేశ్వరం మూడేళ్లల్లో కూలేశ్వరం అయింది. పదేళ్లు నువ్వు పడావు పెట్టిన ప్రాజెక్టులను రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికలు వేసుకుని ముందుకు వెళుతున్నాం. ఎందుకంత కడుపులో విషం పెట్టుకుని మాపై విషం చిమ్ముతున్నావ్. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అభినందించాల్సింది పోయి… శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోస్తున్నారు. ఎవరికి ఏదీ జరగలేదు అని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదన్నారు.. కానీ రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్నాం’’ అని గుర్తు చేశారు.

‘‘ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్.. తెచ్చింది కాంగ్రెస్ .. కొనసాగిస్తున్నది కాంగ్రెస్. వరికి బోనస్ ఇచ్చి ప్రతీ గింజ కొంటున్నాం. మొదటి ఏడాదిలోనే రూ. 21 వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేసిన ఘనత మాది. 9 రోజుల్లో 9 వేలకోట్లు రైతులకు రైతు భరోసా ఇచ్చింది మేం కాదా? రైతుల సమస్యలు పరిష్కరించడానికి ప్రజల్లోకి వెళ్లి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే కడుపు మంటతో వాళ్లకు దుఃఖం వస్తుంది. కేసీఆర్ దుఃఖానికి కారణం రైతుల సంతోషమే తప్ప ఇంకోటి కాదు.. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు అనే ఆలోచన కేసీఆర్‌ది. ఆడబిడ్డలను ప్రోత్సహించి కోటీశ్వరులను చేయాలన్న ప్రయత్నం మాది. స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి రుణాలు అందిస్తున్నాం’’ అని తెలిపారు.

‘‘అమ్మ ఆదర్శ పాఠశాలల ద్వారా ఆడబిడ్డలకే పాఠశాల నిర్వహణ బాధ్యత అప్పగించాం. ప్రభుత్వ కార్యాలయాల్లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ఏర్పాటు చేసి ఆడబిడ్డల్ని వ్యాపారాల్లో ప్రోత్సహిస్తున్నది నిజం కాదా? సోలార్ ప్లాంట్ ఏర్పాటు, పెట్రోల్ బ్యాంకుల ఏర్పాటుకు ప్రోత్సహించి అంబానీ అదానీతో పోటీ పడేలా ఆడబిడ్డలకు అప్పగించాం. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఈ 18 నెలలల్లో 6500 కోట్లు ఖర్చు చేశాం. ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు పూర్తి చేశాం. రెండున్నర సంవత్సరాలు పూర్తయ్యేలోగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేసే బాధ్యత మాది. ఏడాదిన్నరలోగా ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం పూర్తి చేస్తాం’’ అని హామీ ఇచ్చారు.

‘‘మళ్లీ ఇక్కడికి వచ్చి స్కూల్ ను ప్రారంభిస్తా. కెసీఆర్ నీ గుండెలపై రాసి పెట్టుకో. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడు. పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడు. మా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు అడ్డుపడొద్దని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కోరుతున్నా. మీరు బాధ్యతగా ఉండండి.. మమ్మల్ని బ్రతకనివ్వండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును రద్దు చేసి ఉదారంగా వ్యవహరించండి. మీరు సహకరించకపోతే విజ్ఞప్తులు చేస్తాం. మా విజ్ఞప్తులను వినకపోతే పోరాటం ఎలా చేయాలో పాలమూరు బిడ్డలకు తెలుసు. అక్కడ సూర్యుడు ఇక్కడ మొలిచినా పాలమూరును అభివృద్ధి చేసితీరుతాం’’ అని ధీమా వ్యక్తం చేశారు.

Read More
Next Story