తెలంగాణా రాజ్ భవన్లో ఏమి జరుగుతోంది ?
x
Governor Jishnudev Varma

తెలంగాణా రాజ్ భవన్లో ఏమి జరుగుతోంది ?

కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు రు. 55 కోట్లు బదిలీచేయమని తానే చెప్పినట్లు అంగీకరించారు. నిధుల బదిలీకి ప్రభుత్వం అనుమతి అవసరమేలేదని సమర్ధించుకుంటున్నారు.


ఇపుడీ విషయం రాజకీయాలను క్లోజ్ గా ఫాలో అయ్యేవాళ్ళకి కూడా అర్ధంకావటంలేదు. ఈ ఫార్ములా కార్(E Formula Car Race) రేసు నిర్వహణ ఏర్పాట్లలో రు. 55 కోట్లు అవినీతి జరిగిందని ఇప్పటికే ఏసీబీ(ACB) విచారణలో తేలిపోయింది. అవినీతిలో కీలకవ్యక్తి కేటీఆర్(KTR) అని ప్రభుత్వం ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. ఈ విషయం రేవంత్ రెడ్డి, మంత్రుల మాటల్లో స్పష్టంగా అర్ధమవుతోంది. కేటీఆర్ మీద కేసునమోదు చేసి అరెస్టుచేసి విచారణ జరిపేందుకు అనుమతి కోరుతు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma)కు ప్రభుత్వం నుండి మూడువారాల క్రితం లేఖ వెళ్ళింది. ప్రజాప్రతినిధులు అంటే ఎంఎల్ఏల మీద కేసు నమోదుచేయాలంటే అందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరిగా అవసరం. అందుకనే గవర్నర్ కు అనుమతికోరుతు లేఖరాసినట్లు స్వయంగా రేవంత్ రెడ్డే(Revanth reddy) చెప్పారు. అయితే ప్రభుత్వం నుండి రాజ్ భవ(Raj Bhavan)న్ కు లేఖ వెళ్ళి మూడువారాలు అవుతున్నా ఇప్పటివరకు అతీగతిలేదు.

కేటీఆర్ మీద కేసునమోదు ఫైలుపైన అర్జంటుగా సంతకం చేయమని ప్రభుత్వం గవర్నర్ ను అడిగేందుకు లేదు. ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఫైలుపైన కూడా ఇన్నిరోజుల్లో గవర్నర్ సంతకం చేయాలని కూడా లేదు. అందుకనే గవర్నర్ ఆమోదంకోసం ప్రభుత్వం ఓపికగా వెయిట్ చేస్తోంది. చివరకు కేటీఆర్ మీద కేసునమోదుకు గవర్నర్ సంతకం పెడతారో లేదో కూడా ప్రభుత్వానికి అర్ధంకావటంలేదు. కేటీఆర్ మీద కేసునమోదు ఫైలుపై గవర్నర్ సంతకం పెడతారు, వెంటనే కేసునమోదు చేసి ఏసీబీ విచారణలోకి దిగుతుందని మంత్రలు ఎదురుచూస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) మీడియాతో మాట్లాడుతు కేటీఆర్ మీద కేసునమోదు ఫైలుపై గవర్నర్ సంతకం పెడతారని తాము అనుకుంటున్నట్లు ఇప్పటికే ఒకటికి రెండుసార్లు చెప్పటం అందరికీ తెలిసిందే.

ఇంతకీ ఏమి జరిగిందంటే బీఆర్ఎస్ హయాంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. హైదరాబాదులో ఈ ఫార్ములా కార్ రేసు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనుకున్నదే తడవుగా ప్రభుత్వం తరపున హెఛ్ఎండీఏని నోడల్ ఏజెన్సీగా 2022లో డిసైడ్ చేసింది. కార్ రేసునిర్వహణకోసం హెచ్ఎండీఏకి గ్రీన్ కో కంపెనీకి మధ్య ఒప్పందం కూడా జరిగింది. రేసు ఏర్పాట్లకు అవసరమైన మౌళిక సదుపాయాలను హెచ్ఎండీఏ చేసేట్లు, రేసునిర్వహణ మొత్తం వ్యవహారాన్ని గ్రీన్ కో కంపెనీ చూసుకునేట్లుగా ఒప్పందం జరిగింది. కొంతకాలం తర్వాత ఏమి జరిగిందో తెలీదుకాని హెచ్ఎండీఏ ఏకపక్షంగా గ్రీన్ కో కంపెనీని తప్పించేసి మరో కంపెనీని పట్టుకొచ్చింది. కొత్తగా వచ్చిన కంపెనీకి హెచ్ఎండీఏ ప్రభుత్వంనుండి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే రు. 55 కోట్లు చెల్లించేసింది. ఇదంతా 2023 ఎన్నికలకు ముందు జరిగింది. రేసు ప్రారంభం అవుతుందనగా సడెన్ గా ఎన్నికల ప్రకటన జారీఅయ్యింది. దాంతో ఎక్కడి ఏర్పాట్లు అక్కడే ఆగిపోయాయి.

ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నపుడే రేసు ఏర్పాట్లపై బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. అందుకనే అధికారంలోకి రాగానే కారు రేసు ఏర్పాట్లలో అవినీతిపై చీఫ్ సెక్రటరీతో విచారణ చేయాలని రేవంత్ ఆదేశించారు. అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్ఎండీఏ సెక్రటరీగా ఉన్న అర్వింద్ కుమార్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి.

చీఫ్ సెక్రటరీ కూడా అర్వింద్ ను విచారించింది. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాల ప్రకారమే తాను రు. 55 కోట్లు చెల్లించినట్లు అంగీకరించారు. కేటీఆర్ ఆదేశాలను చూపించమని చీఫ్ సెక్రటరీ అడిగితే ఆదేశాలు రాతపూర్వకంగా లేవని నోటిమాటగా మాత్రమే అందినట్లు చెప్పారు. నోటిమాటతో రు. 55 కోట్లు చెల్లించటం ఏమిటని చీఫ్ సెక్రటరీ ఆశ్చర్యపోయారు. అందుకనే అర్వింద్ పై ఏసీబీ కేసు నమోదుచేసి విచారణ చేస్తోంది. అర్వింద్ రాతమూలకంగా చెప్పిన విషయాలను బట్టి ఏసీబీ కేటీఆర్ మీద కూడా కేసునమోదుకు అనుమతి కావాలని ప్రభుత్వానికి లేఖ రాసింది. ప్రభుత్వం ఇదే విషయాన్ని వివరించి కేటీఆర్ మీద కేసు నమోదుచేయటానికి అనుమతి కోరుతు గవర్నర్ కు లేఖ రాసింది. ప్రభుత్వం నుండి గవర్నర్ కు అనుమతి కోరుతు మూడువారాల క్రితం లేఖ వెళ్ళినా ఇప్పటివరకు గవర్నర్ ఏమి నిర్ణయం తీసుకున్నారో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇదే విషయమై కేటీఆర్ మీడియాతో మాట్లాడుతు రు. 55 కోట్లు బదిలీచేయమని తానే చెప్పినట్లు అంగీకరించారు. నిధుల బదిలీకి ప్రభుత్వం అనుమతి అవసరమేలేదని సమర్ధించుకుంటున్నారు. కేటీఆర్ సమర్ధనను మంత్రులు అంగీకరించటంలేదు. ఇక్కడే గవర్నర్ నిర్ణయం కీలకమైంది.

తనపైన కేసు నమోదుకు ప్రభుత్వానికి అనుమతి ఇవ్వకుండా కేటీఆర్ తెరవెనుక నుండి కేంద్రప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. కేటీఆర్ మీద కేసు నమోదు విషయంలో న్యాయసలహా కోరుతు అడ్వకేట్ జనరల్ (అటార్నీ జనరల్)కు లేఖ రాసినట్లు ప్రచారం జరిగింది. అయితే అదంతా ఉత్త ప్రచారం మాత్రమే అని ఇపుడు బయటపడింది. నిజంగా గవర్నర్ గనుక సలహాఅడుగుతు ఏజీకి లేఖ రాసుంటే వెంటనే ఏజీనుండి సమాధానం వెళ్ళుండేదే అని కాంగ్రెస్ నేతలంటున్నారు. ప్రభుత్వం అనుమతి ఫైలు రాజ్ భవన్లో ఉండగానే గవర్నర్ సడెన్ గా ఢిల్లీ(Delhi)కి వెళ్ళటంతో అనుమానాలు పెరిగిపోతున్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Home Minister Amit Shah)కు మొత్తం వ్యవహారాన్ని వివరించి తీసుకోవాల్సిన చర్యలపై సలహా తీసుకునే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అయితే ఢిల్లీలో గవర్నర్ ఎవరిని కలిశారు ? ఏమి సలహా తీసుకున్నారనే విషయంలో క్లారిటీ లేదు.

ఢిల్లీ నుండి గవర్నర్ శుక్రవారం తిరిగి వచ్చేసినా ఫైలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లు లేదు. దాంతో రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల్లో అసహనం పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలోనే రాజ్ భవన్లో ఏమి జరుగుతుందో అర్ధంకాక ప్రభుత్వం, కాంగ్రెస్ నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. మరి గవర్నర్ చివరకు ఏమిచేస్తారన్నది సస్పెన్సుగా మారిపోయింది.

Read More
Next Story