కమ్యూనిస్టుల దారెటు..?. సీపీఎం అటు.. సీపీఐ ఇటు..
x
Source: Twitter

కమ్యూనిస్టుల దారెటు..?. సీపీఎం అటు.. సీపీఐ ఇటు..

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కమ్యూనిస్టు పార్టీల ఊసే లేదు. దీంతో ఈ ఎన్నికల్లో ఆ పార్టీల దారెటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.



హైదరాబాద్: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల సమరం తీవ్రమయింది. అభ్యర్థుల జాబితాను పూర్తిస్థాయిలో ప్రకటించాల్సి ఉన్నా ప్రచారం తీవ్రంగా సాగుతూ ఉంది. రేపు మార్చి 12న ప్రచారం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. ఒక వైపు హైదరాబాద్‌లో బీజెేపీ తరుఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రచారం చేస్తారు. మరొక వైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కరీంనగర్‌లో ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ఇక కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ‘మహిళా శక్తి’ సభలో ప్రసంగిస్తున్నారు.
అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటే తెలంగాణ కమ్యూనిస్టులు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అసలు తెలంగాణ కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల సంగతి ఎలా ఉన్నా.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముందు వరకు రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టు పార్టీలు ప్రస్తుతం నేల చూపులు చూస్తున్నాయనే చెప్పాలి. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరిగిన ఏ ఎన్నికల్లోనూ కమ్యూనిస్టులు తమ ఉనికిని చాటుకోవడంలో విఫలమయ్యారనే చెప్పాలి. ఒకానొక దశలో చట్టసభలకు కమ్యూనిస్టు పార్టీల నుంచి ప్రతినిధి లేకుండా పోయారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) కాంగ్రెస్‌తో జత కట్టి ఒక ఎమ్మెల్యే స్థానాన్ని దక్కించుకోగలిగింది. కానీ భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) సీపీఎం మాత్రం ఒంటరిగా బరిలోకి దిగి బొక్క బోర్లా పడింది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో చివరి వరకు కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేలా కన్పించినా.. ఒకట్రెండు సీట్ల సర్దుబాటు విషయంలో వెనక్కి తగ్గకపోవడం వల్ల కాంగ్రెస్‌తో సీపీఎం పొత్తు చిత్తయ్యింది. దాదాపు 50 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగినప్పటికీ కనీసం ఒక్కటంటే ఒక్క స్థానాన్ని కూడా సీపీఎం దక్కించుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలోనూ ఓట్లను రాబట్టుకోవడంలో విఫలమయింది. వాస్తవానికి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఉంటే.. రెండు ఎమ్మెల్యే స్థానాలు సీపీఎంకి దక్కేవి. కానీ సీపీఎం పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు ఒంటరిగా బరిలోకి దిగిందనే దానిపై అప్పట్లో రకరకాల ప్రచారాలు జరిగాయి.
ఇదిలావుంటే.. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల బరిలో కమ్యూనిస్టుల భవితవ్యంపై సందిగ్ధత నెలకొంది. కాంగ్రెస్‌తో పొత్తుతో ఉన్న సీపీఐ తమకు ఒక్క ఎంపీ స్థానమైనా ఇవ్వాలని కోరుతోంది. ఇదే సమయంలో సీపీఎం పార్టీ నుంచి కనీసం లోక్‌సభ ఎన్నికల ఊసే లేకుండా పోయింది. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన సీపీఎం పార్టీ ఎందుకింత దీనస్థితికి దిగజారిపోయింది. సీపీఎం పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందా..? లేక నాయకత్వ లోపమా..? అన్న చర్చ తరచూ వినిపిస్తూనే ఉంది.

ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాలు సీపీఎం పార్టీకి ఒకప్పటి వరకు పట్టుకొమ్మలనే చెప్పాలి. కానీ ఇటీవల ఈ రెండు జిల్లాల్లో సీపీఎం పార్టీ ఊసే లేకుండా పోయింది. ఓవైపు ప్రజాసమస్యలపై నిత్యం సీపీఎం నేతలు గళం విన్పిస్తున్నా.. పోలింగ్ బూత్‌ దగ్గరికి వచ్చేసరికి ఓట్లు వేయించుకోవడంలో ఎందుకు విఫలం అవుతున్నాయనే ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి. నల్లగొండ, భువనగిరి, ఖమ్మం లోక్‌సభ స్థానాల్లో అసలు ఈసారి సీపీఎం బరిలోకి దిగుతుందా..? లేక వేరే పార్టీకి మద్దతు ఇస్తుందా..? అన్న క్లారిటీ లేదు. ఒకానొక దశలో బీఆర్ఎస్‌కు సీపీఎం మద్దతు ఇవ్వాలనే యోచన చేసిందనే ప్రచారం ఉంది.
తమ శాశ్వత రాజకీయ ప్రత్యర్థిగా భావించే బీజేపీని గద్దె దించాలంటే.. వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాలని సీపీఎం నేతలు చెబుతుంటారు. మరి ఆ దిశగానే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో జత కడతారా..? లేక ఇండియా కూటమి నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి ముందుకు సాగుతారా..? అన్నది తేలాల్సి ఉంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం పొత్తు పెట్టుకున్నప్పటికీ ఏ పార్టీకి లోక్‌సభ సీట్లు కేటాయించే పరిస్థితి కన్పించడం లేకపోవడం గమనార్హం. ఇంతకీ కమ్యూనిస్టు పార్టీల దారెటు.. అన్న దానిపై స్పష్టత ఎప్పుడు వస్తుందో చూడాలి.


Read More
Next Story