'బాహుబలి' రిపేర్లకు పెట్టిన ఖర్చు ఎంత?

కాంగ్రెస్‌ నాయకులు నిజంగానే ఆ డబ్బు కక్కిస్తారా? కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదంటున్న బీజేపీ నాయకులు..


బాహుబలి రిపేర్లకు పెట్టిన ఖర్చు ఎంత?
x
మేడిగడ్డ బరాజ్‌

కాంగ్రెస్‌ నాయకులు నిజంగానే ఆ డబ్బు కక్కిస్తారా? కాంగ్రెస్‌కు అంత సీన్‌ లేదంటున్న బీజేపీ నాయకులు..

ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో నిజంగానే నిధులు 'నీళ్ల' పాలయ్యాయా? మోటార్ల మొదలు మరమ్మతుల వరకు నిధులు దుర్వినియోగం అయ్యాయా? దారి మళ్లిన నిధుల్ని రాబట్టేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టిందా? అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్‌ మంత్రులు.


'కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బరాజ్‌ వద్ద కుంగిపోయిన పిల్లర్లు, కొట్టుకుపోయిన గెట్ల వ్యవహారంలో భారీ అవినీతి జరిగింది. ఇందుకు బాధ్యులెవరో తేలుస్తాం. ప్రతి పైసా వసూలు చేస్తాం. ఏ ఇంజినీరింగ్‌ సంస్థనూ వదలం' అని రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. దాదాపు ఇదే విషయాన్ని బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ కె లక్ష్మణ్‌ ధృవీకరిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌ను చూసివచ్చిన తర్వాత కాంగ్రెస్ మంత్రులు సంచలన విషయాలు బయటపెట్టారు. మోటార్ల ధర, పంప్‌హౌస్ రిపేర్లకైన ఖర్చులను తిరిగి చెల్లించాలని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భావించడం వంటి అంశాలను పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ రూపంలో ప్రజలకు వివరించారు. ప్రాజెక్టు నిర్మించిన ఓ ప్రముఖ ఇంజినీరింగ్ లిమిటెడ్‌పై పలు ఆరోపణలు చేశారు. మోటార్ల ధర, పంప్ హౌస్ మునగడానికి కారణాలు, మరమ్మత్తు ఖర్చులు తిరిగి చెల్లించాలని ప్రభుత్వం అనుకోవడవం వంటివాటిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
కాంగ్రెస్‌ తీరును అనుమానించిన బీజేపీ...
ఇంత జరిగినట్టు తేలితే కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎందుకింత ఊదాశీనంగా ఉందని డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. 'కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతిని కాంగ్రెస్ పార్టీ చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తోంది. కాళేశ్వరంపై సీఎం రేవంత్‌ రెడ్డి ఎందుకు విచారణ జరిపించడం లేదు? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల రోజులు అవుతున్నా.. మేడిగడ్డ ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయి' అన్నారు ఎంపీ లక్ష్మణ్.

రిపేర్లకు రీ పేమెంట్‌ ఏమిటీ?
సహజంగా ఏదైనా భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించినపుడు మొదటి మూడేళ్లో, రెండేళ్లో ఆ నిర్మాణ సంస్థే ప్రాజెక్ట్‌ను మెయిన్‌టెయిన్‌ చేస్తుంది. అటువంటిది కాళేశ్వరం ప్రాజెక్ట్‌ వ్యవహారంలో జరగలేదన్నది కాంగ్రెస్‌ ఆరోపణ. గత ఏడాది వరదల్లో మునిగిపోయిన బాహుబలి పంప్‌హౌస్‌ రిపేర్లకైన కోట్లాది రూపాయలను తిరిగి చెల్లించాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్టు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి బహిరంగంగానే ఆరోపించారు. ప్రాజెక్టు నిర్మించిన ఆ ప్రముఖ ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు రిపేర్ ఖర్చులు చెల్లించాలని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రపోజల్ పెట్టింది. లోపాలకు బాధ్యత వహించే నిబంధన కింద ఆ ఇంజినీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మరమ్మత్తు ఖర్చులను భరించాల్సి ఉంటుంది. కానీ అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం ఆ ఖర్చులను తిరిగి చెల్లించేందుకు సిద్ధమయింది. 'కాంట్రాక్టర్‌కు పేమెంట్‌కు సంబంధించిన ఫైల్ సర్క్యులేట్ అవుతోంది...ప్రస్తుతం ఆర్థిక శాఖ దగ్గర ఆ ఫైలు ఉంది' అంటున్నారు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.
ఎత్తు ఎందుకు తగ్గించారు...
126 మీటర్ల ఎత్తులో నిర్మించాల్సిన పంప్‌హౌస్‌ను 110 మీటర్ల ఎత్తులో ఎందుకు నిర్మించారని కూడా మంత్రి పొంగులేటి ప్రశ్నించారు. ఇదే ముంపుకు దారితీసిందన్నారు. వరదల సమయంలో స్టాప్‌లాక్ గేట్లు ఎందుకు పనిచేయలేదని.. డిజైన్‌ను ఆమోదించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని పొంగులేటి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం వెయ్యికోట్ల రూపాయల అసెంబ్లింగ్ మోటార్లను స్థానిక మార్కెట్‌ల నుంచి తీసుకొచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. వెయ్యికోట్ల రూపాయల మోటార్లకు నాలుగువేల కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. రకరకాల చిన్న కంపెనీల పరికరాలతో మోటర్లను అసెంబ్లింగ్ చేశారని తెలిపారు.
ఆ డబ్బంతా నీటి పాలైనట్టేనా?
కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం, జరిగిన ఖర్చు గమనిస్తే..రెండు టీఎంసీల ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.94వేల413 కోట్లు. ఇందులో కాళేశ్వరం కార్పొరేషన్ వ్యయం రూ.44 వేల 614కోట్లు. మొత్తం ఖర్చు రూ.73వేల 499 కోట్లు. ఇక మూడో టీఎంసీ కోసం జరిగిన ఖర్చు రూ.33 వేల 459 కోట్లు. కాళేశ్వరం కార్పొరేషన్ 17 వేల 51 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ప్రభుత్వం 3 వేల 320 కోట్లు ఖర్చుపెట్టింది. మొత్తం ఖర్చు 93వేల872కోట్లు. ఇప్పుడు ఈ డబ్బాంతా నీళ్ల పాలైనట్టేనని, ఇందుకు బాధ్యులైన వారిని గుర్తించి వసూలు చేస్తామంటున్నారు కాంగ్రెస్‌ మంత్రులు.
Next Story