మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో ‘భూ’కంపం
x

మౌలానా ఉర్దూ యూనివర్సిటీలో ‘భూ’కంపం

అసలు MANUU భూ వివాదం ఏంటి? 50 ఎకరాల భూమి కోసం విద్యార్థులు ఎందుకు పోరాడుతున్నారు? .


భవనాలు, బండరాళ్లు, ఐటీ వాణిజ్య ప్రాజెక్టుల మధ్య, 200 ఎకరాల్లో ఉన్న మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(MANUU) క్యాంపస్‌ ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్‌గా మారింది. “మన భవిష్యత్తు, మన భూమి” నినాదంతో MANUU విద్యార్థులు లైబ్రరీ, హాస్టళ్లు కోసం గంటల నిరసనలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వ షోకాజ్ నోటీసుకు ప్రతివాదం చేస్తున్నారు. భారతదేశంలో ఉన్న ఏకైక ఉర్దూ కేంద్ర విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ. ప్రస్తుతం ఇది తెలంగాణ ప్రభుత్వంతో భూవివాదంలో చిక్కుకుంది. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో విశ్వవిద్యాలయానికి కేటాయించిన భూమిలోని 50 ఎకరాలను తిరిగి స్వాధీనం ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసు జారీ చేయడంతో ఈ వివాదం ప్రారంభమైంది. ఈ పరిణామం విద్యార్థులు, ఫ్యాకల్టీలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది.

ప్రభుత్వం నోటీసులు ఎందుకిచ్చింది

1998లో ఉర్దూ వర్సిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వం గండిపేట మండలం మణికొండ జాగీర్ గ్రామంలోని సర్వే నంబర్ 211, 212లో 200 ఎకరాలను కేటాయించింది. అయితే, ఇందులో 50 ఎకరాలు ఇంకా ఖాళీగానే ఉందని, నిబంధనల ప్రకారం "వినియోగంలో లేని ప్రభుత్వ భూమిని ఎందుకు వెనక్కి తీసుకోకూడదో తెలపాలని డిసెంబర్ 15, 2025న రెవెన్యూ శాఖ తరఫున రంగారెడ్డి కలెక్టర్ నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసుల్లో భూమిని తిరిగి తీసుకోవడానికి తెలంగాణ ప్రాంత భూ రెవెన్యూ (రాష్ట్ర భూముల బదిలీ) నియమాల చట్టం 1975లోని రూల్ 6ను ఆధారంగా చూపింది. ఈ నిబంధన ప్రకారం ప్రభుత్వ భూమిని కేటాయించిన ఉద్దేశానికి వినియోగించకపోతే లేదా నిర్దేశిత కాలవ్యవధిలో అభివృద్ధి చేపట్టకపోతే ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అధికారుల వాదన ప్రకారం, నిర్వహించిన ఒక సర్వేలో MANUU క్యాంపస్‌లో సుమారు 50 ఎకరాల భూమి వినియోగంలో లేనట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇది కేటాయింపు నిబంధనలకు విరుద్ధమని జిల్లా యంత్రాంగం అభిప్రాయపడింది.

యూనివర్సిటీ ఏమంటోంది

ప్రభుత్వ ఆరోపణలను విశ్వవిద్యాలయం తీవ్రంగా ఖండించింది. షోకాజ్ నోటీసు జారీకి ముందు ఎలాంటి భౌతిక స్థాయి సర్వే జరగలేదని స్పష్టం చేసింది. తమ వద్ద వాస్తవంగా 50 ఎకరాల ఖాళీ భూమి లేదని, సుమారు 30 ఎకరాల భూమి మాత్రమే ఖాళీగా ఉందని తెలిపింది. ఈ భూమిని భవిష్యత్ విస్తరణ అవసరాల కోసం ముందుగానే ప్రణాళికాబద్ధంగా కేటాయించినట్టు సంబంధిత అధికారులు వెల్లడించారు. అకడమిక్ భవనాలు, విద్యార్థుల హాస్టళ్లు, లెక్చరర్స్, సిబ్బంది నివాస భవనాల నిర్మాణం కోసం ఈ స్థలం అవసరమని యాజమాన్యం వివరించింది.

అయితే గతంలో ఇదే యూనివర్సిటీ కి చెందిన 32 ఎకరాల భూమిని ఔటర్ రింగ్ రోడ్డు కోసం తీసుకున్నారని, అలాగే ఖాజాగూడ నుంచి నానక్ రామ్ గూడ కు లింక్ రోడ్డు కోసం మ‌రో ఏడెకరాల స్థలాన్ని యునివర్సిటీ భూమిని వాడేశారని గుర్తు చేసింది.

ఎక్కువ ప్రాంతం బండరాళ్లే

యూనివర్సిటీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖాళీగా కనిపిస్తున్న భూమిలో బండరాళ్లే ఎక్కువగా ఉన్నాయి. ఈ రాళ్లను తొలగించాలంటే విస్తృత తవ్వకాలు చేపట్టాల్సి వస్తుంది. అలా చేస్తే పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలకు దారి తీయవచ్చని వారు హెచ్చరించారు. సహజ వనరులు, భౌగోళిక వారసత్వాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా ఒకే ముక్కగా పెద్ద భూమి అందుబాటులో లేదని, చిన్న చిన్న భాగాలుగా మాత్రమే స్థలం ఉందని, వాటి మధ్య ఇప్పటికే భవనాలు లేదా రాళ్లు ఉన్నాయని యూనివర్సిటీ యాజమాన్యం వివరించింది.

అనుమతుల ప్రకారమే అభివృద్ధి

కేంద్ర విశ్వవిద్యాలయంగా ఉన్న మౌలానా అజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(MANUU)లో మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రక్రియ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు, అనుమతులపై ఆధారపడి ఉంటుందని యాజమాన్యం తెలిపింది. నిర్మాణ పనులు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (CPWD) ద్వారా నిర్వహించబడతాయి. ఈ ప్రక్రియలో డీటెయిల్డ్ ప్రాజెక్టు నివేదికలు, ఆర్థిక ఆమోదాలు, టెండర్ ప్రక్రియలు ఇలా అన్నీ చేయడానికి చాలా సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఈ కారణంగా అభివృద్ధిలో ఆలస్యం జరిగిందని, అయితే భూమిని నిర్లక్ష్యం చేసినట్లు భావించడం సరికాదని యూనివర్సిటీ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డికి రెండు నెలల గడువు ఇవ్వాలంటూ అధికారికంగా లేఖ పంపింది.

వర్సీటీ చెప్పింది కరెక్టే: కలెక్టర్

"జిల్లాలోని పలు సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు భూముల వినియోగంపై నోటీసులు జారీ చేశాం. ప్రభుత్వ భూములను కేటాయించిన సంస్థలు వాటిని ఏ విధంగా వినియోగిస్తున్నాయనే అంశంపై వివరాలు సేకరించడం ఈ నోటీసుల ఉద్దేశం" అని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ఒక సాధారణ ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. 2024 సంవత్సరంలో జిల్లా కలెక్టర్, మండల రెవెన్యూ అధికారి, తహశీల్దార్ అధ్యక్షతన ఒక ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.

ఆ కమిటీ ప్రభుత్వ భూములు ప్రజాసేవ కోసం సమర్థవంతంగా వినియోగంలో ఉన్నాయా లేదా అన్న అంశాన్ని పరిశీలిస్తుంది. గత కొన్ని ఏళ్లుగా ప్రభుత్వం ప్రజాప్రయోజనాల నిమిత్తం అనేక సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకు భూములను కేటాయించింది. ఆ ప్రక్రియలో భాగంగా ఆయా భూముల వినియోగంపై వివరాలు కోరుతూ నోటీసులు జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. నోటీసులు అందుకున్న సంస్థల్లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ కూడా ఒకటని, ప్రభుత్వ భూముల వినియోగంపై జరుగుతున్న ఈ వార్షిక ఆడిట్ ఒక సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమేని ఆయన తెలిపారు. ప్రస్తుతం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి కేటాయించిన భూమిని తిరిగి తీసుకునే ఎలాంటి ప్రణాళికలు ప్రభుత్వానికి లేవని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

తమ సందర్శనలో భూమి వినియోగం, విస్తరణ ప్రణాళికలపై యూనివర్సిటీ రిజిస్ట్రార్‌తో విస్తృత చర్చలు నిర్వహించారు. అనంతరం భూమి వినియోగంపై యూనివర్సిటీ ఇచ్చిన వివరణపై జిల్లా కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. రాతపూర్వక వివరణ అందిన వెంటనే షోకాజ్ నోటీసును ఉపసంహరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం వరకు నోటీసు అధికారికంగా రద్దు కాకపోయినా భూమి స్వాధీనం చేసుకునే చర్యలు ప్రారంభించలేదని అధికారులు స్పష్టం చేశారు.

చంపేస్తామని బెదిరింపులొచ్చాయ్: విద్యార్థులు

"మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో నీళ్ల సమస్య ఉంది, ట్రాన్స్ పోర్ట్ సమస్య ఉంది.. ఈ సదుపాయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వం ఈ సమస్యలను పట్టించుకోకుండా, తిరిగి మా భూములపై కన్నేసింది. యూనివ‌ర్శిటీ క్యాంప‌స్‌ను రియ‌ల్ ఎస్టేట్‌గా మారుస్తారా’’ అని విద్యార్థులు ప్రశ్నించారు. ‘‘బ‌డే భాయి డైరెక్ష‌న్‌లోనే ఛోటే భాయి న‌డుస్తున్నారు" అని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

"మా యూనివర్సిటీని రెవెన్యూ జెనరేటర్‌లా చూడకండి. మంత్రి జూపల్లి కృష్ణారావు ఇది రొటీన్ సర్వే అని అంటున్నారు.. కానీ HCUలో కూడా ఇలానే రొటీన్ సర్వే అంటూ వెళ్ళి హంగామా చేశారు. ఇప్పుడు ఇదే పద్దతి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ యూనివర్సిటీలో చేస్తున్నారు. ప్రభుత్వ నోటీసులు చూశాక మేము ఉద్యమం చేయాలని నిర్ణయించుకున్నాం.. ఆ సమయంలో నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. నీకు బ్రతకాలని లేదా? చదువుల తర్వాత ముందుకు వెళ్లాలని లేదా అంటూ నాకు బెదిరింపు కాల్స్ చేశారు" అని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థి ఫెడ‌ర‌ల్ తెలంగాణాతో తెలిపారు.

ఈ పరిణామాలకు ప్రతిస్పందనగా వర్సిటీ విద్యార్థులు క్యాంపస్‌లో నిరసనలు చేపట్టారు. సెంట్రల్ లైబ్రరీ నుంచి బాబ్-ఎ-ఇల్మ్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నోటీసు ప్రజా విద్యపై ప్రత్యక్ష దాడిగా భావిస్తున్నామని విద్యార్థి నాయకులు తెలిపారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చోటు చేసుకున్న భూవివాదాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ అదే పరిస్థితి ఇక్కడా పునరావృతం కాకూడదని హెచ్చరించారు. విశ్వవిద్యాలయ భూమి భవిష్యత్ తరాల విద్యార్థుల కోసం కేటాయించబడినదని, హాస్టళ్లు, గ్రంథాలయాలు, అకడమిక్ మౌలిక సదుపాయాల కోసం వినియోగించాల్సిన భూమిని రిసంప్షన్ పేరుతో ఇవ్వబోమని స్పష్టం చేశారు.

పెరుగుతున్న ఒత్తిళ్లు

యూనివర్సిటీ క్యాంపస్ ఉన్న గచ్చిబౌలి–మణికొండ ప్రాంతం ప్రస్తుతం హైదరాబాద్‌లో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ప్రాంతాల జాబితాలో నిలిచింది. ఐటీ పార్కులు, లగ్జరీ అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్‌లు, మాల్స్ అన్నీ అక్క ఉన్నాయి. ఇప్పటికే రహదారుల నిర్మాణం పేరుతో సుమారు 1.7 నుంచి 1.75 ఎకరాల భూమిని MANUU కోల్పోయిన పరిస్థితిలో మిగిలిన భూమిపై కూడా ఒత్తిడి పెరుగుతోందన్న భయం విద్యార్థులు, అధ్యాపక వర్గంలో వ్యక్తమవుతోంది.

యూనివర్సిటీ భూముల విషయంలో విద్యార్థులు ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. ఈ విషయంలో తమకు అండగా ఉండాలని పలువురు రాజకీయ నాయకులను కూడా కలుస్తున్నారు. తాజాగా శుక్రవారం వర్సిటీ విద్యార్థులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. తమ విశ్వవిద్యాలయానికి చెందిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని వివరించారు.

MANUU హైదరాబాద్‌కి తలమానికం: కేటీఆర్

‘‘హైదరాబాద్‌కి తలమానికంగా దేశంలో ఉన్న ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్ నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నది. విశిష్టమైన యూనివర్సిటీని రియల్ ఎస్టేట్ అవసరాల కోసం కాంగ్రెస్ వాడాలనుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సీరియల్ కిల్లర్ల మాదిరి సీరియల్ ల్యాండ్ స్నాచర్ గా మారింది. అన్ని యూనివర్సిటీల భూములను గుంజుకోవడం ఒక పనిగా పెట్టుకుంది. ముందుగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూమిని హైకోర్టు పేరిట చెప్పి తీసుకున్నది. 400ఎకరాల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమిని గుంజుకునే ప్రయత్నం చేసింది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అయిన కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు.. ఇక్కడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నం చేసింది’’ అని అన్నారు కేటీఆర్.

కానీ హెచ్‌సీయూ భూముల విషయంలో విద్యార్థుల ఆందోళన.. ప్రజల వ్యతిరేకత.. సుప్రీమ్ కోర్ట్ జోక్యం వలన తాత్కాలికంగా ఆగిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం విద్యా సంస్థల భూములను తీసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులకు తమ పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘‘విద్యార్థుల వెంట ఉంటామని వారి పోరాటానికి అండగా ఉంటామని భరోసా ఇస్తున్నాము’’ అని తెలిపారు.

‘‘అవసరమైతే ఉర్దూ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడం కోసం ఢిల్లీలో పోరాటం చేయాల్సి వస్తే అండగా ఉంటాము. ఈ అంశాన్ని అవసరమైతే రాజ్యసభలో మా పార్టీ పార్లమెంట్ సభ్యులు లేవనెత్తుతారు. యూనివర్సిటీ భూముల పైన కాంగ్రెస్ ప్రభుత్వం కన్ను వేయడం ఏమాత్రం మంచిది కాదు. దేశంలో మైనార్టీల సంరక్షకుడిని అని చెప్పుకునే రాహుల్ గాంధీ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను అన్యాక్రాంతం చేయడమే కాపాడడమా? దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి చదువుకుంటున్న మైనార్టీ విద్యార్థుల యూనివర్సిటీని నిర్వీర్యం చేయడమే మీ సంరక్షణనా రాహుల్ గాంధీ సమాధానం చెప్పు. రాహుల్ గాంధీ మొహబ్బత్ కి దుకాణం అని చెప్తున్నది ఇదేనా?’’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యూనివర్సిటీకి అండగా ఉంటామని, కావలసిన విస్తరణ సౌకర్యాలకు నిధులు కూడా కేటాయించి అండగా నిలబడతామని పునరుద్ఘాటించారు.

కాంగ్రెస్ తీరు సిగ్గు చేటు: బండి సంజయ్

విద్యార్థుల భవిష్యత్తుకు కేటాయించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా తీసుకోవడం దారుణమని కేంద్రమంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీకి ఇచ్చిన ప్రభుత్వ నోటీసులు భూమి వినియోగాన్ని ప్రశ్నించడం అసహ్యమైన చర్య అని ఆయన అన్నారు.

‘‘రూ.వేల కోట్ల విలువ ఉన్న యూనివర్సిటీ భూమిని అమ్మే ప్రయత్నమా, ప్రాథమిక సౌకర్యాలను ఇవ్వలేని ప్రభుత్వం విద్య కోసం కేటాయించిన భూమిని ప్రశ్నించడం ఎందుకు? రాష్ట్రంలో చేర్పించిన ప్రభుత్వ భూములపై చర్యలు లేకపోవడం, పాత నగరంలో సల్కం చెరువు అక్రమ భూములపై చర్యలు ఎందుకు తీసుకోబడవు?’’ అని ప్రశ్నించారు.

ఇలాంటి భూములను తిరిగి ప్రజా ఉపయోగానికి ఎందుకు ఉపయోగించరు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘‘యూనివర్సిటీ, విద్యా భూములను తాకడం రెడ్ లైన్; తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన నిర్ణయాన్ని తీసుకుంటే వెంటనే రద్దు చేయాలి. వేరే మార్గం లేకపోతే, నేను విద్యార్థులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతాను’’ అని ఆయన హెచ్చరించారు.

Read More
Next Story