పవన్ సనాతన ధర్మం ఏమైపోయింది ?
సనాతన ధర్మ పరిరక్షకుడనని, సనాతన ధర్మాన్ని కాపాడటానికే అవతరించానన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న జనసేన అధినేత, పవన్ కల్యాణ్(Janasena Chief PawanKalyan) నోరెత్తటంలేదు.
సనాతన ధర్మ పరిరక్షకుడనని, సనాతన ధర్మాన్ని కాపాడటానికే అవతరించానన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న జనసేన అధినేత, డిప్యుటి సీఎం పవన్ కల్యాణ్(janasena Chief PawanKalyan) నోరెత్తటంలేదు. పవన్ సనాతన ధర్మం(Sanatana Dharmam) ముసుగు తొలగిపోయింది. మూడురోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్ధానం ట్రస్ట్ బోర్డు(TTD Trust Board)ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వం శుక్రవారం రాత్రి జారీచేసింది. ఛైర్మన్ గా నియమితులైన బీఆర్ నాయుడు దగ్గర నుండి సభ్యులుగా నియమితులైన వాళ్ళంతా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకవైపు బోర్డు నియామకంపై జీవో జారీ అయ్యింది. మరోవైపు ఛైర్మన్, సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇంకోవైపు బోర్డులోని కొందరు సభ్యుల నేపధ్యంపై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోంది.
ఇపుడు విషయం ఏమిటంటే ఛైర్మన్, బోర్డు సభ్యుల్లో కొందరిపై చాలామందిలో తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. టీటీడీ బోర్డంటేనే రాజకీయ పునరావాసంగా మారిపోయిందనే ఆరోపణలు, విమర్శలకు కొదవేలేదు. ముఖ్యమంత్రిగా ఎవరున్నా నియామకాలు జరుగుతున్న విధానమిదే. ఇపుడు విషయం ఏమిటంటే బోర్డు నియామకంపై జనాల్లో ఇంత వ్యతిరేకత కనబడుతున్నా సనాతన ధర్మం ఛాంపియన్ పవన్ కల్యాణ్ మాత్రం ఎక్కడా నోరు మెదపటంలేదు. బోర్డు ఛైర్మన్ దగ్గర నుండి సభ్యుల్లో చాలామందిపై విపరీతమైన ఆరోపణలున్నాయి. లాయర్, జై భీమ్ భారత్ పార్టీ(Jai Bhim Bharath Party) వ్యవస్ధాపక అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్(Jada Sravan Kumar) అయితే బోర్డును చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) రద్దు చేయకపోతే తాను కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని హెచ్చరించారు. శవాలు అమ్ముకునే వ్యక్తి కొడుకును, నేరచరిత్ర కలిగిన ఎంఎల్ఏలు జ్యోతుల నెహ్రూ(Jyotula Nehru), ఎంఎస్ రాజు(MS Raju)కు బోర్డులో సభ్యత్వం ఎలాగిచ్చారని శ్రవణ్ ప్రశ్నించారు.
వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే జనసేన కోటాలో నియమితులైన ఆనందసాయి, బొంగునూరి మహేందర్ రెడ్డిని సనాతన ధర్మం పరిరక్షకులా అని జడ ఎద్దేవా చేశారు. వీళ్ళిద్దరు సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించగలరో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బోర్డు మొత్తంలో టీటీడీ ప్రతిష్టను, పవిత్రతను కాపాడే వ్యక్తులు ఎవరున్నారో చెప్పాలని శ్రవణ ఛాలెంజ్ చేశారు. హిందుత్వంపైన, సనాతన ధర్మంపైన మాట్లాడేందుకు తనకు మాత్రమే పెటెంట్ హక్కుందని భావిస్తున్న పవన్ తన కోటాలో నియమితులైన ఇద్దరిలో సనాతన ధర్మాన్ని పరిరక్షించే వాళ్ళెవరో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆనందసాయి సినిమాల్లో ఆర్ట్ దర్శకుడు, పవన్ సినిమాలకు పనిచేశాడు. చిన్నజియ్యర్ స్వామి ఆశ్రమరూపకల్పనలోను, యాదాద్రి దేవాలయం పునర్నిర్మాణంలో పాత్రుంది అంతే.
అలాగే బొంగునూరి పవన్ తో పాటు ప్రజారాజ్యంపార్టీ(PrajaRajyamParty)లో ఇపుడు జనసేనలో యాక్టివ్ గా ఉన్నారంతే. 2019 ఎన్నికల్లో మల్కాజ్ గిరి(Malkajgiri) ఎంపీగా జనసేన తరపున పోటీచేసి ఓడిపోయారు. ఆనందసాయి, బొంగునూరిని కేవలం పవన్ సూచనల కారణంగానే చంద్రబాబు టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా నియమించారు. నియమితులైన ఇద్దరు, వీళ్ళిద్దరిని సిఫారసుచేసిన పవన్ సనాతన ధర్మ పరిరక్షణను ఏ విధంగా చేయగలరో చెప్పాలని శ్రవణ్ నిలదీస్తున్నారు. తిరుమల శ్రీవారి ప్రసాదాల్లో కల్తీ జరిగిందనే తప్పుడు ఆరోపణలను చంద్రబాబునాయుడు చేయగానే పవన్ రెచ్చిపోయారు. అప్పటినుండి సనాతన ధర్మం అంటు ఏమిటేమిటో మాట్లాడేశారు. లడ్డూ(Laddoo) ప్రసాదాల కల్తీ ఆరోపణలతో జగన్మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy)పై టన్నుల కొద్ది బురదచల్లేశారు. రాజకీయాల నుండి తిరుమలను దూరంగా ఉంచేందుకు ధర్మ రక్షణ పరిషత్ ఏర్పాటు చేయాలని పెద్ద డిమాండే చేశారు.
అధికారంలో ఉండికూడా అది చేయాలి..ఇది చేయాలని డిమాండ్ చేసే నేత పవన్ మాత్రమే. తాను డిప్యుటీ సీఎంగా ఉండి ధర్మరక్షణ పరిషత్ ను ఏర్పాటు చేయాలంటే కాదనే వాళ్ళెవరు ? పోనీ ఇపుడు నియమించిన బోర్డులో ధర్మ రక్షణను కాపాడేవాళ్ళు కాని, సనాతన ధర్మాన్ని కాపాడేవాళ్ళు ఎవరున్నారో పవన్ చెప్పగలరా అని శ్రవణ్ ప్రశ్నకు సమాధానం లేదు. మిగిలిన వాళ్ళ సంగతిని పక్కనపెట్టేసినా స్వయంగా తానే రికమెండ్ చేసిన ఇద్దరు సభ్యులు ఆనందసాయి, మహేందర్ రెడ్డికి బదులుగా సనాతన ధర్మ రక్షణ కోసం పాటుపడుతున్న పీఠాధిపులు లేకపోతే మఠాధిపతులను ఎందుకు ప్రతిపాదించలేదు ? అంటే పవన్ చెప్పేది ఒకటి చేసేది మరోటి అనేందుకు ఇదే తాజా ఉదాహరణ. అందుకనే పవన్ చెప్పే సనాతన ధర్మం ఏమైపోయిందనే చర్చ ఇపుడు జనాల్లో నడుస్తోంది. మరి దీనికి పవన్ ఏమి సమాధానం చెబుతారో చూడాలి.