బీజేపీ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?
x

బీజేపీ 8 సీట్లు పెండింగ్‌లో పెట్టడానికి కారణం ఏంటి?

ఇంకో వారం రోజుల్లో సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో బీజేపీ తొలి జాబితా ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు. అయితే


జి ఆర్ సంపత్ కుమార్

తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలకు గానూ బిజేపి 9 స్థానాలకు మాత్రమే అభ్యర్ధులను మాత్రమే ప్రకటించింది. ఆ 8 సీట్లను పెండింగ్ లో పెట్టడానికి కారణాలేంటనే చర్చ జోరుగా కొనసాగుతున్నది. ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం 4 సిట్టింగ్ ఎంపీ స్థానాలుంటే, కేవలం ముగ్గురు సిట్టింగ్ లకే అవకాశం కల్పించింది. దీంతో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపిగా వున్న సోయం బాబూరావును ప్రకటించకపోవడంపై కూడా బిజేపిలో చర్చ జరుగుతున్నది.

అక్కడ కొత్త అభ్యర్థి వస్తారా? లేదా బాపూరావునే రెండో జాబితాలో ఖరారు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది. సోయం బాపూరావు కూడా ఇతర పార్టీ వైపు చూస్తున్నారనే ప్రచారం నేపథ్యంలోనే ఇలా జరిగిందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే తెలంగాణలో రెండు స్థానాలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి. అందులో ఒకటి మల్కాజిగిరి. ఈ స్థానానికి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ నేత మురళీధర్ రావు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ విద్యాసంస్థల యజమాని మల్క కొమరయ్య తీవ్రంగా పోటీపడ్డారు.
దీంతో ఈ స్థానాన్ని పెండింగ్ లో పెడతారు అని అంతా అనుకున్నారు. అయితే, అనూహ్యంగా తొలి జాబితాలోనే మల్కాజిగిరి అభ్యర్థిగా ఈటల రాజేందర్ ను ప్రకటించారు. ఇక ఆసక్తిరేపుతున్న మరో స్థానం జహీరాబాద్. ఇక్కడి సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ రెండు రోజుల క్రితమే బీజేపీలో చేరారు. ఆయనకు టికెట్ వస్తుందా రాదా అని అనుకున్నారు. బీబీ పాటిల్ కు టికెట్ ఇవ్వొద్దని జహీరాబాద్ కు చెందిన కొందరు బీజేపీ నాయకులు, కార్యకర్తలు కోరారు.
అయితే, బీజేపీ హైకమాండ్.. పార్టీలో చేరిన వెంటనే బీబీ పాటిల్ కు అవకాశం కల్పించారు. గతంలో రెండుసార్లు ఆయన బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇక నాలుగు రోజుల క్రితమే బీజేపీలో చేరిన నాగర్ కర్నూల్ సిట్టింగ్ ఎంపీ రాములు కుమారుడు భరత్ కు తొలి జాబితాలోనే అవకాశం దక్కింది.
ఈ క్రమంలోనే మిగతా 8 నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టడానికి కారణాలేంటనే దానిపై బిజేపిలో జోరుగా చర్చ కొనసాగుతున్నది. పెద్దపల్లి నుంచి మందకృష్ణ మాదిగను బరిలోకి దింపాలని ప్రయత్నం చేస్తున్నా ఆయన సుముఖంగా లేనట్టు తెలుస్తున్నది. దీంతో ఆ నియోజక వర్గంలోని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకొని అతనికి టికెట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తున్నది.
వరంగల్ స్థానానకి మొదటగా మాజీ డిజిపి కృష్ణప్రసాద్ ను బరిలో నిలపాలని అనుకున్నా, మరో బలమైన అభ్యర్ది కోసం చూస్తున్నట్లు తెలుస్తున్నది. ఇటీవలికాలంలో ఓటమి చెందిన బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బిజేపిలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. దాంతో ఆయనకోసం దాన్ని పెండింగ్ లో పెట్టినట్లు తెలుస్తున్నది.
ఇక మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ నియోజకవర్గాల్లో బిజేపికి బలమైన అభ్యర్టులు లేకపోవడం, అవి కాంగ్రెస్ పార్టీకి సానుకూలంగా వున్న క్రమంలో నామాత్రంగా పోటీ చెయ్యాలని బిజేపి భావిస్తున్నది. ఎవరైనా ఇతర పార్టీల నుంచి బలమైన అభ్యర్దులు వస్తే వారికి కండువా కప్పి టికెట్ ఇవ్వాలన్న దాంతో పెండింగ్ లో పెట్టారని తెలుస్తున్నది. మహబూబ్ నగర్ స్థానానికి ఇద్దరు ప్రధాన నాయకుల మద్య తీవ్ర పోటీ వున్నది.
బిజేపి జాతీయనాయకులైన డికే అరుణ, జితేందర్ రెడ్డి పోటీపడుతున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జితేందర్ రెడ్డి కుమారునికి టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అతనికి నిరాకరించి డికే అరుణకే టికెట్ ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. మరో నియోజక వర్గమైన మెదక్ లో రఘునందన్ రావుకు టికెట్ వస్తుందని అందరూ భావించారు.
రఘునందన్ రావును వ్యతిరేకిస్తూ ఆప్రాంతంలో వున్న బలమైన రెడ్డి సామాజిక వర్గం అంజిరెడ్డిని రంగంలోకి దింపింది. దీంతో ఆనియోజక వర్గం కూడా పెండింగ్ లో పెట్టారు. ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానమైనా అక్కడ సోయం బాబూరావును కాదని రమేష్ రాథోడ్ ను తెరపైకి తీసుకువచ్చారు.
ఇక్కడ రెడు గిరిజన తెగల మధ్య అంతర్గతంగా వార్ నడుస్తున్న క్రమంలో దాన్ని పక్కకు పెట్టారని, ఇక్కడ కూడా బిఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే బిజేపి వైపు చూస్తున్నట్లు, అతను వస్తే అతనికే టికెట్ ఇవ్వాలని, లేనిపక్షంలో రమేష్ రాథోడ్ కే ఎక్కువగా అవకాశాలున్నట్లు సమాచారం. మొత్తంగా ఈ కారణాలతోనే 8 నియోజక వర్గాలను పెండింగ్ లో పెట్టారని బిజేపి నాయకులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు.


Read More
Next Story