
‘లోకేష్‌ను కలిస్తే తప్పేంటి’
ఏపీ మంత్రి నారా లోకేష్‌తో భేటీపై నోరు విప్పిన తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.
‘తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్.. ఏపీ మంత్రి నారా లోకేష్‌తో భేటీ అయ్యారు. పలు అంశాలపై చర్చించారు. తెలంగాణలో టీడీపీ బలోపేతం సహా ఇక్కడ తమతో పొత్తు కుదుర్చుకోవడం వంటి అంశాలను చర్చించారు’ కొన్ని రోజులుగా తెలంగాణలో ఈ వార్తలు హోరెత్తుతున్నాయి. తాజాగా వీటిపై కేటీఆర్ స్పందించలేదు. తాను లోకేష్‌తో కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తమపై లేనిపోని నిందలు వేస్తోందని, టన్నుల కొద్దీ కేసులు పెట్టారని ఆరోపించారు. చివరకు ఒక్క కేసులో కూడా గుండుసూదంత ఆధారం కూడా చూపలేదని చురకలంటించారు. అనంతరం ఇటీవల ‘కేటీఆర్.. గంజాయి బ్యాచ్. ఆయన చుట్టూ ఉండేటోళ్లు డ్రగ్స్’ బ్యాచ్ అని సీఎం రేవంత్ అన్న మాటలకు కూడా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే తనకేం సంబంధం? అని ప్రశ్నించారు.
‘‘ఏపీ మంత్రి నారా లోకేష్‌తో నేను భేటీ కాలేదు. ఆయనను నేను అసలు కలవలేదు. సరే ఒకవేళ కలిశానే అనుకుందాం. కలిస్తే తప్పేంటి. నాకర్థం కావట్లేదు. నారా లోకేశ్ నాకు మంచి మిత్రుడు.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన పక్క రాష్ట్రం మంత్రి.. నాకు తమ్ముడి లాంటి వారు’’ అని అన్నారు.
‘‘దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి. నేను నా జీవితంలో ఇప్పటి వరకు సిగిరెట్ కూడా కాల్చలేదు. అలాంటి నాపై సీఎం నోటికొచ్చిన ఆరోపణలు చేశారు. అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో డైవర్షన్ పాలిటిక్స్ తప్ప సీఎం రేవంత్ చేసిందేంది? నా విషయంలో ఒకసారి డ్రగ్స్ అంటారు.. మరోసారి కార్ రేసింగ్ అంటారు. రేవంత్ రెడ్డి యూట్యూబర్లు మినహా ఎవరికీ లాభం లేదు. ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు మరోసారి ద్రోహం చేశారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకుని తెలంగాణ నీటిని ఏపీకి ధారాదత్తం చేశారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన 420 హామీల విషయంలో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్ ఆడటం ఖాయం’’ అని అన్నారు కేటీఆర్.