కేసీఆర్ కు ఏమైంది ?
x
KCR

కేసీఆర్ కు ఏమైంది ?

భారీవర్షాల కారణంగా వేలాదిమంది జనాలు నిశ్రాయులైపోయి, లక్షలాది మంది జనాలు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ ఉలకటంలేదు పలకటంలేదు.


ప్రజాసమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానన్నారు. ఈ ప్రభుత్వాన్ని అస్సలువదిలిపెట్టేది లేదన్నారు. ప్రభుత్వాన్ని నిద్రపోనిచ్చేదిలేదన్నారు. అదన్నారు..ఇదన్నారు. చాలానే చెప్పారు. కాని చివరకు సమయం వచ్చినపుడు అడ్రస్ లేకుండాపోయారు. పైన చెప్పిన మాటలు ఎవరి గురించో అర్ధమైపోయుంటుంది. అవునే కారుపార్టీ అధినేత కేసీఆర్ గురించే ఇదంతా. ఐదురోజుల భారీ వర్షాల దెబ్బకు తెలంగాణాలో జనాలు బాగా ఇబ్బందిపడుతున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలు అయితే అల్లాడిపోతున్నాయి. భారీవర్షాల కారణంగా వేలాదిమంది జనాలు నిశ్రాయులైపోయి, లక్షలాది మంది జనాలు ఇబ్బందులు పడుతున్నా కేసీఆర్ ఉలకటంలేదు పలకటంలేదు.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ పెద్దగా జనాల్లోకి వచ్చిందిలేదు. తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఒక్కటంటే ఒక్కసీటు కూడా గెలవలేదు. దాంతో జనాలను కాదు కదా చివరకు పార్టీ నేతలను కూడా కలవటం మానేశారు. అయితే నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరటం మొదలైంది. దాంతో ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు పార్టీని వదలకుండా బుజ్జగించేందుకు మూడురోజులు వరుసగా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలను వాళ్ళ కుటుంబాలతో పాటు కలిశారు. ఆ తర్వాత బడ్జెట్ సమావేశాల్లో మొదటిరోజు అసెంబ్లీకి హాజరయ్యారు. అంతే ఆ తర్వాత నుండి అడ్రస్ లేరు.

అసెంబ్లీ సమావేశానికి హాజరైనపుడే ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని, నిద్రపోనివ్వనని, వెంటాడుతామని ఏదేదో మాటలు చెప్పరు, హెచ్చరికలు చేశారు. అప్పటినుండి జనాల్లోనే కాదు పార్టీ నేతలతో కూడా టచ్ లో లేరు. అవసరమైనపుడు ఎవరైనా ఒకరిద్దరు నేతలతో మాట్లాడటం మినహా పార్టీ నేతలతో సమావేశమైంది లేదు క్యాడర్లో ఉత్సాహం నింపిందీలేదు. సరే, పార్టీ కార్యక్రమాలు ఎలాగున్నా ఐదురోజులుగా ప్రకృతి విపత్తు దెబ్బకు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది జనాలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమయంలో వెంటనే స్పందించి పార్టీ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయటం, సహాయచర్యల్లోకి దింపటం లాంటివి కేసీఆర్ పట్టించుకోలేదు.

పదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కాబట్టి బాధ్యతకలిగిన ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధినేతగా పార్టీ యంత్రాంగం మొత్తాన్ని సహాయచర్యల్లోకి దింపుతారని అనుకున్నారు. అయితే కేసీఆర్ నుండి ఇలాంటివి ఆశించేందుకు లేదని అర్ధమైంది. ఫాంహౌస్ నుండి కేసీఆర్ అడుగుబయటపెట్టలేదు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసి అందరినీ సహాయచర్యలకు దింపుంటే బాగుండేది. విస్తృతమైన పార్టీ యంత్రాంగం ఉందని, బీఆర్ఎస్ కు ఉన్నట్లుగా అత్యంత పటిష్టమైన యంత్రాంగం ఇంకే పార్టీకి లేదని చెప్పుకునే కేసీఆర్ మరి సమయం వచ్చినపుడు ఎందుకు రంగంలోకి దింపలేదో అర్ధంకావటంలేదు.

ఇదే విషయమై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతు కేటీఆర్, హరీష్ పై మండిపోయారు. విపత్కర పరిస్ధితుల్లో కూడా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలేనా అని చురకలంటించారు. భారీవర్షాలకు చాలాప్రాంతాల్లోని జనాలు అల్లాడిపోతుంటే ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ కు బాధ్యత లేదా అని నిలదీశారు. సహాయచర్యల్లో పాల్గొనాలని కేసీఆర్ నేతలు, క్యాడర్ కు ఎందుకు పిలిపివ్వలేదని ఆక్షేపించారు. ఎంతసేపు ట్విట్టర్లో కూర్చుని ప్రభుత్వంపై ఆరోపణలు చేయటమే కేటీఆర్, హరీష్ పనా అంటు ఎద్దేవా చేశారు.

ఖమ్మంలో రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్, నల్గొండలో మాజీ ఎంఎల్ఏ బొల్లం మల్లయ్య యాదవ్, వరంగల్లో మాజీ మంత్రి సత్యవతీ రాథోడ్, ఉప్పల్ ఎంఎల్ఏ ర్యాగిడి లక్ష్మారెడ్డి లాంటి కొద్దిమంది నేతలు మాత్రమే సహాయచర్యల్లో కనిపించారు. అందుకనే కేసీఆర్ కు ఏమైందని జనాలు ఆలోచిస్తున్నారు. ఎంతసేపు కేటీఆర్, హరీష్ రావు లాంటి కొందరు ట్విట్వర్లో మాత్రమే కనబడుతున్నారు. జనాలకు కష్టంవచ్చినపుడు సహాయచర్యలు చేయాల్సిన ప్రభుత్వం ఎలాగూ చేయగలిగింది చేస్తుంది. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం నేతలకు బాధ్యత లేదాని జనాలు ప్రశ్నిస్తున్నారు.

Read More
Next Story