డ్రగ్స్ డీ అడిక్షన్ కోసం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఏం చేస్తుందంటే...
డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం పనిస్తున్న యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మరో అడుగు ముందుకేసింది.డ్రగ్స్ కు అలవాటు పడిన వారికి డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్‌ను సమూలంగా నియంత్రించడంతోపాటు డ్రగ్స్ తీసుకుంటున్న వారి అలవాటును మాన్పించేందుకు 16 డ్రగ్స్ ఎడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం కింద తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో మహిళా, శిశు సంక్షేమ శాఖ,వైద్యఆరోగ్యశాఖ, స్వచ్ఛంద సంస్థలు సంయుక్తంగా 16 డ్రగ్స్ డీ అడిక్షన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
డ్రగ్స్ వాడవద్దంటూ ప్రచారోద్యమం
యువత డ్రగ్స్ తీసుకోవడం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతింటోంది. డ్రగ్స్ వ్యసనానికి అలవాటు పడిన వారు నిత్యం డ్రగ్స్ తీసుకుంటూ మత్తులో జోగుతుంటారు. డ్రగ్స్ నివారణకు రాష్ట్ర స్థాయి కోఆర్డినేటింగ్ ఏజెన్సీ,డిస్ట్రిక్ట్ డీ-అడిక్షన్ సెంటర్లు నడుస్తున్నాయి. మద్యం, గంజాయి, కల్తీ కల్లు, డ్రగ్స్ నివారణకు ఈ కేంద్రాలు దోహదపడుతున్నాయి.
డ్రగ్ ఫ్రీ తెలంగాణ
డ్రగ్ ఫ్రీ తెలంగాణ సాధనలో భాగంగా 26 ప్రభుత్వ ఆసుపత్రుల్లో యువతకు చికిత్స అందిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వారికి చికిత్స చేయడానికి యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వైద్యఆరోగ్యశాఖ సహకారంతో 26 ఆసుపత్రుల్లో ప్రత్యేక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసింది.సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి, వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి, కామారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, నిర్మల్,సిద్ధిపేట, మహబూబ్ నగర్,నల్గోండ, జగిత్యాల,కరీంనగర్,రామగుండం, హైదరాబాద్ మెంటల్ ఆసుపత్రి, నాగర్ కర్నూల్, ఆదిలాబాద్, వనపర్తి, వికారాబాద్, సంగారెడ్డి, కుమురం భీం, అసిఫాబాద్, జనగామ, సిరిసిల్ల, కొత్తగూడెం, మంచిర్యాల, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు.
యువత చైతన్యానికి ప్రచారం
పొగాకు, మద్యం, గంజాయి, మాదకద్రవ్యాలను ఉపయోగించకుండా యువతను చైతన్యవంతులను చేసేందుకు ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, అంగన్ వాడీ కార్యకర్తలు. పంచాయతీ అధికారులు, ఉపాధ్యాయులు కార్యక్రమాలు చేపడుతున్నారు. మాదకద్రవ్యాలకు అలవాటు పడక ముందే యువతను చైతన్యవంతులను చేసి డ్రగ్స్ కు వారు దూరంగా ఉండేలా చేయాలని నిర్ణయించారు. డీ అడిక్షన్ సెంటర్లలో డ్రగ్ టెస్టింగ్ కిట్‌లు అందుబాటులో ఉంచారు.
మద్యం, గంజాయి, డ్రగ్స్, కల్తీ కల్లుకు అలావాటు పడిన ఎందరినో డీ అడిక్షన్ కేంద్రాల్లో చికిత్స చేయించి వారికి ఉన్న అలవాటును మాన్పించారు. డీ అడిక్షన్ కేంద్రాల్లో వేలాదిమంది మందుబాబులకు చికిత్స చేశారు. ఖమ్మంలో 565 మంది, నల్గొండలో 1048, రంగారెడ్డి జిల్లాలో 1126 మంది, వికారాబాద్ జిల్లాలో 1117, మెదక్ జిల్లాలో 1170, మేడ్చల్ లో 225 మంది, వరంగల్ లో 1903 మంది, కరీంనగర్ లో 783, ఆదిలాబాద్ లో 1178 మంది మందుబాబులకు చికిత్స అందించారు.
Next Story