ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందంటే...
x
ఎస్ఎల్‌బీసీ టన్నెల్ లోపల సహాయ పనులు (ఫొటో : ఇండియన్ ఆర్మీ సౌజన్యంతో)

ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో మినిట్ టు మినిట్ ఏం జరుగుతుందంటే...

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ఫిబ్రవరి 22వతేదీ కూలింది.టన్నెల్ కూలిపోయి పది రోజులు గడచినా,నిపుణులు సహాయ పనులు చేస్తున్నా,మృతదేహాలు ఇంకా వెలుగుచూడలేదు.


అది హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలోని దోమల పెంట గ్రామ శివార్లలోని నల్లమల అడవుల్లో చుట్టూ కొండల మధ్య తవ్వుతున్న ఎస్ఎల్ బీసీ టన్నెల్...ఈ టన్నెల్ కూలిపోయిన ఘటనతో ఎస్ఎల్ బీసీ జాతీయ వార్తల్లోకి ఎక్కింది. టన్నెల్ కూలిపోయి పది రోజులు గడచినా లోపల కూరుకుపోయిన 8 మంది జాడ ఇంకా లభించలేదు. ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, రైల్వే, బీఆర్ఎఫ్, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐతో పాటు 11 విభాగాల నిపుణులు రాత్రీ పగలూ టన్నెల్ లోపల సహాయ పనులు చేస్తున్నా మృతదేహాలను వెలికితీయలేక పోయారు. టన్నెల్ ప్రమాదంలో 8మంది మరణించి ఉంటారని అధికారులు ప్రకటించారు. కానీ వారి మృతదేహాలను వెలికితీయడానికి సహాయ బృందాలు రోజూ మూడు షిప్టుల్లో శ్రమిస్తున్నారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద నుంచి పదిరోజులుగా సాగుతున్న సహాయ పనుల గురించి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి అందిస్తున్న సమగ్ర కథనం.


టన్నెల్ కూలింది...
22.02.2025 : నిత్య కరవు పీడిత ప్రాంతమైన నల్గొండ జిల్లాకు సాగు, తాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ నిర్మాణంలో ఫిబ్రవరి 22వతేదీన ఉదయం 8.00గంటలకు ఘోర ప్రమాదం జరిగింది.టన్నెల్ బోరింగ్ మెషీన్ తో 50 మంది కార్మికులు 14 కిలోమీటర్ల టన్నెల్ లోపల పనిచేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది. టీబీఎం మెషీన్ దెబ్బతినడంతో పాటు పై కప్పు కూలిపోయి ఇద్దరు ఇంజినీర్లు, ఆరుగురు కార్మికులతో కలిసి మొత్తం 8 మంది ఆచూకీ లేకుండా పోయారు.ఎస్ఎల్ బీసీ టన్నెల్ కూలినపుడు లోపల 50 మంది కార్మికులుండగా నీళ్లు, మట్టి కూలుతుండటం చూసి 42 మంది పరుగులు తీసి సొరంగం నుంచి బయటపడ్డారు. 8 మంది కార్మికులు టన్నెల్ లోపల చిక్కుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ వద్ద జరిగిన ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.టన్నెల్‌ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్,ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, ఇరిగేషన్ విభాగం అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు.ముఖ్యమంత్రి ఆదేశాలతో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇరిగేషన్ సలహాదారు ఆదిత్య నాథ్ దాస్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి బయలుదేరి వచ్చారు.

టన్నెల్ ఎలా కూలిందంటే...
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ స్కీంలో భాగంగా శ్రీశైలం నుంచి దేవరకొండ వైపు వెళ్లే టన్నెల్ 14 కిలోమీటర్ ఇన్లేట్ వద్ద (దోమలపెంట దగ్గర) సి పేజ్ ను పూడ్చివేసిన కాంక్రీట్ సెగ్మెంట్ స్లిప్ అవడంవల్ల ప్రమాదం జరిగిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.టన్నెల్‌ వద్ద పైకప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు.

హుటాహుటిన టన్నెల్ వద్దకు వచ్చిన మంత్రి
నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాద స్థలికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే వచ్చారు. దోమలపెంట లోని జె.పి గెస్ట్ హౌస్ లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.క్షతగాత్రుల వివరాలు ,వారి ఆరోగ్య పరిస్థితిలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సహాయక చర్యలు ముమ్మరం
టన్నెల్ లోపల 8 మంది చిక్కుకున్నారన్న సమాచారంతో సహాయక చర్యలను ముమ్మరం చేయాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.మంత్రుల ఆదేశానుసారం సహాయక చర్యలను అధికారులు వేగవంతం చేశారు.ప్రమాదం జరిగిన టన్నెల్ వద్ద వైద్య ఆరోగ్య సిబ్బంది ఆక్సిజన్ ను అందుబాటులో ఉంచారు. ప్రమాద స్థలంలో సహాయ పనులు చేపట్టేందుకు అగ్నిమాపక సిబ్బంది, రిస్క్యూ టీం లు రంగంలోకి దిగాయి.

సహాయ కార్యక్రమాలపై సీఎం సమీక్ష
సంఘటనా స్థలిలో ఉంటూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి,జూపల్లి కృష్ణారావు,కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు పర్యవేక్షించారు.నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంఘటన స్థలానికి ఎస్డీఆర్ఎఫ్,ఎన్ఆర్డీఎఫ్ బృందాలు
ఎస్డీఆర్ఎఫ్,ఎన్ఆర్డీఎఫ్ బృందాలు టన్నెల్ ప్రమాద స్థలికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. సంఘటనా స్థలిని పరిశీలించడంతో పాటు లోపల చిక్కుకున్న వారిని కాపాడడం కోసం అవసరమైన చర్యలు తీసుకునేందుకు గాను దోమలపెంటలోని జేపీ గెస్ట్ హౌస్ లో సహచర మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి తెలంగాణ అగ్నిమాపక,రిస్క్యూ టీం డి.జి నారాయణ రావు,ఐ.జి సత్యనారాయణ, నాగర్ కర్నూల్ కలెక్టర్ తో పాటు రాబిన్ సంస్థ కు చెందిన లెన్ మైనార్డ్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.

సింగరేణి, ఆర్మీ బృందాల రాక
టన్నెల్ ప్రమాద స్థలంలో సింగరేణి కి చెందిన రిస్క్యూ టీం రంగంలోకి దించారు.భారత ఆర్మీ కి చెందిన రిస్క్యూ టీం లను కూడా రప్పించారు.ఇటీవల ఉత్తరఖండ్ రాష్ట్రంలో ఈ తరహా సంఘటన చోటు చేసుకున్నప్పుడు రంగంలోకి దిగి ప్రాణాపాయం లేకుండా కాపాడిన టీం ను కుడా రంగంలోకి దించారు. టన్నెల్ వద్ద వైద్య బృందం అంబులెన్స్ లను సిద్దంగా ఉంచారు.

ప్రమాదంలో చిక్కుకున్న వారు ఎవరంటే...
టన్నెల్ కూలిన ప్రమాదంలో చిక్కుకున్న ఆ ఎనిమిది మందిలో ప్రాజెక్ట్ ఇంజినీర్,సైట్ ఇంజినీర్ తో పాటు ఇద్దరు మిషన్ ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు.సొరంగంలో ఎనిమిది మంది చిక్కుకున్నారు. ఇందులో ఇండియన్, అమెరికన్ కంపెనీలకు చెందిన వారు ఉన్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు జేపీ అసోసియేట్స్ కంపెనీ ఇంజనీర్లు, నలుగురు జార్కండ్ కు చెందిన కూలీలు, మరో ఇద్దరు అమెరికన్ కంపెనీ రాబింగ్ కంపెనీ ఉద్యోగులున్నారు. వారి వివరాలు...
1.మనోజ్ కుమార్ (PE) ఉత్తర ప్రదేశ్
2. శ్రీనివాస్ (FE) ఉత్తర ప్రదేశ్
3. సందీప్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
4. జటాక్స్ (కార్మికుడు)జార్ఖండ్
5.సంతోష్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
6. అనూజ్ సాహు (కార్మికుడు)జార్ఖండ్
7.సన్నీ సింగ్ (కార్మికుడు)జమ్మూ కాశ్మీర్
8. గురుప్రీత్ సింగ్ (కార్మికుడు)పంజాబ్

అకస్మాత్తుగా టన్నెల్ లోపల నీరు,మట్టి వచ్చింది...
అకస్మాత్తుగా లోపటికి నీరు,మట్టి రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని టన్నెల్ కూలీలు చెప్పారు.రోజువారీగా పని మొదలు పెట్టినట్లే శనివారం ఉదయం ఏడున్నర గంటలకు పని మొదలు పెట్టిన 30 నిమిషాల్లోనే ఈ సంఘటన ఉత్పన్నమవడంతో వెంటనే కూలీలు పనిని నిలిపి వేసి బయటకు పరుగులు తీశారు.

పెద్ద శబ్ధం వచ్చింది...
టన్నెల్ బోర్ మిషన్ (T.B.M) వద్ద పని మొదలు పెట్టారో అక్కడికి నీరు,మట్టి చేరుతుండడంతో పాటు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చిందని జార్ఖండ్ కూలీలు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మిషన్ మీద ఉన్న వారు,వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాగలిగారు.మిషన్ ముందు భాగంలో ఉన్న వారు అందులో చిక్కుకున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్
నాగర్​ కర్నూల్​ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీఎం రేవంత్ రెడ్డిని ఆరా తీశారు. జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.సహాయక చర్యల కోసం వెంటనే ఎన్డీఆర్ఎఫ్ టీం ను పంపిస్తామని సీఎంకు ప్రధాని మోదీ చెప్పారు.

ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు
ఉదయం 8.30 నుంచి 9 గంటల ప్రాంతంలో టన్నెల్ కూలిన ఘటన జరిగిందని,హుటాహుటిన 11గంటలకల్లా అధికారులతో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

టన్నెల్ నిర్మిస్తే 4 లక్షల ఎకరాలకు సాగునీరు
ప్రపంచంలోనే రాబింగ్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ అని, వివిధ దేశాల్లో 3వేల కిలోమీటర్లకు పైగా టన్నెల్స్ నిర్మించిన కంపెనీ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.అవాంతరాలను అధిగమించి సొరంగం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.ఈ సొరంగం నిర్మాణం పూర్తయితే 3 నుంచి 4లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని చెప్పారు.ఇప్పటికే 33.5కి.మీ పనులు పూర్తయ్యాయని, మరో 9.5 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణ పనులు పూర్తి చేయాల్సి ఉండగా, అనుకోకుండా జరిగిన దురదృష్ట కర ఘటన ఇది అని మంత్రి చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వం, ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) ఇతర ఏజెన్సీలు సమిష్టిగా పనిచేస్తున్నాయి.

రాహుల్ గాంధీ ఆరా
రాహుల్ గాంధీ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి టన్నెల్ కూలిన ఘటనపై తాజా సమాచారం అడిగి తెలుసుకున్నారు.టన్నెల్ లోని మట్టి దిబ్బలను తొలగించేందుకు యత్నిస్తున్నారు. సాంకేతిక నిపుణులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారు.నీటిపారుదల శాఖ, విపత్తు నిర్వహణ బృందాలు, రక్షణ దళాలు సంయుక్తంగా సహాయ చర్యలు నిర్వహిస్తున్నాయని, నిరంతరం ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతోందని, డీ వాటరింగ్ కోసం మోటార్లు వినియోగిస్తున్నామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

రంగంలో దిగిన నేవీ
ఇండియన్ ఆర్మీతో పాటు ఇండియన్ నేవీ కూడా రంగంలోకి దిగాయి.ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ఏజెన్సీలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి.దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవీ, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ, నవయుగ లకు చెందిన ఉన్నతాధికారుల బృందం ఇప్పటివరకు ఏడు సార్లు టన్నెల్ లో తనిఖీలు నిర్వహించాయి.వీరి బృందంలో దాదాపు 700కు పైగా నిపుణులైన సిబ్బంది ఉన్నారు.

ర్యాట్ హోల్ టీమ్ మైనర్స్
టన్నెల్ లోపల 14 మంది ర్యాట్ హోల్ టీమ్ మైనర్స్ ల సేవలను ముమ్మరంగా ఉపయోగిస్తున్నారు. వీరితోపాటు టన్నెల్ లో ఉన్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసు జాగిలా లను కూడా రప్పించారు.టన్నెల్ లోపల నీరు ఉన్నందున ఈ పోలీసు జాగిలాలు లోపలికి వెళ్లలేక పోయాయి.టన్నెల్ లోపలికి పై నుండి రంద్రం చేసి లోపలికి వెళ్లాలన్న (వర్టికల్ డ్రిల్లింగ్ ) ప్రతిపాదనను తోసిపుచ్చారు.

సహాయ కార్యక్రమాల్లో అధికారులు
ఎస్ ఎల్ బి సి ప్రమాద సంఘటన స్థలాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి,పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు.సహాయ పనులను రాష్ట్ర ప్రభుత్వ విపత్తుల నిర్వహణ శాఖ స్పెషల్ సి.ఎస్. అర్వింద్ కుమార్, ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషరాఫ్ అలీ, స్పెషల్ ఆఫీసర్ శ్రీధర్, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఐజీ చౌహన్, టన్నెల్ రంగ నిపుణులు క్రిస్ కూపర్, రాబిన్స్ కంపెనీ ప్రతినిధి గ్రేన్ మేకర్డ్, ఉత్తరాఖండ్ లో ఇలాంటి దుర్గటనలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన నిపుణుల బృందం, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్,ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, ఉత్తర కాశీ టన్నెల్ రెస్క్యూ ర్యాట్ మైనర్స్ గ్రూప్ ప్రతినిధి ఫిరోజ్ కురేషి, ఇతర ఉన్నతాధికారుల బృందం చేపట్టింది.

ఎస్ఎల్‌బీసీ టన్నెల్  నుంచి  ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సలీం షేక్

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ నుంచి ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి సలీం షేక్


సహాయ పనులు ముమ్మరం

శ్రీశైలం ఎడమ కాలువ టన్నెల్ లో అత్యున్నత పరిజ్ఞానాన్ని ఉపయోగించి సహాయ చర్యలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, జూపల్లి కృష్ణా రావు లు చెప్పారు. టన్నెల్ లో ఉన్న నీటిని భారీ పంపులతో బయటికి పంపడం, బురదను తీసివేయడం ద్వారా డీబీఎం ముందుభాగానికి చెరుకున్నారు.డీబీఎం చివరి భాగాలను గ్యాస్ కట్టర్లు, ప్లాస్మా కట్టర్లతో తొలగించారు.అనంతరం ఆర్మీ,నేవీ,ఎన్డీఆర్ఎఫ్,ర్యాట్ హోలర్స్ సహాయంతో వారిని వెలికి తీశారు.

నిరంతరం సహాయ చర్యలు
ఎస్ ఎల్ బి సి టన్నెల్ ప్రమాదంలో 11 బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయి. ఆర్మీ,ఎన్డీఆర్ఎఫ్, ఎస్ డి ఆర్ ఎఫ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ, ఫైర్ సర్వీసెస్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, హైడ్రా, సౌత్ సెంట్రల్ రైల్వే ప్లాస్మా కట్టర్స్, ర్యాట్ మైనర్స్, బృందాలు నిరంతరం సమన్వయంతో సహాయక చర్యలు వేగవంతం చేశాయి.అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రమాద ప్రదేశంలోని నీటిని పంపుల ద్వారా బయటికి తరలిస్తూ, ప్లాస్మా గ్యాస్ కట్టల ద్వారా శిథిలాలను తొలగిస్తూ సహాయక చర్యలు వేగవంతం చేశారు.

మరో మూడు రోజుల సమయం పట్టవచ్చు : సీఎం
టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో ఇప్పటికీ ఒక అంచనాకు రాలేక పోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.ఈ సమస్య ఒక కొలిక్కి రావడానికి మరో రెండు, మూడు రోజులు పడుతుందని సీఎం పేర్కొన్నారు. కన్వేయర్ బెల్ట్ పాడవడంతో లోపల మట్టిని బయటకు తరలించడం ఇబ్బందిగా మారిందని, సోమవారం లోగా కన్వేయర్ బెల్ట్ ను రిపేర్ చేస్తే లోపల ఉన్న మట్టిని బయటకు తరలించడం సులువు అవుతుందని సీఎం వివరించారు.


Read More
Next Story